
పీడీ కిషోర్ కుమార్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెల రోజులుగా ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇక్కడ పీడీగా పనిచేసిన ఎస్.తనూజారాణిని మాతృశాఖకు బదిలీ అయిన విషయం విధితమే. ఇంతవరకు ఇన్‌చార్జి బాధ్యతలను జేసీ–2 పి.రజనీ కాంతారావు నిర్వహించారు. ఆయన నుంచి కిషోర్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. కిషోర్‌కుమార్ రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నారు. 2007 గ్రూప్ వన్ బ్యాచ్‌కు చెందిన కిషోర్ కుమార్ విశాఖపట్నంలో పనిచేశారు. ఇటీవల కొంత కాలం ఖాళీగా ఉన్న తరువాత ప్రభుత్వం ఇక్కడ పీడీగా నియమించింది. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అందజేసే పథకాలు, మహిళా ప్రగతి, ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అందేవిధంగా పనిచేస్తానన్నారు. మహిళలను ఆర్థికంగా బలమైన శక్తిగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, సంఘాలను బలోపేతం చేస్తానని చెప్పారు. మంగళవారం అన్ని స్థాయిల అధికారులతో సమావేశం నిర్వహించి, జిల్లాలోని పరిస్థితులు తెలుసుకొని మంచి పాలన అందించేందుకు కృషిచేస్తామన్నారు.