తహసీల్దార్‌పై దాడిచేస్తున్న మహిళలు, అడ్డుకుంటున్న వీఆర్వో
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ రూరల్ మండలం తహసీల్దార్ డి. వనజాక్షిపై టీడీపీ నాయకుల ప్రోద్బలంతో కొందరు నేతలు, మహిళలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లిలో చోటుచేసుకుంది. పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేసేందుకు సోమవారం రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. ముందస్తు ప్రణాళిక మేరకు టీడీపీ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, మహిళల్ని రెచ్చగొట్టి గ్రామసభను అడ్డుకున్నారు. తహసీల్దారు వారికి సర్దిచెబుతూ ‘మాకు రూ.2 లక్షలు కమీషన్ ఇస్తే మీకు ఎకరాకు రూ.50 లక్షల పరిహారాన్ని ప్రభుత్వంతో ఇప్పిస్తామని కొందరు దళారులు ప్రతిపాదనలు చేసినట్లు నా దృష్టికొచ్చింది.
ముందుగా అలాంటి బ్రోకర్లు ఎవరైనా ఉంటే గ్రామ సభ నుంచి బయటకెళ్లాలి’ అని ఆమె కోరారు. ‘పట్టా భూములకు ఎకరానికి రూ.40 లక్షలు, అసైన్డ్ భూములకు ఎకరానికి రూ.30 లక్షలు, పీఓటీ భూములకు ఎకరానికి రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ధర ప్రకటించింది’అని తెలిపారు. అయితే, ఆమె మాటలను లెక్కచేయకుండా.. ‘మమ్మల్ని బ్రోకర్లుగా సంబోధిస్తారా..’ తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ మాజీమంత్రి అనుచరుడు బొర్రా పున్నారావుతోపాటు మరికొందరు టీడీపీ నేతలు తహసీల్దారు వనజాక్షికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రభస సృష్టించారు. ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఆ సమయంలో టీడీపీ నేతలతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కోట కళ్యాణ్ మహిళల్ని రెచ్చగొట్టారు. దీంతో రెచ్చిపోయిన మహిళలు వనజాక్షిని చుట్టుముట్టి.. ఆమె చీరను చింపేసి దాడి చేశారు.
గోళ్లతో రక్కేశారు. కొందరు పురుషులు ఆమెను దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో పోలీసులు వనజాక్షికి రక్షణగా నిలిచి ఆమెను గ్రామసభ నుంచి బయటకు తీసుకొచ్చారు. మహిళలు కొట్టండి.. కొట్టండి అంటూ ఆమెను వెంబడించారు. దీంతో తహసీల్దార్ తన వాహనం వద్దకు వెళ్లగా ఆందోళనకారులు ఆమె కారు తాళాలను తీసుకోవడంతో పోలీసు వాహనంలో విజయవాడ చేరుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు జరిగిన ఘటన గురించి ఆమె తెలియజేశారు. అనంతరం వారి ఆదేశాల మేరకు తనపై దాడికి పాల్పడ్డ వారిపై టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ తహసీల్దారు వనజాక్షిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment