పండుటాకులకు పండుగ లేదా?
♦ దసరాకు అందని ఆసరా నిధులు విడుదల చేయని ఆర్థికశాఖ
♦ ఆసరా నిధులను ఆరోగ్యశ్రీకి ఇవ్వడమే కారణమంటున్న సిబ్బంది
♦ పండుగ రోజున మొక్కుబడిగా కొత్త పెన్షనర్లకు మంజూరు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ వచ్చినా ఆసరా లబ్ధిదారుల చేతికి పింఛన్ అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా 35.73 లక్షలమంది లబ్ధిదారులు పండుగ రోజుకైనా పింఛన్ రాకపోతుందా అని పదిరోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. పింఛన్ల పంపిణీ నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సమర్పించిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ లభించలేదని తెలిసింది. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకపోవడంతో దసరాలోగా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేకపోయిందని సెర్ప్ అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. జూలై, ఆగస్టుల్లో ఆమోదం పొందిన కొత్త దరఖాస్తులకు పింఛన్ మంజూరు చేసింది.
దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అయితే, కొత్త పెన్షనర్లకూ పాత లబ్ధిదారులతోపాటే పండుగ తర్వాతే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు సెర్ప్ సిబ్బంది తెలిపారు. ఆసరా పథకం నిధులను ఆరోగ్యశ్రీకి మళ్లించినందునే పరిస్థితి ఏర్పడిందని మరికొందరు చెబుతున్నారు. ఆర్థికశాఖ నుంచి నిధులు రాకపోవడం వల్లే పింఛన్‌ను పండుగలోగా ఇవ్వలేకపోయామని, నెలాఖరులోగా పింఛన్ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని సెర్ప్ ఇన్‌చార్జి సీఈవో అనితా రాంచంద్రన్ తెలిపారు.