ఉద్యోగానికి వెళ్లమందని తల్లిని చంపేసింది...
కేకేనగర్: ఉద్యోగానికి వెళ్లమని ఒత్తిడి చేసిన తల్లిని కుమార్తె కత్తెరతో పొడిచి హత్య చేసింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పల్లావరం సమీపంలోని అనకాపుత్తూరు, గురుసామి నగర్ నాలుగవ వీధికి చెందిన మహిళ వనజ (58). టైలర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లో కుట్టుపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇలావుండగా ఆమె భర్త బాలవరదరాజన్ గత ఏడాది అనారోగ్య కారణంగా మృతిచెందారు. వనజ కుమార్తె గాయత్రి (26) బీఎస్సీ చదివి ప్రైవేటు కంపెనీలో పనిచేసింది.
ఆరు నెలలుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడంతో కుమార్తెపై వనజ ఒత్తిడి తెచ్చింది. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అక్కడికి వెళతానని గాయత్రి చెప్పడంతో వనజ అంతదూరం వద్దు, ఇక్కడే చూసుకోమని తెలిపింది. దీంతో తల్లి, కుమార్తెల మధ్య వాగ్వాదం పెరిగింది. ఆదివారం ఇద్దరి మధ్య జరిగిన తగాదాలో ఆగ్రహించిన గాయత్రి తన తల్లిపై కత్తెరతో దాడి చేసింది.
దీంతో వనజ అక్కడికక్కడే మృతిచెందింది. 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. దీనిపై క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం జరిపి కుటుంబీకులకు అప్పగించారు. దీనిపై క్రోంపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.