ఆయనకలా.. ఈయనకిలా..
హైదరాబాద్ : ఇద్దరూ ప్రజాప్రతినిధులు...వేర్వేరు జిల్లాలు..ఒకరిపైన పోలీసులను దూషించారని ఆరోపణ.. వెనువెంటనే అరెస్ట్.. రిమాండ్.. జైలుకు తరలింపు... ఆరోగ్యం బాగాలేదని నిమ్స్కు తరలించమంటే.. మీనమేషాలు.. వైద్యబృందంతో పరీక్షలు..చివరకి బెయిల్ వచ్చే వరకు తాత్సారం మరొకరు.. అదేస్ధాయి ప్రజాప్రతినిధి...ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోపై బూతుల దండకం అందుకొని దాడి చేసి... బెదిరింపులు.. ఒక్క ఎమ్మార్వోనే కాదు.. మిగతా రెవెన్యూ సిబ్బందిపై దాడి... పోలీసులు వచ్చి దాడి చేసిన వారిని బుజ్జగించి పంపేశారు.. దాడి విషయం బయటకు పొక్కి రభస జరుగుతుంటే అప్పుడు పోలీసులు అప్రమత్తమై ఇలా కేసులు బుక్ చేసి అలా వదిలేశారు.
మొదటిది కర్నూలు జిల్లా.. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, తన కూతురు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పట్ల పోలీసులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నందుకు అడ్డు పడితే ఆగమేఘాలపై కేసు ..అరెస్ట్... రెండవది పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ అంశం. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రేవులో బుధవారం ... ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుక తవ్వకం జరుపుతున్నారు. ఆ విషయం తెలిసి స్థానిక ఎమ్మార్వో వనజాక్షి... తన సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లారు. ఇదేం పని అని ప్రశ్నించిన ఆమెపై ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరణగణం దాడి చేసింది. దీనిపై బుధవారం మధ్యాహ్నం...రెవెన్యూ ఉద్యోగులు సమ్మెబాట పట్టినా, జిల్లా కలెక్టర్తో మొరపెట్టుకున్నా పోలీసుల నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. సరికదా డ్వాక్రా మహిళల ఫిర్యాదుతో బాధిత ఎమ్మార్వో వనజాక్షిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ఎదురు కేసు పెట్టారు.
ఒకవైపు ఇంత హడావిడి జరుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే తాపీగా విలేకరుల సమావేశం పెట్టి వనజాక్షి వ్యక్తిగత విషయాల పట్ల అసభ్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ' ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేస్తాం.. ఆత్మహత్య మినహా మరో మార్గంలేదు ' అని వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలాంటి సంఘటనలు చూస్తోంటే.. ప్రభుత్వ మహిళా అధికారులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల మాటేమిటీ అనే ప్రశ్నకు జవాబు మాత్రం దొరకదు.
సోమవారం వరకు ప్రభాకర్పై చర్య తీసుకోకపోతే ఉద్యమం చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అంటే పోలీసులకి సోమవారం వరకు వెసులు బాటు ఉందన్నమాట...చేసింది తప్పుకానే కాదని ఎమ్మెల్యే ప్రభాకర్ ధైర్యంగా ఉన్నట్టున్నారు. తన అనుయాయులతో రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా పోటీ ధర్నాలు చేయిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలపై చింతమనేని యూత్ అని స్పష్టంగా పెద్ద అక్షరాలతో రాసి ఉంది. ఇసుక అమ్ముకునే హక్కు కల్పించిన నాయకుడి పట్ల ఆ మాత్రం స్వామి భక్తి లేకపోతే ఎలా...అందుకే ఇసుకాసురులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
ఏ చిన్న విషయంపైన అయినా ఒంటి కాలిమీద లేచి నానా యాగి చేసే అధికారపార్టీ నాయకులు మాత్రం..ఈ విషయం పై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. 'బాస్ జపాన్ నుంచి వచ్చిన తర్వాతే చర్యలుంటాయి' అని లీకులు మాత్రం ఇస్తున్నారు. చర్యలంటే ప్రభాకర్ను అరెస్ట్ చేస్తారని ఆశపడటం తప్పేమో.. బహుశా ఎమ్మెల్యేకు ఎదురు తిరిగినందుకు వనజాక్షిని ఏదో ఒక లూప్ లైన్ పోస్ట్కి బదిలీ చేస్తారేమో..