సాక్షి, తిరుమల/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఒకవైపు వర్షం.. పెరిగిన చలి తీవ్రత కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుమలలో బుధవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో ఘాట్ రోడ్డుల్లో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. కొండచరియలు విరిగేపడే ప్రమాదం ఉండటంలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాపవినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, గోగర్భం, పాపవినాశనం జలాశయాలలో పూర్తిగా నిండిపోవడంతో అధికారులు గేట్లు ఎత్తారు. వర్షం కారణంగా తిరుమలకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు.. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాలపై వాయుగుండం ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోసా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
#tirupati #tirumala #HeavyRain pic.twitter.com/8uN6R5FHr4
— tirupati weatherman (@TPTweatherman) December 12, 2024
ఇదిలా ఉండగా.. తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమ్యాయి. ఆర్టీసీ బస్టాండ్, బాలాజీ కాలనీ, కోర్లగుంట, సత్యనారాయణ పురం, లక్ష్మి పురం సర్కిల్‌లో రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరుకుంది. వెస్ట్ చర్చి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా చేరుకుంది. దీంతో, వన్ వేలోనే వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిస్తున్నారు. భారీ వర్షాల సూచనల నేపథ్యంలో గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment