ఓటేసిన మహిళలు 25 శాతం పెరిగారు..! | Increased women voters turnout of 1. 8 crore in 2024 says SBI Research | Sakshi
Sakshi News home page

ఓటేసిన మహిళలు 25 శాతం పెరిగారు..!

Published Tue, Jan 14 2025 5:29 AM | Last Updated on Tue, Jan 14 2025 9:06 AM

Increased women voters turnout of 1. 8 crore in 2024 says SBI Research

ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యంపై ఎస్‌బీఐ నివేదిక 

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అక్షరాస్యత రేటులో ఒక శాతం పెరుగుదలతో ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యం 25 శాతం పెరిగింది. ఎన్నికల్లో మహిళా ఓటర్ల భాగస్వామ్యానికి సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇవే కాకుండా వివిధ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నివేదిక తెలిపింది. 

2019తో పోలిస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య 1.8 కోట్లు పెరిగింది. వీరిలో అక్షరాస్యత శాతం పెరగడం వల్ల 45 లక్షల మంది ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి అక్షరాస్యత రేటుతో పాటు ప్రధానమంత్రి ముద్రా యోజన వంటి ఉపాధి పథకాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దీని కారణంగా సుమారు 36 లక్షల మంది మహిళా ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారు.

 పరిశుభ్రత కూడా ఒక కీలక అంశంగా మారి, మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకునేలా ప్రభావితం చేసింది. పరిశుభ్రత ప్రచారం, దాని ప్రభావం కారణంగా మహిళా ఓటర్ల సంఖ్య సుమారు 21 లక్షలు పెరిగిందని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఇవే కాకుండా స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్‌ సరఫరా తదితర అంశాలు కూడా మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపాయి. అయితే వీటి వల్ల ఓటు వేయాలనే స్ఫూర్తిని పొందిన మహిళల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. 

ఎన్నికలలో మహిళా ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంలో మహిళలకు గృహ యాజమాన్య హక్కులు కూడా ముఖ్యమైనవిగా పరిగణించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కారణంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 20 లక్షల మంది మహిళా ఓటర్లు పెరిగారు. పీఎం ఆవాస్‌ యోజన కింద కేటాయించిన ఇళ్లలో 74 శాతం మహిళలే ఉన్నారు. ఇది మహిళా సాధికారతపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వారిని ప్రేరేపించింది. విద్య, ఉపాధి, ప్రాథమిక అవసరాలపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారతను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియలోవారి భాగస్వామ్యాన్ని పెంచవచ్చని నివేదిక పేర్కొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement