
మహిళా ఎమ్మార్వోపై ఎమ్మెల్యే చింతమనేని దాడి
కృష్ణాజిల్లాలోని ఒక మహిళా ఎమ్మార్వోపై పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేశారు. అక్కడే ఉండి, ఆ దృశ్యాలను ఫొటో తీస్తున్న సాక్షి విలేకరి నవీన్పై కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు భౌతిక దాడి చేసి, కెమెరాను నేలకేసి కొట్టారు. దాంతో అది పగిలిపోయింది. పోలీసులకు ఫోన్ చేస్తానని అనగా.. ఫోన్ కూడా విసిరేశారు.
ముసునూరు మండలం రంగంపేటలో ఉన్న ఇసుక రీచ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ విషయం తెలిసిన ఎమ్మార్వో వనజాక్షిని అక్కడున్న ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దాంతోపాటు వాళ్లు ఎమ్మెల్యేకు చెప్పడంతో ఆయన స్వయంగా అనుచరులను తీసుకుని అక్కడకు వచ్చారు. ఎమ్మార్వోపై ప్రభాకర్ తదితరులు దాడి చేశారు. ఇసుక రీచ్ వద్ద బీభత్సమైన వాతావరణాన్ని సృష్టించారు. ఇసుక అక్రమ రవాణాను ఎవరైనా అడ్డుకుంటే ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులకు తెలియడంతో వారు కూడా అక్కడకు వెళ్తున్నారు. చింతమనేనిపై గతంలో ఏలూరు పోలీసు స్టేషన్లో రౌడీషీట్ ఉంది. కోడిపందాలు, ఇతర సందర్భాలలో కూడా పోలీసుల పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించారు.