కట్న దాహానికి నవవధువు బలి
హత్య చేసి, ఆపై నిప్పంటించిన భర్త?
రాజేంద్రనగర్: కట్నం దాహానికి నవవధువు బలైపోయింది. భర్తే ఆమెను హత్య చేసి, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అసలు విషయం తెలుస్తుందంటున్నారు. నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... మొయినాబాద్‌కు చెందిన వనజ (21)కు ఖానాపూర్‌కు చెందిన నవీన్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 50 వేల నగదు, 10 తులాల బంగారం, 20 తులాల వెండి, బైక్, ఇతర సామగ్రి కట్నంగా ఇచ్చారు. కాగా, పెళ్లైనప్పటి నుంచి లక్ష రూపాయలు అదనపు కట్నం తీసుకురావాలని వనజను నవీన్ వేధిస్తున్నాడు.
జులాయిగా తిరిగే అతను కొన్ని రోజులుగా తాగివచ్చి చితక బాదుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు నవీన్ ఇంటి నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు తలుపుతీసి చూడగా వనజ మంటల్లో కాలిపోతూ కనిపించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే వనజ మృతి చెందింది. ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, మధ్యాహ్నాం బయట నుంచి తలుపు గొళ్లెంపెట్టి నవీన్ బయటకు వెళ్లాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడే ముందుగా భార్యను హత్య చేసి, తర్వాత మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.