డబ్బుతో సెటిల్ చేయాలనుకోవడం దుర్మార్గం
తిరుపతి : వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బుతో సెటిల్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఇది దుర్మార్గమైన చర్యగా ఆమె వర్ణించారు. మంగళవారం తిరుపతిలో యాంటి ర్యాగింగ్ పోస్టర్ను రోజా విడుదల చేశారు. అనంతరం రోజా మాట్లాడుతూ.... చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. రిషితేశ్వరి ఘటనలో రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప స్పందించలేదన్నారు.
ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో నాగార్జున యూనివర్శిటీ వీసీ, ప్రిన్సిపల్ను తక్షణం అరెస్ట్ చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిషితేశ్వరి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వానికి రోజా సూచించారు. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్వార్వో డి. వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సీహెచ్ ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే ర్యాగింగ్ కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.