కనీస పెరుగుదల రూ.5,352 | CM KCR to Announce PRC Fitment For Telangana Employees | Sakshi
Sakshi News home page

కనీస పెరుగుదల రూ.5,352

Published Tue, Mar 23 2021 2:52 AM | Last Updated on Tue, Mar 23 2021 5:57 AM

CM KCR to Announce PRC Fitment For Telangana Employees - Sakshi

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు. చిత్రంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం పీఆర్‌సీ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో ఆర్థిక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. పీఆర్‌సీ సిఫార్సులను అమలు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేస్తే.. ఆయా శాఖలు ఉద్యోగుల వేతన స్థిరీకరణ చేపట్టను న్నాయి. ప్రభుత్వంలో నాలుగో తరగతి ఉద్యోగికి ఇవ్వాల్సిన కనీస మూల వేతనాన్ని రూ.19 వేలుగా, అత్యున్నత స్థాయిలో ఉండే వారికి గరిష్ట మూల వేతనాన్ని రూ.1,62,070గా సూచిస్తూ.. పీఆర్సీ మాస్టర్‌ స్కేల్‌ను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమకు ఎంత ప్రయోజనం చేకూరుతుందనే అంచనాలు వేసుకుంటున్నారు. 

ప్రారంభ వేతనంలో ఎక్కువున్నా..
పీఆర్‌సీ కమిటీ ప్రస్తుతమున్న కనీస మూలవేతనంలో రూ.6 వేల పెంపును సిఫార్సు చేసింది. గత పీఆర్‌సీలో కనీస మూల వేతనం రూ.13,000 ఉండగా.. ఇప్పుడు రూ.19 వేలకు పెంచింది. గరిష్ట వేతనం గత పీఆర్‌సీలో రూ.1,10,850 ఉంటే.. ఇప్పుడు రూ.1,62,070కి పెంచింది. అంటే కనీస మూల వేతనంలో రూ.6 వేలు, గరిష్ట మూల వేతనంలో రూ.51,220 పెంపును ప్రతిపాదించింది. దీనికి లోబడి ఆర్థిక శాఖ వేతన స్థిరీకరణకు అనుమతి ఇవ్వనుంది. ఈ లెక్కన నాలుగో తరగతి ఉద్యోగుల మొత్తం వేతనంలో పెంపు రూ.5,352 నుంచి మొదలు కానుంది. అయితే.. గత పీఆర్‌సీ సిఫార్సుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే నాలుగో తరగతి ఉద్యోగి కనీస మూల వేతనం రూ.13 వేలుగా ఉంది. అది చాలా తక్కువని నాలుగో తరగతి ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో.. ఆ స్కేల్‌ను సవరించి రూ.14,170 బేసిక్‌ పేతో వేతన స్థిరీకరణ చేశారు. వీరికి ప్రస్తుత పీఆర్‌సీ పెరుగుదల తక్కువగా ఉండనుంది. బేసిక్‌ పే రూ.6వేలు పెరిగినా.. మొత్తం వేతనంలో పెరుగుదల రూ.3,588గానే ఉండనుంది. వీరికి వేతన స్థిరీకరణ 14,170తో చేయడం, మూడు కరువు భత్యాలు(డీఏ) ఇవ్వకపోవడమే దీనికి కారణం. అయితే అంతకుముందే చేరిన సీనియర్లకు మాత్రం పెరుగుదల రూ.5 వేలకుపైనే ఉండనుంది.

సీఎం కేసీఆర్‌కు పూలమొక్క ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతున్న ఉద్యోగ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్, మమత తదితరులు. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

2018 జూలై 1 వరకున్న డీఏ విలీనం
కొత్త పీఆర్‌సీని 2018 జూలై 1వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉంది. ఆలస్యంగా ఇప్పుడు అమల్లోకి తెస్తున్నా.. అప్పటి మూల వేతనం ఆధారంగానే వేతన సవరణ అమలు చేస్తారు. ఆ గడువునాటికి ఉన్న కరువు భత్యం (డీఏ)ను కొత్త వేతనంలో విలీనం చేస్తారు. ప్రస్తుతం ఉద్యోగులకు 38.776 డీఏ వస్తోంది. ఇందులోనుంచి 2018 జూలై 1 వరకున్న డీఏ 30.392 శాతం కొత్త వేతనంలో కలుస్తుంది. ఈ డీఏను, 30 శాతం ఫిట్‌మెంట్‌ను పాత బేసిక్‌ పేతో కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. 2018 జూలై 1 తర్వాత మంజూరైన 7.28 శాతం డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులను కలిపి మొత్తం వేతనాన్ని స్థిరీకరిస్తారు.

ఫిట్‌మెంట్‌ అంటే..

ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చుల మేరకు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులకు చేసే జీతాల పెంపునే ఫిట్‌మెంట్‌ అంటారు. కేంద్రం పదేళ్లకోసారి, మన రాష్ట్ర సర్కారు ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తాయి. నిర్ణీత గడువు నాటికి ఉద్యోగికి ఉన్న మూల వేతనానికి.. అప్పటికి ఉన్న డీఏను, ఫిట్‌మెంట్‌గా ఇచ్చే మొత్తాన్ని కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు. అయితే ఉద్యోగుల మూల వేతనాలకు సంబంధించి నిర్ణీత పేస్కేల్‌ ఉంటుంది. ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఆ పేస్కేల్‌లో ఉన్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు. దీనికి ఇతర అలవెన్సులను కలిపి మొత్తం జీతాన్ని లెక్కిస్తారు.ఉదాహరణకు ఒక సీనియర్‌ లెక్చరర్‌ మూల వేతనం రూ.53,950గా ఉంది. ఆయనకు 2018 జూలై 1 నాటికి ఉన్న 30.392% డీఏ అంటే రూ.16,396+30% ఫిట్‌మెంట్‌ అంటే రూ.16,185ను మూల వేతనానికి కలిపితే.. రూ.86,531 కొత్త బేసిక్‌పే అవుతుంది. కానీ మాస్టర్‌ స్కేల్‌లో ఈ బేసిక్‌పే లేదు. దానికన్నా తక్కువగా రూ.85,240, ఆపైన రూ.92,050 బేసిక్‌ పేలు ఉన్నాయి. ఇలా ఉంటే పైన ఉండే స్కేల్‌నే ఇస్తారు. ఈ లెక్కన ఈ సీనియర్‌ లెక్చరర్‌ కు రూ.92,050 మూల వేతనం, దీనిపై 7.28 శాతం డీఏ+హెచ్‌ఆర్‌ఏ+సీసీఏ వంటి ఇతర అలవెన్సులు కలిపి పూర్తి వేతనాన్ని నిర్ధారిస్తారు. 

‘సీఎంకు కృతజ్ఞతలు’
సాక్షి, హైదరాబాద్‌:
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో పీఆర్‌సీ ప్రకటన చేసినందుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ప్రకటన అనంతరం మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ ఆయన సీటు వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత సీఎం చాంబర్‌లో కేసీఆర్‌ను కలిసిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్‌సీ ప్రకటనపై కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఉద్యోగ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్, ప్రతాప్‌ (టీఎన్‌జీఓ), గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకురాలు మమత, ఏనుగుల సత్యనారాయణ (టీజీఓ), శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌ (పీఆర్‌టీయూ టీఎస్‌), గడ్డం జ్ఞానేశ్వర్‌ (నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం), తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్‌ కుమార్, బాణాల రాంరెడ్డి (వీఆర్వోలసంఘం) ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement