తొడగొట్టిన రౌడీ రాజ్యం | mla and his aides attacked me, says lady mro | Sakshi
Sakshi News home page

తొడగొట్టిన రౌడీ రాజ్యం

Published Thu, Jul 9 2015 4:29 AM | Last Updated on Thu, Apr 4 2019 12:56 PM

తొడగొట్టిన రౌడీ రాజ్యం - Sakshi

తొడగొట్టిన రౌడీ రాజ్యం

మహిళా తహసీల్దార్‌పై ఎమ్మెల్యే చింతమనేని దాడి
ముసునూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోయారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు ఆర్‌ఐపై దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఈ విషయం తెలుసుకుని వచ్చిన మహిళా తహసీల్దార్‌పై విచక్షణారహితంగా దాడి చేయించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా నిల్చున్న ఆమెను దుర్బాషలాడారు. ఆమెను తీవ్రంగా కొట్టించి, ఇసుకలో లాగించి పక్కన పడేయించారు.

ఆమె సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేయించారు. అడ్డువచ్చిన ఇతర అధికారులను కూడా చితకబాదించారు. ఏదైనా ఉంటే కలెక్టర్‌కు లెటర్ రాసుకో... నేనిప్పుడు ఇసుక తోలుకెళ్తున్నానంటూ దౌర్జన్యంగా ఇసుక తోలుకెళ్లారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి విలేకరిని  ఎమ్మెల్యే అనుచరులు  తీవ్రంగా కొట్టి, కెమెరా లాక్కొని మెమరీ కార్డును తీసుకుని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యంతో మనస్తాపం చెందిన మహిళాధికారి ఈ విషయమై సీఎంకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వివరాల్లోకి వెళితే...

కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరు నుంచి ఇసుకను చింతమనేని వందలాది ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తహశీల్దారు వనజాక్షి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) మరియన్నను సంఘటనాస్థలానికి పంపించారు. అక్కడకు వెళ్లిన ఆర్‌ఐని ఎమ్మెల్యే మనుషులు అడ్డుకొని దౌర్జన్యం చేసి నిర్బంధించారు. ఆయన ఈ విషయాన్ని తహశీల్దారుకు, ముసునూరు పోలీసులకు ఫోన్‌లో తెలియజేశారు. ముసునూరు ఎస్‌ఐ పి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు తమ్మిలేరుకు చేరుకున్నారు.

రికార్డులుంటే చూపించి మాట్లాడాలని పోలీసుల సమక్షంలోనే ఆర్‌ఐని ప్రభాకర్ నిలదీశారు. సరిహద్దుకు సంబంధించిన రికార్డులు తనవద్ద లేకపోవడంతో ఆర్‌ఐ మిన్నకుండిపోయారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు ట్రాక్టర్లలో యధేచ్ఛగా ఇసుక రవాణాను కొనసాగించారు. ఈ విషయం తెలుసుకున్న ముసునూరు తహశీల్దారు వనజాక్షి మధ్యాహ్నం మూడు గంటల వేళ అక్కడకు చేరుకుని ఇసుక రవాణాను ఆపాలని కోరారు. ఎమ్మెల్యే అనుచరులు ఖాతరు చేయకపోవడంతో వాహనాలకు అడ్డంగా కూర్చున్నారు.

అక్కడినుంచే కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌లో విషయం తెలిపారు. అనంతరం ఘటనాస్థలం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే చింతమనేని... మీకు ఫోన్‌లో విషయం తెలిపినప్పటికీ ట్రాక్టర్లకు అడ్డంగా ఎందుకు కూర్చున్నారంటూ తహసీల్దార్‌ను దుర్భాషలాడారు. ఇసుక తరలిస్తున్న ప్రదేశం ముసునూరు మండలానికి సంబంధించింది కాబట్టి తరలించడానికి తాను ఒప్పుకోనని అమె అక్కడే బైఠాయించారు. రేపు సర్వేయర్ వచ్చి హద్దులు నిర్దేశించాక మీదైతే తోలుకోవచ్చని స్పష్టంచేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఆమెపై తన అనుచరులను ఉసిగొల్పారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, డ్వాక్రా మహిళలు మూకుమ్మడిగా మహిళా తహశీల్దారుపై దాడి చేశారు.

ఆమెకు తీవ్రంగా గాయపరిచి ఇసుకలో లాగి పక్కన పడేశారు. దాడిని అడ్డుకున్న తహశీల్దారు కార్యాలయ సిబ్బందిని ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. విషయం తెలిసి అధికారులతోపాటు అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ విలేకరి కర్రా నవీన్‌కుమార్ తహశీల్దార్‌పై దాడి దృశ్యాలను తన కెమెరాలో బంధిస్తుండటం చూసిన ప్రభాకర్ అనుచరులు మూకుమ్మడిగా వచ్చి పిడిగుద్దులు గుద్దుతూ వాగులో పడేసి కొట్టారు. అతడి దగ్గరున్న సెల్‌ఫోన్‌ను, కెమెరాను లాక్కొన్నారు. ఆ తర్వాత పొక్లెయిన్‌తో ఇసుక తవ్వుకుని అక్రమంగా తరలించారు. ఈ దాడి సమాచారం అందుకున్న రెవెన్యూ,పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు వచ్చి పరిస్థితులను తెలుసుకున్నారు.
 
పుష్కర విధుల బహిష్కరణ
కాకినాడ సిటీ: చింతమనేని, ఆయన అనుచరుల తీరు అమానుషమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పితాని త్రినాథరావుఅన్నారు. నిందితులను 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పుష్కర సేవలను బహిష్కరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది
* ఎమ్మెల్యే దాడిలో గాయపడిన మహిళా తహశీల్దార్
‘‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే మహిళనని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు తిట్టడమేమిటి? వారి ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు అనుచరులతో దాడి చేయించడమేమిటి? అందరిముందూ ఇంత అవమానం జరిగాక బతకాలనిపించడంలేదు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది’’ అని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి వాపోయారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరుల దాడిలో బుధవారం తీవ్రగాయాలపాలైన ఆమె మీడియాతో మాట్లాడుతూ...

ఎమ్మెల్యేపై కేసు పెడతామని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోనని స్పష్టంచేశారు. రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో మాట్లాడాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.  బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యేనే అనుచరులతో మమ్మల్ని కొట్టిస్తే మాకు విలువేముంటుందని ప్రశ్నించారు. ఇంత జరిగాక బతకాలనిపించడంలేదని, సూసైడ్ చేసుకోవాలనిపిస్తోందని ఆమె కన్నీరు మున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement