రాష్ట్రంలోని 154 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ
70 స్థానాల్లో పురుషులకన్నా 4 వేల నుంచి 10 వేలకు పైగా అధికంగా మహిళా ఓటర్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాల లబ్ధిదారుల్లోనూ మహిళలే అత్యధికం
వారందరి మొగ్గు ‘ఫ్యాన్’వైపే అంటున్న రాజకీయ విశ్లేషకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రేపు జరగనున్న ఎన్నికల్లో ‘విజేత’ను మహిళలే నిర్ణయించబోతున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 154 స్థానాల్లో మహిళా ఓటర్లదే పై చేయి. ఇందులో ఏకంగా 70 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా నాలుగు వేల నుంచి పది వేలకు పైగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో విజేతల తలరాతను మహిళా ఓటర్లే డిసైడ్ చేయనున్నారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్ర ఓటర్ల జాబితాల్లో మహిళల నిష్పత్తి పెరుగుతూనే ఉంది.
2014తో పోల్చి చూస్తే 2019లో మహిళా ఓటర్ల పోలింగ్ కూడా భారీగా పెరిగింది. అదేవిధంగా ఈ నెల 13న అసెంబ్లీకి, లోక్‌సభకు జరిగే పోలింగ్‌లో కూడా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేసింది. పోలింగ్‌లో పాల్గొనే మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కూడా ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న యువతులు దాదాపు నాలుగు లక్షల మంది తమ ఓట్లు నమోదు చేసుకున్నారు.
2019లో మాదిరిగానే ఈసారి కూడా పల్లె, పట్నం అనే తేడా లేకుండా అన్ని చోట్లా పెద్ద ఎత్తున మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా కనిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమాభివృద్ధి పథకాల లబ్ధిదారుల్లో కూడా మహిళలే అత్యధికంగా ఉన్నందున.. వారంతా ‘ఫ్యాన్’కు ఓటు వేయడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నారు.
మహిళా కూలీల నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు, గృహిణులు, యువతులు వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారనే వాతావరణం అన్ని నియోజకవర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. చేయూత, ఆసరా, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలతో పాటు సొంతింటి కల నెరవేరిందంటూ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ‘నవరత్నాల ద్వారా మహిళలకు ఏకంగా రూ.2,83,866.33 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది.
ఇందులో నేరుగా నగదు బదిలీ ద్వారా రూ.1,89,519.07 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.94,347.26 కోట్లు ప్రయోజనం చేకూరింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీకి బాహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. అందువల్ల వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయం’ అని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment