ఎన్నికల్లో ప్రలోభాల పర్వం
ఓటర్లకు నగదు, మద్యం, బియ్యం బస్తాలు
మహిళలకు చీరలు, ముక్కు పుడకలు, వెండి భరిణెలు
నిర్భీతిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన
కొలిమిగుండ్ల/వీరపునాయునిపల్లె/చింతకొమ్మ దిన్నె/పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)/చిల్లకూరు (తిరుపతి జిల్లా)/గంగాధర నెల్లూరు (చిత్తూరు జిల్లా): ఎన్నికల ముంగిట టీడీపీ నాయకులు బరితెగించారు. ఓడిపోవడం ఖాయమని తేలిపోవడంతో దింపుడుకళ్లెం ఆశతో ప్రలోభాలకు పాల్పడుతున్నారు. కనీసం పరువైనా దక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లకు భారీ ఎత్తున నగదు, మద్యం, బియ్యం బస్తాలను ఎరవేస్తున్నారు. మహిళా ఓటర్లకు చీరలు, ముక్కుపుడకలు, వెండి భరిణెలు పంపిణీ చేస్తూ ప్రలోభపెడుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పలు రకాల తాయిళాలు ఎరవేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. తద్వారా నిర్భీతిగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు.
300 మందికిపైగా ముక్కుపుడకలు..
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉండటంతో ఓటమి ఖాయం అని భావించిన టీడీపీ నేతలు నగదు పంచారు. అయినా ఫలితం లేకపోవడంతో కల్వటాలలో ఆదివారం మహిళా ఓటర్లకు 300 మందికిపైగా ముక్కుపుడకలను పంపిణీ చేశారు. మరికొన్ని గ్రామాల్లో చీరలు అందజేశారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం యు.రాజుపాలెం, తాటిమాకులపల్లె సమీపంలోని అరటి తోటలో నాలుగు వందల చీరల బస్తాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. బస్తాలపై టీడీపీ నేతలు ఎన్.వేణుగోపాల్, ఎం.నాగరాజు పేర్లు ఉన్నాయి.
వీరిద్దరూ ఓటర్లకు పంపిణీ చేసేందుకు అరటితోటలో చీరలు దాచి ఉంచారని తెలిసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కడప సమీపంలోని ఊటుకూరు వద్ద 250 బియ్యం బస్తాలతో వెళుతున్న ఆటోను పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వీటిని టీడీపీ నేత డాక్టర్ కృష్ణకిషోర్‌రెడ్డికి చెందినవిగా గుర్తించారు. ఈ బియ్యాన్ని చింతకొమ్మదిన్నె మండలం బుగ్గలపల్లి పంచాయతీ పరిధిలో ఓటర్లకు పంచేందుకు తీసుకెళుతున్నారు.
ఆటోను, బియ్యం బస్తాలను విడిపించుకునేందుకు పోలీస్‌స్టేషన్ వద్ద టీడీపీ నేత కృష్ణ కిషోర్‌రెడ్డి, ఆయన అనుచరులు హల్‌చల్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామని సీఐ శివశంకర్ నాయక్ తెలిపారు. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు çపంపిణీ చేసే స్లిప్పులపైన టీడీపీ పథకాలను ఆ పార్టీ నేతలు ముద్రించి అందజేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రూ.1,500 విలువైన వెండి భరిణెల పంపిణీ
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఇంటింటికీ రూ.వెయ్యి నగదు, రూ.1,500 విలువైన వెండిభరిణెలు పంపిణీ చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ నాయకులు ఒక్కో ఓటుకు రూ.2 నుంచి రూ.3 వేల వరకు అందించారు. మద్యాన్ని కూడా ఇష్టారాజ్యంగా పంపిణీ చేశారు.
బీజేపీ అభ్యర్థికి చుక్కెదురు
తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరప్రసాద్‌రావుకు చుక్కెదురైంది. చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ప్రచార పర్వం ముగిశాక కూడా ఓటర్లను కలుసుకుని ఇలా ప్రలోభాలకు గురి చేయడం సబబుగా లేదని వెళ్లిపోవాలని కోరారు. దీంతో వరప్రసాద్‌రావు అక్కడ నుంచి జారుకున్నారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులను స్కాన్ చేస్తే రూ.500 తీసుకోవచ్చని ప్రలోభపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment