
ఆమెదే తప్పని ఎలా నిర్ణయిస్తారు ?
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అభిప్రాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. ఈ వ్యవహారంపై గురువారం హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు స్పందించారు. ఈ అంశంలో ఎమ్మార్వో వనజాక్షిదే తప్పని ఏపీ కేబినెట్ అభిప్రాయాన్ని ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు.
వనజాక్షి వ్యవహారంలో దర్యాప్తే జరగకుండా ఆమెదే తప్పని ఎలా నిర్ణయిస్తారని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై చంద్రబాబు సింగపూర్ సంస్థలతో ముందే ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణంలో వ్యాపార ఉద్దేశం తప్పా ప్రజా ప్రయోజనాలు లేవని విమర్శించారు.
పుష్కరాల తొక్కిసలాటపై కేబినెట్ మంత్రులే కేసు పక్కదోవ పట్టేలా మాట్లాడితే... నిష్పక్షపాత దర్యాప్తు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన రోజురోజుకు దిగజారిపోతుందన్నారు. మీకు పరిపాలన అనుభవం ఉందని ఓటు వేస్తే మరీ ఇంతదిగజారి వ్యవహరిస్తారా అని చంద్రబాబును ధర్మాన ప్రశ్నించారు.