‘రేయ్.. రేయ్.. రేయ్... స్కౌండ్రల్’... పెద్దగా అరిచింది. పరిగెత్తబోయింది. పట్టుకోబోయింది. బైక్ క్షణాల్లో పికప్ అయ్యి మాయమైపోయింది. ఎవడు వాడు.. ఎలా ఉన్నాడు... సన్నమా లావా పొడువా పొట్టా... ఏమీ గుర్తు లేదు. ఒక్క విషయమే గుర్తు ఉంది. మగాడు. నడి ఎండ. మధ్యాహ్నపు వేడి. నిర్మానుష్యమైన వీధి. ఒక్కతే తను. ఏం చేయాలి. దుఃఖం వస్తోంది. అవమానంతో ముఖం ఎర్రగా అయిపోయింది. ఛాతీ దగ్గర మంటగా ఉంది. నొప్పిగా ఉంది. పాలు చిమ్మినట్టయ్యి బ్రా తడిసింది. ‘రేయ్.. రేయ్... రాస్కెల్’... క్యాకరిస్తున్నట్టుగా మళ్లీ తిట్టుకుంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు ఎలా రియాక్ట్ కావాలో తెలియడం లేదు. పాపకు ఆరు నెలలు. పాలు ఇచ్చి తల్లికి అప్పజెప్పి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని మధ్యాహ్నపు షిఫ్ట్‌కు బయలుదేరింది. డెలివరీ తర్వాత నిజానికి పూర్తిగా కోలుకోనట్టే లెక్క. సిజేరియన్ అయ్యింది. డెలివరీకి ముందు లీవు డెలివరీ తర్వాత లీవు అనంటే ఆఫీసులో ఊరుకోరు. వెళ్లకతప్పదు. రెండు వారాలుగా వెళుతుంది. ఇవాళ కూడా రోజూలాగే బస్టాప్ దగ్గరే కదా అని నడుస్తూ ఉంటే ఎదురుగా బైక్ వాడు. మెల్లగా వస్తున్నాడు. తన వైపే వస్తున్నాడు. ఎవరబ్బా... తెలిసిన మనిషా అని చూస్తోంది. ఇంకా దగ్గరకు వస్తున్నాడు. ఏదైనా అడ్రస్ అడగడానికా. మరింత దగ్గరకు వచ్చి, రెప్పపాటులో చేయి విసిరి, కండ నొక్కి.... ‘రేయ్... రేయ్... లోఫర్... ఏం ఆనందంరా నీకు’ దుఃఖంగా అనుకుంది. ఏం పని చేయబుద్ధి కావడం లేదు. ఆఫీసులో కూచోబుద్ధి కావడం లేదు. ‘ఊరుకో. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మన ఖర్మ. మర్చిపోయి పని చేసుకోవాలి’ అంది కలీగ్. ఎలా మర్చిపోవడం. పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసింది. ‘అంటే ఏం చేశాడు?’ అవతలి వైపు అడుగుతున్నారు. ‘చేయి వేశాడు’ ‘వేసి’
‘ఇంకా వివరంగా చెప్పాలా... డెమో ఇవ్వనా?’ అరిచింది. ‘ఓకే మేడమ్... రేపోసారి వచ్చి కంప్లయింట్ రాసివ్వండి. నంబర్ గుర్తుందంటున్నారుగా’ అంటున్నారు.
ఆఫ్ డే లీవ్ పెట్టి ఇంటికి వచ్చేసింది. తల్లి వస్తే పాపకు తెలుస్తుంది. నిద్ర నుంచి మేలుకొని కళ్లు తెరిచి నవ్వింది. పాల కోసం పెదాలు కదిల్చింది. దుస్తులు తప్పించి పాల కోసం ఒడిలోకి తీసుకుంది. రోజూ పాలిచ్చేటప్పుడు ఎంతో పరవశంగా ఉంటుంది. ఇవాళ దహించుకుపోతూ ఉంది. ‘నన్ను ఇలా అవమానించే హక్కు వాడికెవరు ఇచ్చారు’ అనుకుంది. రాత్రి భార్య కోపాన్ని భర్త గమనించాడు. ‘వీధిలో ఎవరూ లేనప్పుడు కొంచెం గమనించుకుని నడవాలి’ అన్నాడు. ‘ఇదా మీరిచ్చే సలహా’ చురుగ్గా అడిగింది.తెల్లారింది. రెడీ అవుతోంది. స్టేషన్‌లో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మననం చేసుకుంటూ ఉంది. భర్త ఏం పట్టనట్టుగా తల దువ్వుకుంటున్నాడు. ‘ఏంటి... స్టేషన్‌కు రావడం లేదా మీరు?’ అడిగింది.‘ఏం స్టేషను... ఇలాంటివి స్టేషను దాకా ఎందుకు? నాకు తెలిసిన ఎస్.ఐ ఉన్నాడు. అతనికి చెప్తాను. చూసుకుంటాడు’‘అది కాదు’‘ఇక వదిలేయ్ అన్నానా’ విసుక్కున్నాడు.
చేతులు రుద్దుకుంది. పడినవాళ్లకు తెలుస్తుంది ఇది ఎలాంటి అవమానమో. కాదు ఆడవాళ్లకే తెలుస్తుంది ఇది ఎంతటి అవమానమో.ఏమీ చేయడానికి లేదు.ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానంటే స్కూటర్ ఎక్కి కూచుంది.దారిలో ఏదో ఊరేగింపు జరుగుతోంది. చాలామంది ఆడవాళ్లు, మగవాళ్లు ప్లకార్డులు పట్టుకుని నడుస్తున్నారు. నినాదాలు ఇస్తున్నారు.‘ఆడవాళ్ల మీద అత్యాచారాలు... నశించాలి.. నశించాలి’‘లైంగిక జులుం... నశించాలి... నశించాలి’‘యాసిడ్ దాడులు... నశించాలి... నశించాలి’భర్త ఆ ఊరేగింపు క్రాస్ చేస్తూ కనీసం తల తిప్పి కూడా చూడకుండా ‘ఇలా అరిస్తే నశిస్తాయా... పని లేని చేష్టలు కాకపోతే’ అన్నాడు.ఒక్కసారిగా లోపల నుంచి ఏదో తన్నుకొచ్చినట్టయ్యింది.‘స్కూటర్ ఆపండి’ అరిచింది.‘ఎందుకు?’‘ఆపండన్నానా?’ఆపాడు. ‘చూడండి. కొంచెమైనా సహానుభూతి, సంస్కారం పెంచుకోవడానికి ట్రై చేయండి. మీలాంటి వాళ్లు జరుగుతున్న అన్యాయాలని ఎదిరించరు. పోనీ ఎవరైనా ఇలా ప్రయత్నిస్తుంటే మద్దతు ఇవ్వరు. మీటింగులకు రారు. ఊరేగింపులలో పాల్గొనరు. పోనీ పెళ్లాం మీద చెయ్యేస్తే కంప్లయింట్ ఇస్తారా అంటే అదీ చెయ్యరు. ఏదీ చేయకపోతే అన్యాయానికి ప్రతిఘటన ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఇలాంటి ఊరేగింపులు అవసరం. ఎందుకు అంటారా? వీటి వల్ల చిన్న కదలిక వస్తుంది... చైతన్యం వస్తుంది... నాబోటి స్త్రీలకు ధైర్యం వస్తుంది. చేతులతో, చేతలతోనే కాదు... గొంతుతో కూడా కొన్ని ఆపొచ్చు’... అని ఊరేగింపు వైపు నడవబోతూ ఆగింది. మళ్లీ అంది– ‘అవమానం అంటే ఏమిటో తెలుసా? అవమానం జరిగిందని తెలిశాక కూడా దానిని ఎదిరించక పోవడమే అసలైన అవమానం’ విసురుగా కదిలింది.
కథ ముగిసింది. సి.వనజ రాసిన ‘అవమానం’ కథ ఇది. ఆడవాళ్లను సమర్థిస్తూ సమాజంలో ఉద్యమాలో కార్యక్రమాలో జరుగుతుంటాయ్. ఎంతమంది పాల్గొంటాము? పోనీ మంచి పని చేయండి అని ఎంకరేజ్ చేస్తాము? నేను సమర్థిస్తున్నాను అని ఫేస్‌బుక్‌లో ఒక పోస్టింగ్ పెడతాము? సమాజం మొత్తం చైతన్యం అయినప్పుడు ఆ చైతన్యపు ఛాయ ఫలితాన్ని ఇస్తుంది. తాము చేయక, చేసే వాళ్లను వెక్కిరిస్తూ కూచుంటే... బైక్ మీద తిరిగేవాడు తిరుగుతూనే ఉంటాడు... చేయి విసురుతూనే ఉంటాడు. కుదరదు. స్త్రీ శక్తి సంఘటితం కావాల్సిందే. స్త్రీ– శక్తి. స్త్రీయే శక్తి.
పునః కథనం
– మహమ్మద్ ఖదీర్‌బాబు
గమనిక: ఈ శీర్షిక నేటితో ముగిసింది.
- సి. వనజ
గొంతుల గుంపు
Published Thu, Mar 8 2018 1:23 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment