
సాక్షి, అమరావతి: మహిళల జోలికి వచ్చే మానవ మృగాళ్ల భరతం పట్టడానికి తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చట్టం తేవడానికి నడుం కడితే ఉల్లి సాకుతో సభను అడ్డుకుంటారా? అని నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. స్త్రీ మూర్తిని గౌరవించాల్సింది పోయి అవమానిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. ఆడపిల్లకు కష్టంవస్తే.. గన్ వచ్చేలోగా జగన్ వచ్చి శిక్షిస్తాడన్న ఒక నమ్మకం కావాలన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆమె మాట్లాడారు. స్పీకర్ పోడియం ఎదుట నిలబడి ఉల్లిపై ముందు చర్చ జరగాలంటూ పట్టుబట్టి గందరగోళం సృష్టించిన టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక దశలో ఆమె ‘మీరసలు మనుషులేనా? మాతృమూర్తులను గౌరవించకపోగా ఉల్లితో పోటీపెట్టి అవమానిస్తారా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా?’.. అంటూ ఘాటుగా విమర్శించారు. అంతేకాక..లోకేష్‌కు పప్పులో ఉల్లిలేదని చంద్రబాబు బాధపడుతున్నారా? అని ఆమె ఎద్దేవా చేశారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్, లోకేశ్ ఫొటోలు, బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎక్కడ మాట్లాడుతారోనన్న భయమా? అని ఆమె ప్రశ్నించారు. బాబుకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయనకు తెలియదన్నారు. కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా? అని ఒకసారి.. ఆడవారి పుట్టుకపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన ఈరోజు మహిళల భద్రతపై మాట్లాడేందుకు అవకాశం లేకుండా కూడా అడ్డుపడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ దశలో అధికార పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సభ మధ్యలోకి వెళ్లి తమకు న్యాయం చేయాలని, తమ భద్రతపై చర్చ జరుగుతుంటే ఇదేం అల్లరని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఆడవాళ్ల ప్రదేశ్‌గా మారాలి అని రోజా అన్నారు. ఇదే సందర్భంలో మానవ హక్కుల సంఘం తీరునూ ఆమె దుయ్యబట్టారు.
గుట్టురట్టవుతుందనే ఉల్లి నాటకం? రజని
మహిళా భద్రతపై అసెంబ్లీలో చర్చ జరిగితే గత ఐదేళ్లలో మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చేసిన అకృత్యాలు బయటపడతాయని ఉల్లి నాటకం ఆడుతున్నారా? అని గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విడదల రజని విపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. మహిళల భద్రతపై వారికి చిత్తశుద్ధి లేకపోవడంవల్లే ప్రజలు టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.
తొలినుంచీ చంద్రబాబు ఇంతే.. : ఉషశ్రీ
చర్చలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. నేరాల తగ్గింపునకు మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తున్న తమ ముఖ్యమంత్రి మహిళల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారని తెలిపారు. చంద్రబాబు తీరు తొలి నుంచీ ఇలాగే ఉందని, మహిళలకు రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు ఎలా గందరగోళం సృష్టించారో ఇప్పుడు మహిళా భద్రతపై జరుగుతున్న చర్చలోనూ అదే తీరును ప్రదర్శింస్తున్నారని విమర్శించారు.
వైఎస్ జగన్ రియల్ హీరో : ధనలక్ష్మీ
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కూడా చర్చలో పాల్గొంటూ.. మహిళలకు భద్రత కల్పిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన హీరో అని అభివర్ణించారు. పవన్‌కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆడపిల్లలకు స్వీయరక్షణపై తర్ఫీదునివ్వాలని ఆమె కోరారు.