సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) సిఫారసుల నివేదిక ప్రభుత్వానికి అందింది. తెలంగాణ తొలి పీఆర్సీ కమిటీ చైర్మన్ చిత్తరంజన్ బిస్వాల్, సభ్యుడు మహమ్మద్ అలీ రఫత్ గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు నివేదిక అందజేశారు. 25% ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సిఫారసు చేసినట్టు సమాచారం. మూడేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం నెలకొనడం, కరోనాతో ఆర్థిక వ్యవస్థ పతనమైన నేపథ్యంలో 25% ఫిట్‌మెంటే సాధ్యమని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. 1% ఫిట్‌మెంట్ అమలుకు ఏటా రూ.300 కోట్లు లెక్కన 25% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేయడానికి రూ.7,500 కోట్ల భారం పడనుంది.
రెండున్నరేళ్ల తర్వాత నివేదిక..: చివరిసారిగా ఉమ్మడి ఏపీలో నియమించిన పదో పీఆర్సీ కమిటీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, 43 శాతానికి పెంచి వేతన సవరణను ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వేతన సవరణ గడువు 2018 జూన్‌తో ముగిసిపోయింది. జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతనాలను అమలు చేయాల్సి ఉంది. సీఆర్ బిస్వాల్‌ను చైర్మెన్‌గా, రిటైర్డు ఐఏఎస్‌లు మహమ్మద్ అలీ రఫత్, సి.ఉమామహేశ్వర్‌రావులను సభ్యులుగా నియమిస్తూ 2018 మేలో పీఆర్సీ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీఆర్సీతో పాటు ఉద్యోగుల సర్వీసు రూల్స్ సరళీకరించడం, కొత్త జోనల్ వ్యవస్థ అమలు అంశాలపై ఈ కమిటీ అధ్యయనం జరపాలని ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. చదవండి: (చిక్కుముడులు వీడినట్టే!)
ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించిన అనంతరం పీఆర్సీ నివేదికను బిస్వాల్ కమిటీ సిద్ధం చేసింది. నివేదిక సమర్పించడంలో ఆలస్యం జరగడంతో ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు గడువు పొడిగించింది. డిసెంబర్ 31తో గడువు ముగుస్తుండగా, ఎట్టకేలకు చివరిరోజు గురువారం పీఆర్సీ నివేదికను సమర్పించింది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, టీజీవోల అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం.నరేందర్‌రావు, ప్రధనా కార్యదర్శి యూసుఫ్ మియా పాల్గొన్నారు.
తొలివారంలో చర్చలు..
సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కె.రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లతో నియమించిన హైలెవల్ కమిటీ పీఆర్సీ నివేదికపై జనవరి 2, 3 తేదీల్లో క్షుణ్ణంగా అధ్యయనం జరపనుంది. అనంతరం జనవరి 5 నుంచి 7 తేదీల మధ్య రెండ్రోజుల పాటు ఉద్యోగ సంఘాలతో చర్చలు నిర్వహించనుంది. పెంచిన వేతనాల చెల్లింపులు ఎప్పట్నుంచి అమలు చేయాలి? పీఆర్సీ బకాయిలను ఎలా, ఎప్పుడు చెల్లించాలన్న అంశంపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఈ కమిటీ ముందుంచనున్నారు. ఫిట్‌మెంట్ శాతంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు అనంతరం జనవరి రెండో వారంలోగా సీఎం కేసీఆర్‌కు నివేదికను సమర్పించనుంది. జనవరి మూడో వారంలో ముఖ్యమంత్రి ఫిట్‌మెంట్ శాతాన్ని పెంచి వేతన సవరణ అమలుపై కీలక ప్రకటన చేయనున్నారు. చదవండి: (సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం)
బిస్వాల్ కమిటీ గడువు పొడిగింపు..
పీఆర్సీ నివేదిక సమర్పించినప్పటికీ, ఇంకా ఉద్యోగుల కొత్త సర్వీసు రూల్స్, కొత్త జోనల్ వ్యవస్థ అమలు, కేడర్ స్ట్రెంథ్ తదితర అంశాలపై బిస్వాల్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు ఈ కమిటీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..
Comments
Please login to add a commentAdd a comment