తప్పంతా ఆమెదేనా..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : నిబద్ధతతో పని చేస్తూ ప్రజా ధనాన్ని కాపాడేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేసిన ముసునూరు తహశీల్దార్ వనజాక్షి ఉదంతంలో తప్పంతా ఆమెదేనంటూ రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దందా చేస్తుంటే.. ప్రశ్నించి అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షిని అవమానించడమే కాకుండా ఈడ్చి వేశారు. అడ్డుపడిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేశారు. పైగా ఆయన అనుచర వర్గం ఏలూరులో చిందులు వేసి తహశీల్దార్‌పై ఎదురు దాడికి దిగారు.
రాష్ట్ర వ్యాప్తంగా వనజాక్షి చర్యను సమర్థించిన పలు ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇప్పుడు సీఎం తీరునుచూసి విస్తుపోతున్నాయి. తాను దుడుకు స్వభావినని, అందువల్ల తాను తప్పుచేసి ఉంటే క్షమించాలని ఎమ్మెల్యేనే స్వయంగా చెప్పినా మంత్రులు ఆయన తప్పు చేయలేదని తీర్మానించడాన్ని ఉద్యోగ సంఘాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మచ్చుకైనా ఎమ్మెల్యే చేత భవిష్యత్‌లో ఇటువంటి తప్పులు జరగకుండా చూస్తానని చెప్పిండడంలో చంద్రబాబు విఫలం కావడమే కాకుండా తమ ఎమ్మెల్యేలు ఎవరినైనా ఇలాగే చేస్తారని పరోక్షంగా హెచ్చరించారు.
పాశవిక పాలనకు తెర తీశారు...
రాజమండ్రిలో బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తహశీల్దార్ వనజాక్షే తప్పు చేశారంటూ మంత్రులు నిర్ణయించడంతో చంద్రబాబు తన పాశవిక పాలనకు తెరతీసినట్లయిందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసే వరకు తన పోరాటం ఆగదని, ఇటువంటి పాలకులు ఉంటే తనలాంటి అధికారి ఉరివేసుకొని చావడమే మేలని బహిరంగంగా తహశీల్దార్ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర గర్హనీయమని పేర్కొంటున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు కూడా చంద్రబాబు తన ఇంటికి వనజాక్షిని పిలిపించి హెచ్చరించడంతో వెనకడుగు వేశారనేది పలువురి వాదన.
మీరు అక్కడికి ఎందుకు వెళ్లారని సీఎం స్వయంగా అధికారిని ఇంటికి పిలిపించి నిలదీశారంటే.. తమ ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో దందాలకు పాల్పడినా వాటిని పట్టించుకోవద్దని స్పష్టం చేసినట్లయిందనే భావన వ్యక్తమవుతోంది. తహశీల్దారు తన ఇంటి ఆస్తులను కాపాడుకునేందుకు అక్కడికి వెళ్లలేదని, ప్రజల ఆస్తి, ప్రకృతి సంపదను కాపాడేందుకు వెళ్లారని, పరిధి తేలిన తర్వాత తీసుకుపోవచ్చని తాను అడ్డుకున్న రోజునే వెల్లడించారని.. అయినా ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా పాలకులు తీసుకున్న నిర్ణయంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కమిటీ కథ కంచికేనా?
వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసిన విషయంపై విచారణ కోసం ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు ఇంతవరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పైగా బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఈ విషయం చర్చకు రాలేదు. దీనిని బట్టి కమిటీ వ్యవహారం కంచికి పోయినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చిత్త శుద్ధి ఉన్న ఐఏఎస్‌ను నియమిస్తే ఎమ్మెల్యే చేసిన తప్పు ఎక్కడ బయటకు వస్తుందోననే భయం టీడీపీ నేతల్లో ఉంది.
ఈ వ్యవహారంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకుల్లో కూడా తీవ్ర అసంతృప్తి ఉంది. అయితే సీఎం చర్యను ఖండించేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారు ప్రశ్నించలేకపోతున్నారు. తాము ఉద్యోగులమని, తమపై కక్షగట్టే అవకాశం ఉందని, తమను వదిలేయండంటూ కొందరు ఉద్యోగ సంఘాల నేతలు 'సాక్షి'కి చెప్పడం గమనార్హం.
ఎంపీలు, ఎమ్మెల్యేలకే అప్పగించండి
రాష్ట్రంలో పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను రద్దు చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలకే రాజ్యాలను అప్పగించినట్లు జిల్లాలను, నియోజ కవర్గాలను అప్పగిస్తే వారే దందాలు చేసి ప్రజల నుంచి మామూళ్లు వసూలు చేసుకుంటారు. నిజాయతీగా పనిచేసిన తహశీల్దార్ వనజాక్షిని తప్పు చేసిందంటూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించడం ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట. మహిళా అధికారిపై దాడి చేసిన ఎమ్మెల్యేను చంద్రబాబు వెనుకేసుకురావడం ఆయన చేతకానితనానికి నిదర్శనం.
- వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం అధ్యక్షుడు
ప్రభుత్వం పరిధి దాటింది
తహశీల్దార్ వనజాక్షి తన పరిధి దాటలేదు.. రాష్ట్ర ప్రభుత్వమే తన అధికార పరిధిని దాటి వ్యవహరించింది. ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా అధికారిని పరిధి దాటిం దంటూ నిస్సిగ్గుగా రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయిం చడం సిగ్గుచేటు. మహిళా అధికారిపై దౌర్జనానికి పాల్పడిన ఎమ్మెల్యేకు మద్దతుగా నిలవటం దారుణం. -బాబూరావు, సీపీఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్
ఎన్జీవో నేతలు తేల్చుకోవాలి
నిజాయతీగా పనిచేసిన వనజాక్షినే రాష్ట్ర క్యాబినెట్ తప్పుపట్టింది. ఇప్పుడు ఎన్జీవో నేతలు న్యాయం పక్షం నిల బడి పోరాడతారా? లేక చంద్రబాబుకు తొత్తులుగా మారతారా అనేది తేల్చుకోవాలి. రాష్ట్ర క్యాబినెట్ ఇసుక మాఫియాకు మద్దతుగా నిలబడటం హేయం. మహిళలకు రక్షణ కల్పిస్తానని హామీలు గుప్పించిన చంద్రబాబు.. ఇప్పుడు మహిళా అధికారిపై దాడి జరిగితేనే పట్టించుకోకపోవడం బాధాకరం. - మల్లాది విష్ణు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు
క్యాబినెట్ నిర్ణయం కోరలేదు
ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనప్పుడు వన్‌మేన్ కమిటీ వేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కమిటీ నివేదిక ఆధారంగా తప్పొప్పులు నిర్ణయిస్తామని పేర్కొన్నారు. క్యాబినెట్‌లో చర్చించడం సరి కాదు. క్యాబినెట్ నిర్ణయంతో మాకు సంబంధం లేదు. సీఎం హామీ మేరకు సీనియర్ ఐఏఎస్ అధికారితో వన్‌మేన్ కమిటీ వేయాలి. - పి.వాసు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ
కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
తహశీల్దార్ వనజాక్షిపై ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కమిటీ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. బుధవారం రాజమండ్రిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం నాకు తెలియదు. -చంద్రశేఖరరావు , రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, జిల్లా అధ్యక్షుడు