పసిపాపలతో పట్టాలపై... | mother with her childrens suicide attempt in Jagdevpur railway gate | Sakshi
Sakshi News home page

పసిపాపలతో పట్టాలపై...

Published Tue, Nov 18 2014 1:35 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

పసిపాపలతో పట్టాలపై... - Sakshi

పసిపాపలతో పట్టాలపై...

ముగ్గురు కూతుళ్లతో రైలు కింద పడిన తల్లి
చివరి నిమిషంలో పెద్దకుమార్తెను పక్కకు తోసేసిన ‘కన్న మనసు’
తల్లి సహా ఇద్దరు కూతుళ్లు మృతి

 
భువనగిరి: ఓ తల్లి ఇద్దరు కూతుళ్లు సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. చివరి నిమిషంలో తన పెద్ద కుమార్తెను పక్కకు తోసేయడంతో ఆ చిన్నారి బతికిపోయింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని జగ్‌దేవ్‌పూర్ రైల్వేగేట్ వద్ద జరిగింది. ప్రాణాలతో బయటపడిన చిన్నారి వనజ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం చేగూరు శివారు ఎంకమ్మగూడేనికి చెందిన అరుణమ్మ (35)కు కుమార్తెలు వనజ (9), మౌనిక  (3), పూజ (6 నెలలు) కు ఉన్నారు.

కొద్ది నెలల క్రితం భర్త చనిపోవడంతో పుట్టింటికి చేరిన అరుణమ్మ కూలీనాలీ చేసుకుని జీవిస్తోంది. ఆమెకు సోదరులు నర్సింహ, కిష్టయ్య, యాదయ్య, పెంటయ్య ఉన్నారు. ఆదివారం వారితో గొడవ పడిన అరుణమ్మ తన ముగ్గురు పిల్లలను తీసుకుని హైదరాబాద్ బస్‌స్టేషన్‌కు చేరుకుంది. రాత్రి అక్కడే నిద్రపోయిన నలుగురు సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సులో భువనగిరి చేరుకున్నారు. అక్కడి నుంచి నడుచుకుంటూ జగ్‌దేవ్‌పూర్ గేట్ వద్దకు చేరుకున్నారు.

ముగ్గురు కూతుళ్లను ఒళ్లో కూర్చోబెట్టుకుని పట్టాలపై ఆఫ్‌లైన్లో కూర్చుంది. విశాఖపట్నం నుంచి షిర్డీ వెళ్తున్న రైలు దగ్గరకు రాగానే ఆ తల్లి హృదయం కరిగిందో తెలియదు కానీ... తన ఒడిలోని పెద్ద కుమార్తె వనజను పక్కకు నెట్టేసింది. రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో తల్లి అరుణమ్మ, మౌనిక, పూజ అక్కడికక్కడే మృతిచెందారు. కొద్దిసేపటి దాకా వనజకు ఏమి జరిగిందో అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత రోదిస్తూ సమీపంలోని గేట్‌మన్ వద్దకు వెళ్లి ‘మా అమ్మ, చెల్లెళ్లు రైలుకింద పడి చనిపోయారు’ అని చెప్పింది.  రైల్వే పోలీసులు మృతదేహాలకు పంచనామా నిర్వహించి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement