సమావేశంలో మాట్లాడుతున్న ధర్మాన ప్రసాదరావు
అచ్యుతాపురం (యలమంచిలి): చంద్రబాబు వరుస మోసాలతో మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్నాడని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రావాలి జగన్–కావాలి జగన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ యలమంచిలి సమన్వయకర్త యు.వి.రమణమూర్తిరాజు ఆధ్వర్యంలో అచ్యుతాపురంలో ఆదివారం ఏర్పాటుచేసిన భారీ ముగింపు సభలో ధర్మాన మాట్లాడారు. చంద్రబాబు గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి పసుపుకుంకుమ కింద కేవలం మూడువేలు ఇచ్చి సరిపెట్టాడన్నారు.
చంద్రబాబు మాటలు నమ్మి మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయని, బ్యాంకు మేనేజర్లు పెరిగిన వడ్డీతోసహా ముక్కుపిండి వసూలుచేశారని చెప్పారు. మహిళలకు మాయమాటలుచెప్పి మరోసారి మోసంచేయాలని చంద్రబాబు చూస్తున్నాడని, అతని మాటలు నమ్మవద్దని కోరారు. పంటకు గిట్టుబాటుధర ఇవ్వకుండా బ్యాంకు ఖాతాలో రూ. వెయ్యి వేసి రైతుల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తానని లేదా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసంచేశాడని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు బీజేపీ పాలన బాగుందని కితాబు ఇచ్చిన చంద్రబాబు చివరి నిమిషంలో మాటమార్చాడన్నారు. రాష్ట్రాన్ని పాలించే వ్యక్తికి నిబద్ధత లేకుంటే ప్రజలకు ఏవిధంగా సేవలు అందుతాయని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంత అవినీతిపాలన ఎన్నడూ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతిలో నిర్మాణాలు అంటూ కేవలం ప్రచారం కోసం రూ. 400 కోట్లు ఖర్చుచేశాడన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన కావాలని ప్రజలు కోరితేనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీని స్థాపించారని, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శరగడం చిన్నప్పలనాయుడు, వరుదు కల్యాణి, గుడివాడ అమరనాథ్, గొల్ల బాబూరావు, సూర్యనారాయణరాజు, కె.కె.రాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment