సాక్షి, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ చట్టం- 2020 గవర్నర్ ఆమోదం ద్వారా చట్టబద్దం అయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ అనేది చారిత్రాత్మక నిర్ణయం. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ చట్టం ఉద్ధేశ్యం. రాజ్యాంగబద్దమైన చర్యల ద్వారా ఈ చట్టం సంపూర్ణంగా వెలువడింది. సీఎం జగన్ పట్టుదల, ప్రయత్నంతోనే ఇది కార్యరూపం దాల్చింది. ప్రజాస్వామ్యవాదులు దీనిని సమర్ధించాలి. ఇది ఆర్టికల్ 38, 39కి లోబడే ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ మూలసూత్రం ప్రపంచం మొత్తం ఆచరిస్తోంది. గొప్ప నగర నిర్మాణాన్ని రాజధానితో ముడిపెట్టి చంద్రబాబు తప్పు చేశారు. (చంద్రబాబుకు మంత్రి కొడాలి నాని సవాల్)
నేడు ప్రజల ఆకాంక్షలకు చట్ట రూపం వచ్చింది. ఈ చట్టాన్ని తదుపరి దశకు తీసుకువెళ్లాలి. విశాఖపట్నం, అమరావతి, కర్నూలుకు రాజధానిలో ప్రాధాన్యత ఇస్తే తప్పేంటి. తెలంగాణా తరహా ఉద్యమాలు భవిష్యత్తులో రాకుండా ఈ చట్టం పనిచేస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ, జిల్లాల విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. గ్రామస్థాయిలో సచివాలయాల ద్వారా ద్వారా జరుగుతున్న లబ్ధి ఇప్పటికే ప్రజలు గుర్తించారు. ఇలాంటి చట్టాలు తీసుకురాకుండా ఉంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేము. మరోసారి అధికార కేంద్రీకృతం చేసి తప్పులు చేయకూడదు. శివరామకృష్ణ కమిటీ, వరల్డ్ బ్యాంక్ కూడా పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్పాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష ఇన్నాళ్లకు తీరింది. వికేంద్రీకరణ బిల్లును ప్రజలు మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. ఈ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు కి లేదు' అంటూ ధర్మాన హితువు పలికారు. (అందరికీ కృతజ్ఞుడిని: విజయసాయి రెడ్డి)
Comments
Please login to add a commentAdd a comment