కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్‌సీపీ మే 2న పోరుబాట నిర్వహించనుంది. ఆరోజు గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ఈ వివరాలను వెల్లడిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.పార్థసారథి నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు కాదు కరువు వచ్చిందని ఎద్దేవా చేశారు. కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మే2వ తేదీన ఆంధ్రప్రదేశ్-లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు పార్థసారథి తెలిపారు. కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్‌సీపీ పోరుబాట నిర్వహిస్తోందన్నారు. మే 2న అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ ధర్నాలలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.