దాడిని సీఎం సమర్థించడమా ?
హైదరాబాద్: కృష్ణాజిల్లాలో ఎమ్మార్వో వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కె. పార్థసారధి ఖండించారు. ఈ అంశంలో చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రే సెటిల్మెంట్కు దిగడం దారుణమన్నారు. వనజాక్షి పెట్టిన కేసును నీరుగార్చేందుకు సాక్షాత్తూ చంద్రబాబే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
మహిళా అధికారి వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చి పారేసినా పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇలా సెటిల్మెంట్లు చేస్తే అధికారులు ఎలా ధైర్యంగా పని చేయగలగుతారని చంద్రబాబును పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. అవినీతిని అడ్డుకున్న ఎమ్మార్వోపై జరిగిన దాడిని సీఎం సమర్థించడమా ? అంటూ పార్థసారధి అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో ఇసుక మాఫియాను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారనేది స్పష్టమయిందన్నారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై దౌర్జన్యంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని పార్థసారధి విమర్శించారు.