జాతర ముగింపు రోజు అమ్మవారి విశ్వరూపం చెంప తొలగింపు (ఫైల్ ఫొటో)
- అమ్మోరు గెటప్‌లో బన్నీ నటవిశ్వరూపం
- రాయలసీమలో ‘పుష్ప–2’ జాతర
- అంతర్జాతీయంగా తిరుపతి జాతరకు గుర్తింపు
తిరుపతి కల్చరల్: పుష్ప–2 సినిమా రాయలసీమను ఊపేస్తోంది. అల్లు అర్జున్ మాతంగి గెటప్‌లో నటవిశ్వరూపాన్ని చూసిన వారంతా పూనకాలతో ఊగిపోతున్నారు. సినిమా మొత్తానికి హైలైట్ ఎపిసోడ్ తిరుపతి గంగమ్మ జాతరే. ఈ సన్నివేశంలో చీరకట్టి అమ్మవారి గెటప్‌లో కనిపించిన అల్లు అర్జున్‌ని చూసిన వారంతా నిజంగా అమ్మవారు పూనిందా అనిపించేంతలా నటించాడని ఫిదా అవుతున్నారు. మాతంగి వేషధారణలో అల్లు అర్జున్ ఫైట్ సీన్లు, పాటతో కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు కనిపించాడు. సినిమా రిలీజ్‌కు ముందే ఈ వేషధారణ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా రిలీజ్‌తో ఈ సీన్లు మరింతగా ఆకట్టుకుంటున్నాయి. మళ్లీ క్లైమాక్స్‌లో అమ్మవారి వేషధారణ అబ్బురపరిచింది. ఈ సన్నివేశాలను చూసిన వారంతా తిరుపతి గంగమ్మను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మాతంగి వేషంలో భక్తుడు (ఫైల్ ఫొటో)
జాతరలో లేడీ గెటప్ ఎందుకంటే..
తిరుపతి గంగమ్మ జాతరలో లేడీ గెటప్ ఎందుకు వేస్తారు? మగవాళ్లంతా చీరలెందుకు కట్టుకుంటారు? ఆడవాళ్లంతా మగరాయుడు అయిపోతారెందుకు? చిన్నారులు మీసకట్టు పెడతారు.. మరికొందరు అమ్మోరుగా.. రాక్షసులుగా అనేక గెటప్స్ ఈ జాతరలో కనిపిస్తాయి. ఇలాంటి వేషధారణలు గంగమ్మకు ఇష్టమట. అందుకే ఈ వేషధారణతో అమ్మను దర్శించుకుంటే చల్లని చూపు ప్రసరిస్తుందని, ఆమె కరుణా కటాక్షాలు లభిస్తాయని తిరుపతి గంగమ్మ భక్తుల విశ్వాసం.
గంగమ్మ జాతర ఏటా మే నెలలో జరుగుతుంది. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా తిరుపతి వచ్చేస్తారు. వారం రోజులు వైభవంగా జరిగే జాతరలో వివిధ వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. దీని వెనుక శతాబ్దాల నేపథ్యం ఉంది. రాయలసీమలో పాలెగాళ్ల రాజ్యం రోజుల్లో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరిగేవి. ఆ కామాంధుల బారినుంచి తప్పించుకోలేక మహిళలు చాలాకష్టాలు పడ్డారు. తిరుపతి సమీపంలోని అవిలాలలో కైకా వంశంలో పుట్టిన ఆడబిడ్డను దత్తత తీసుకున్న తిరుపతికి చెందిన వ్యక్తి ఆమెకు గంగమ్మ అని పేరు పెట్టాడు.
తనపై కన్నేసిన పాలెగాడిని ఉగ్రరూపంతో సంహరించేందుకు గంగమ్మ వెంటాడగా.. భయపడి దాక్కున్న ఆ పాలెగాడిని బయటకు రప్పించేందుకు ఆమె వివిధ వేషధారణలతో తిరిగింది. బైరాగి, మాతంగి, చివరకు దొర వేషంలో వచ్చిన గంగమ్మను పోల్చుకోలేక పాలెగాడు బయటకు రాగా.. మాతంగి వేషధారణలో వచ్చిన గంగమ్మ అతడిని సంహరించి.. ఆ పాలెగాడి భార్యకు ధైర్యం చెబుతుంది. అప్పటి నుంచి గంగమ్మను శక్తి స్వరూపంగా భావించి ఏటా జాతర చేయడం ఆనవాయితీ.
శ్రీవారి సోదరిగా..
తిరుపతిలో కొలువుతీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్లలో గంగమ్మ ఒకరు. ఈమెను వేంకటేశ్వరస్వామి సోదరిగా భావించి పూజలు చేస్తారు. అందుకే టీటీడీ తరఫున గంగమ్మకు పట్టువ్రస్తాలు సమరి్పస్తారు. గంగమ్మ తల్లి తిరుపతి తొలి గ్రామదేవత. శ్రీవారి భక్తుడైన తాతయ్య గంగమ్మ తల్లి తాతయ్యగుంట వద్ద నెలకొలి్పన ఆలయానికి అత్యంత ప్రాచీన, చారిత్రక, విశిష్టత ఉంది.
Comments
Please login to add a commentAdd a comment