నూరు దుర్మార్గాలు పళ్లు నూరినా కలత చెందని మహాధీర ఆమె. ఇసుక మాఫియాను బ్యాండ్ వాయించి... వారి మోసాన్ని లోకానికి చాటి చెప్పింది. ఇంకా ఇలాంటి మహా మహిళామతల్లులు ఉన్నారు కాబట్టే... భూమి మీద ఇసుక ఉంది. ఇసుక కింద తడి ఉంది. రైతు నాలుగు గింజలు పండించగలుగుతున్నాడు.
‘‘మాది కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని వేలేరు గ్రామం. మా నాన్న దోనవల్లి భాస్కర్రావు సాధారణ రైతు. ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. తమ్ముడు అందరికంటే చిన్నవాడు. అప్పట్లో అమ్మాయిలు ఎక్కువ చదువుకుంటే పెళ్లి పెద్ద సమస్య అయ్యేది. నాకు పద్దెనిమిదేళ్లకి పెళ్లి కావడానికి ఇవన్నీ కారణాలే. అయితే నా అదృష్టం ఏమిటంటే... నా చదువు గురించి మా వారు శ్రద్ధ చూపించడం. పెళ్లయిన కొత్తలో ఓ సారి... నాకు చదువుకోవాలని ఉంటే నాన్న పెళ్లి చేసుకోమన్నాడని చెప్పాను. ఆ తర్వాత ఆ మాటే మరిచిపోయాను. ఓ రోజు ఓ పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చారు. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానంలో డిగ్రీ చదవడానికి ఇచ్చిన నోటిఫికేషన్ అది.
బి.ఎ. నుంచి ఎల్‌ఎల్‌బి
బి.ఎ, ఎం.ఎ, ఎల్‌ఎల్‌బి చేశాను. ఎల్‌ఎల్‌బి పూర్తయ్యే నాటికి గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. తొలి పోస్టింగ్ ఉంగుటూరుకి డిప్యూటీ తాసీల్దారుగా. ముసునూరు మండలానికి ఎంఆర్‌వోగా బాధ్యతలు తీసుకునే వరకు నేను బయట ఎవరికీ తెలియదు, ముసునూరు బాధ్యతలు నన్ను రెండు రాష్ట్రాలకు తెలియచేశాయి. డ్యూటీ కచ్చితంగా చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలియచేశాయి, ఎలాంటి కష్టాలు ఎదురైనా వృత్తి నిబద్ధతను వదలకూడదనే దృఢ సంకల్పాన్ని పెంచాయి.
ఇసుక తోడేస్తే ఏమవుతుంది?
నేను ముసునూరులో బాధ్యతలు తీసుకునే నాటికే మండలంలో 16 గ్రామాలుంటే అందులో పదకొండు గ్రామాలు డార్క్‌లిస్ట్‌లో ఉన్నాయి. డార్క్ లిస్ట్ అంటే... గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా తగ్గిపోయినప్పుడు ఇక అక్కడ బోర్ వేయడానికి అనుమతించరు. అలా బోరు వేయకూడని స్థితిలో ఉన్నాయి ఆ గ్రామాలు. వాటర్ లెవెల్ ఏడు వందల అడుగుల నుంచి తొమ్మిది వందలకు వెళ్లింది. డార్క్ లిస్ట్ గ్రామాల్లో బోర్ వేయడానికి మా డిపార్ట్‌మెంట్ అనుమతివ్వదు. మా సర్టిఫికెట్ లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ కనెక్షన్ ఇవ్వదు. ఇసుక తవ్వే కొద్దీ నీటి లెవెల్ ఇంకా కిందకు వెళ్లిపోతుంటుంది.
మిగిలిన గ్రామాల్లోనైనా వాటర్ లెవెల్ ఉన్న స్థితిలో మెయిన్‌టెయిన్ అవ్వాలంటే ఇసుక నిల్వలు తగ్గకూడదు. కండిషన్ అలా ఉండడంతో కలెక్టర్ ఇసుక తవ్వకాలను ఆపేయాలని ఆదేశాలిచ్చారు. కలెక్టర్ ఆదేశాలను పాటించడం నా విధి. పైగా నేను రైతు బిడ్డను. మా నాన్న ఉదయం ఐదింటికి పొలానికి వెళ్తే, రాత్రి ఎనిమిదింటికి ఇల్లు చేరేవాడు. రైతు కష్టం నాకు తెలుసు. అందుకే కమర్షియల్ అవసరాలకంటే రైతు కనీస అవసరాల కోసం పని చేయడమే నా ధర్మం అని నమ్ముతాను. దాంతో ఎక్కడ ఇసుక అక్రమ తవ్వకం, రవాణా జరుగుతున్నా వెళ్లి అడ్డుకునేదాన్ని. నేను పర్టిక్యులర్‌గా ఉన్నానని తెలిసి రాత్రిళ్లు తరలించసాగారు.
విఆర్‌వోలు, నేను వెళ్లి లారీలు, ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశాం. చంపేస్తామని బెదిరింపు ఉత్తరాలు వచ్చాయి. వాటికి నేను భయపడలేదు. దాదాపు ఇరవై ట్రాక్టర్లను సీజ్ చేయించి, ప్రభుత్వానికి రెండున్నర లక్షల రూపాయల చలానా కట్టించాను. అది ఎమ్మెల్యేకి, వారి మనుషులకు నచ్చలేదు. నా మీద దాడికి పాల్పడ్డారు. ఆ సంఘటన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు నాయకుల నుంచి ఎదురయ్యే కష్టాలు చాలా మందికి తెలిశాయి. ఇప్పటికీ వనజాక్షి అనగానే ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్న అధికారిగానే నన్ను గుర్తుపడతారు.
మంచి కుటుంబం!
విధుల్లో కచ్చితంగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరికి ఇంటి పరిస్థితులు సహకరించవు. నా విషయంలో మా నాన్న, మా వారు, మా అబ్బాయి, చెల్లెళ్లు, తమ్ముడు, బంధువులు ఎవరూ వెనక్కు లాగలేదు సరికదా నా పోరాటాన్ని గర్వంగా ఫీలయ్యారు. మా అబ్బాయి ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడప్పుడు. తనైతే ‘అమ్మా నీ డ్యూటీ నువ్వు కచ్చితంగా చేశావు, అన్ని పరిస్థితులనూ ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. భయపడాల్సింది, వెనక్కి ఆలోచించుకోవాల్సిందేమీ లేదు’ అన్నాడు.
శర్మగారి కమిటీ ముందు ‘ఆ రోజు ఏం జరిగిందో చెప్పాల్సినప్పుడు... నాకు నేను చెప్పుకున్న మాట ఒక్కటే. నా తరవాత తరానికి నేను ఓ మంచి సందేశాన్నివ్వాలంటే ఇదే కరెక్ట్ టైమ్. ఇప్పుడు నేను స్థిరంగా, హుందాగా వ్యవహరిస్తేనే నన్ను రోల్‌మోడల్‌గా తీసుకుంటారెవరైనా’ అనుకున్నాను. అలాగే అనేక ప్రతికూల పరిస్థితులను గంభీరంగా ఎదుర్కొన్నాను. ఉద్యోగంలో ప్రతి క్షణం నేను ఏది సరైన పని అనుకుంటే దానిని నేను అనుకున్నట్లే చేస్తూ వచ్చాను. ఇకపై కూడా అలాగే చేస్తాను.
‘ఉద్యోగంలో స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండాలి. సర్వీస్ మోటోతో పని చేయాలి. మరొకరితో బేరీజు వేసుకోవడం ఎప్పుడు కూడా ఆరోగ్యకరంగా మన ఉన్నతికి దోహదం చేయాలి తప్ప ఇతరుల మీద ఈర్ష్య, అసూయలను పెంచేదిగా ఉండకూడదు’ ఈ సూత్రాన్ని నేను పాటిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలా ఉండాలనే కోరుకుంటాను’’.
అమ్మాయిలంటే ఇష్టం!
నాకు అమ్మాయిలంటే స్వతహాగానే చాలా ఇష్టం. మేఘనకు తల్లి లేదు. తండ్రి కూడా చివరి దశలో ఉన్నాడు. అందుకే ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాను. మగపిల్లాడికి చదువుకు పోషణకు ఆర్థిక సహాయం చేస్తే సరిపోతుంది. కానీ అమ్మాయి విషయంలో ‘ఈ అమ్మాయికి రక్షణగా ఫలానా వాళ్లు ఉన్నారు’ అనుకుంటేనే ఆ అమ్మాయికి భద్రత. రక్షణ ఉందని తెలియకపోతే ఆడపిల్లల మీద పలువురి చూపులు పడుతుంటాయి. అందుకే సమాజంలో ఒక హోదా ఉండే వాళ్లు ఇలాంటి హోమ్స్‌లో ఉండే ఆడ పిల్లలను దత్తత తీసుకోవాలి.
ఇదీ నా లైఫ్‌స్టయిల్!
నా పోస్టింగ్ నూజివీడుకు మారడంతో మా వారు విజయనగరంలో ఉద్యోగం మానేసి నూజివీడులో జాబ్‌లో చేరారు. ఆయనకు వ్యవసాయం హాబీ. ఆయనను చూస్తూ నాక్కూడా ఇష్టం పెరిగింది. కూరగాయలు మా ఇంట్లోనే పండించుకుంటున్నాం. వనరులను వృథా చేయకుండా పొదుపుగా వాడడం నా హాబీ. కరెంట్, నీరు దేనిని వృథా చేయను. సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలని ఆలోచన. బాల్కనీలో పక్షులకు గింజలు వేసి నీళ్లు పెడతాను. రెండు పెట్ డాగ్స్‌ను పెంచుతున్నాను.
మరో ఆరు స్ట్రీట్ డాగ్స్‌కి ఆహారం పెడతాను. కుక్కలను తరిమేయడానికి బదులు వాటికి వ్యాక్సినేషన్ చేయించి కాలనీలో తిరగనిస్తే చిన్న చిన్న దొంగతనాల వంటి కొన్ని నేరాలు తగ్గిపోతాయి. రిటైర్‌మెంట్ తర్వాత ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉంది. నిరాదరణకు గురైన పిల్లలకు, వృద్ధులకు ఆసరాగా ఏదైనా చేయాలి. ఇప్పుడు సమాజంలో ప్రధాన సమస్య వార్ధక్యంలో ఉన్న అమ్మానాన్నలను పిల్లలు నిర్లక్ష్యం చేయడమే. అలాంటి వారికి నీడనివ్వాలని నా ఆకాంక్ష. – వనజాక్షి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (తాసీల్దార్), సబ్ కలెక్టర్ ఆఫీస్, నూజివీడు
- వాకా మంజులారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment