బెదిరింపులకు భయపడను
తహసీల్దార్ వనజాక్షి స్పష్టీకరణ
ముసునూరు: బెదిరింపు ఫోన్‌కాల్స్, లేఖలకు భయపడి బదిలీ చేయించుకోనని కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ డి.వనజాక్షి స్పష్టం చేశారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. నిజాయతీ, నిబద్ధతతో పనిచేసే అధికారులకు బెదిరింపులు రావడం సహజమేనన్నారు. ఇక్కడి నుంచి బదిలీ చేయించుకోవాలని, లేకుంటే చంపేస్తామంటూ సోమవారం తన కార్యాలయానికి పంపిన లేఖకు భయపడేదిలేదన్నారు. మండలంలోని కొన్ని గ్రామాల నుంచి అక్రమంగా ఇసుకను తరలించే వ్యక్తులు తనను మానసికంగా కుంగదీసి, భయభ్రాంతులకు గురి చేసేందుకే ఈ లేఖను పంపారని చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ముసునూ రు పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. విధి నిర్వహణలో ఇప్పటివరకు తాను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడించారు.
బెదిరింపు లేఖపై దర్యాప్తు ప్రారంభం
తహసీల్దార్ వనజాక్షిని చంపుతామని వచ్చిన బెదిరింపు లేఖపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపు లేఖను ఆమె వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఎక్కడ పోస్టు చేశారో తెలిపే స్టాంపు సక్రమంగా లేకపోవడంతో ముసునూరు సబ్ పోస్టుమాస్టర్ బి.సత్యనారాయణను కలిసి ప్రశ్నించారు.