హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉద్యోగ సంఘాల భేటీ అనంతరం ఎమ్మార్వో వనజాక్షిపై దాడి వ్యవహారంలో సీన్ మారిపోయింది. విషయం కాస్త పక్కదారి పట్టింది. ఎమ్మార్వోపై దాడి అంశం మరుగున పడి, చివరికి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య సరిహద్దులు అనే అంశం తెరమీదకు వచ్చింది.
శనివారం ఉదయం వరకూ మహిళ ఉద్యోగిపై దాడి చేసిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేయలంటూ డిమాండ్ చేసిన రెవెన్యూ ఉద్యోగులు...సీఎంతో సమావేశం అనంతరం ... ఈ ఘటనపై ఓ సీనియర్ అధికారితో కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తారని హామీ ఇచ్చారని, అందుకే తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించేశారు.
'జరిగిందేదో జరిగిపోయింది...జరగాల్సిన దానిపై దృష్టి పెట్టాలని' శుక్రవారం చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశంలో అన్నప్పుడే...విషయం అర్థం అవుతుంది. ఈ వ్యవహారంతో ప్రభుత్వం పరువు బజారున పడటంతో చంద్రబాబు అక్కడ నుంచే పావులు కదిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నివాసంలో ఉద్యోగ సంఘాలు ఇవాళ ఆయనతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు... రెవెన్యూ ఉద్యోగులు తక్షణమే ఆందోళన విరమించి వివాదాన్ని ముగించాలని ప్రత్యక్షంగా ఒత్తిడి చేసినట్టు సమాచారం. కంటితుడుపు చర్యగా... ఓ ఐఏఎస్ అధికారితో కమిటీ వేస్తామని ప్రకటించి చేతులు దులుపుకోవటం విశేషం. మరోవైపు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ...ఎమ్మార్వోపై ప్రత్యక్షంగా దాడి చేసినా చర్యలు తీసుకోకుండా కమిటీతో విచారణ ఏంటని విమర్శలు వస్తున్నాయి. అయితే దానిపై ధైర్యంగా మాట్లాడేందుకు మాత్రం ఉద్యోగులు సాహసించడం లేదు.
నిజాయితీగా మా విధులు నిర్వహిస్తే మా పై దాడులా?
ఇలా అయితే మహిళ ఉద్యోగులు ఉద్యోగం చేయలేరు...
ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే...
దాడి చేయటమే కాకుండా, నా పర్సనల్ గురించి అసభ్యంగా మాట్లాడతారా?
తనపై దాడి చేసిన ఎమ్మెల్యేను తక్షణమే అరెస్ట్ చేయాలి... అంటూ మీడియా ముందు కంటతడి పెట్టిన కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి... చంద్రబాబు నాయుడి కలిసిన అనంతరం ఒక్క నిమిషం కూడా ధైర్యంగా మీడియాతో మాట్లాడలేకపోయారు. సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆమె ఒక్క ముక్కలో ముగించేశారు.