ప్రజాపక్ష పోరాటమే లక్ష్యం
నరసరావుపేటవెస్ట్, న్యూస్‌లైన్ : రైతు రుణమాఫీతో సహా ఎన్నిక ల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నీ పకడ్బందీగా అమలు చేసేలా ప్రజల పక్షాన పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి కె.పార్ధసారధి చెప్పారు. చంద్రబాబు వెంటనే హామీలన్నీ అమలు చేసి ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులకు పంట రుణాలు ఇప్పించాలని కోరారు. ైరె తు రుణ మాఫీ చేస్తామని ప్రకటించినందున ఎవరూ బకాయిలు చెల్లించాల్సిన పనిలేదన్నారు.
నరసరావుపేట పట్టణంలో ఆదివారం నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షానంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి, టీ డీపీ, బీజేపీల్లో చేరుతున్నారంటూ కొన్ని పత్రికలు, చానళ్లు, కొందరు టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నార ని చెప్పారు. అయినా ఏ నాయకుడు, కార్యకర్త నైతిక స్థైర్యాన్ని కోల్పోలేదని సమీక్షలో స్పష్టమైందన్నారు. పార్టీ పనితీరు, కార్యకర్తల పనితీరు బాగున్నట్టు తేలిందన్నారు. రుణమాఫీపై టీడీపీ ప్రచారం చేయడం, మరికొన్ని ఇతర అంశాలు తమ పార్టీ అధికారంలోకి రాకుండా దెబ్బతీశాయని అభిప్రాయం వ్యక్తంచేశారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా గట్టి ప్రతిపక్షం ఏర్పడిందని పార్ధసారధి చెప్పారు. సుమారు 20 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన టీడీపీకి 2004లో 44 స్థానాలే వచ్చాయని గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు పెరిగాయని, వారికి ఏమాత్రం నష్టం జరిగినా తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించారు. తాము కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పోలీసులు కూడా చట్టప్రకారం పని చేయాలని హితవు పలికారు. కార్యకర్తలను చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలని కోరారు.
నేడు గుంటూరులో
సమీక్ష: మర్రి రాజశేఖర్
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ సమీక్షించామని చెప్పారు. తండ్రి కర్మకాండలు నిర్వహించిన గురజాల నియోజకవర్గ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి మినహా పోటీచేసిన అభ్యర్థులందరూ సమీక్షకు హాజరయ్యారన్నారు. సోమవారం బాపట్ల నియోజకవర్గంలోని మూడు అసెంబ్లీలు, గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై గుంటూరులో సమీక్ష జరుగుతుందని చెప్పారు.
పార్టీ జయాపజయాలపై సమీక్ష
సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కొందరు ఓడిపోవటానికి, పార్టీ అధికారంలోకి రాలేకపోవటానికి గల కారణాలపై పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి కె.పార్ధసారధి పట్టణంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటమికి కారణాలను కమిటీ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది.
పకాష్‌నగర్‌లోని శుభమ్ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో తొలుత నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ కన్వీనర్లు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వినుకొండ నుంచి నన్నపనేని సుధ, చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్, పెదకూరపాడు నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య, సత్తెనపల్లి నుంచి పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల నాయకులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సమీక్షకు హాజరయ్యారు. అందరూ తమ నియోజకవర్గాల వారీగా ప్రధానంగా ఐదు కారణాలు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.
రైతు రుణమాఫీ పథకంపై టీడీపీ ప్రచారం, ఆపార్టీ నేతలు అధికంగా డబ్బు పంపిణీ చేయడం, మోడీ ప్రభావం, వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం, మితిమీరిన ఆత్మవిశ్వాసం తదితర కారణాలతో ఓటమి చెందినట్లు చెప్పుకొచ్చారు. పేర్ల వారీగా చెప్పినవన్నీ నమోదు చేసుకున్న పార్ధసారధి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహనరెడ్డి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నరసరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షుడు హర్షవర్ధనరెడ్డి, పార్టీ చైర్మన్ అభ్యర్థి మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.