లక్ష మందికి ఇద్దామా!
- జూన్ 2న ఒంటరి మహిళలకు ఆర్థికభృతి అందజేయడంపై సర్కార్ తర్జనభర్జన
- కేవలం 71 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి
- మరొక రోజు గడువు పెంచాలని సెర్ప్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న ఒంటరి మహిళలకు ఆర్థికభృతిని అందించే విషయమై సర్కారు తర్జనభర్జన పడుతోంది. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికభృతిని వర్తింపజేస్తూ జూన్ 2న రెండు నెలల మొత్తాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1,46,280 దరఖాస్తులు అందాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 1,14,010 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి 32,270 దరఖాస్తులు అందాయి.
దరఖాస్తుల పరిశీలన ఈ నెల 25 లోగా పూర్తి చేసి అర్హులకు జూన్ 2న రెండు నెలల భృతిని అందించాల్సి ఉంది. అయితే, గురువారం నాటికి 71,815 దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటిలోనూ 68,076 దరఖాస్తులు అర్హమైనవని తేల్చిన అధికారులు.. 3,739 దరఖాస్తులను తిరస్కరించారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు లక్ష మంది ఒంటరి మహిళలకైనా లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని సెర్ప్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గురువారంతో ముగియగా, శుక్రవారం వరకు పొడిగిం చాలని నిర్ణయించినట్లు తెలిసింది.
బీడీ కార్మికులకు మరింత వెసులుబాటు
ఆసరా పింఛన్‌దారులున్న కుటుంబాల్లోని బీడీ కార్మికులకు కూడా ఆర్థికభృతిని ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ఇటీవల వెసులు బాటు కల్పించింది. అయినప్పటికీ సర్కారు ఆశించిన మేరకు దర ఖాస్తులు అందలేదు. దాదాపు 80 వేల నుంచి లక్ష వరకు దర ఖాస్తులు రావచ్చని సర్కారు అంచనా వేయగా, దరఖాస్తు గడువు ముగిసే నాటికి కేవలం 49 వేల దరఖాస్తులు అందాయి. దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం... ఒక కుటుంబంలో ఒక బీడీ కార్మికుడికే ఆర్థికభృతిని అందించాలనే నిబంధనను తాజాగా సవరించింది. దీంతో ఒకే కుటుంబంలో ఎంతమంది బీడీ కార్మికులు ఉన్నప్పటికీ ఆర్థికభృతికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది.
ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో గురువారం నాటికి మరో 10 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. మొత్తంగా 59,822 దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా గురువారం నాటికి 36,415 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందులో 19,286 దరఖాస్తులను అర్హమైనవిగా అధికారులు తేల్చారు. దరఖాస్తుల పరిశీలనకు శుక్రవారం వరకు గడువు పొడిగించిన అధికారులు... జూన్ 2 నాటికి కనీసం 25 వేలమంది బీడీ కార్మికులకు కొత్తగా ఆర్థికభృతి అందించాలని భావిస్తున్నారు.