సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 30 శాతం ఫిట్‌మెంట్‌తో పెరిగిన జీతాలు ఈ నెల నుంచే ఉద్యోగులు, పెన్షనర్ల చేతికి అందనున్నాయి. ప్రస్తుత జూన్‌కు సంబంధించిన పెరిగిన వేతనాలు, పెన్షన్లు జూలైలో జమకానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లు కలిపి మొత్తం 9,21,037 మందికి పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
మూడు విధాలుగా..
పీఆర్సీ బకాయిలకు సంబంధించి నోషనల్ బెనిఫిట్‌ను 2018 జూలై 1 నుంచి.. 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్స్‌గా, 2021 ఏప్రిల్ 1 నుంచి నేరుగా నగదు రూపంలో అందజేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. పెన్షనర్లకు 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మే 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను (ఎరియర్స్).. 36 వాయిదాల్లో అందజేస్తామని ప్రకటించింది. ఇక కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.
రూ.1,000 కోట్లు భారం
పీఆర్సీని 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలుచేస్తే.. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి నెలా సుమారు రూ.1,000 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఫిట్‌మెంట్‌కు ప్రభుత్వం గతంలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే దీనిపై కసరత్తు చేసింది. పీఆర్సీలో ఒక్కో శాతం ఫిట్‌మెంట్‌కు ఏడాదికి రూ.300 కోట్లు అదనంగా అవసరమని గుర్తించింది. అంటే 30 శాతం ఫిట్‌మెంట్‌కు ఏటా రూ.9,000 కోట్లు కావాలని అంచనా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు కలిపి.. మొత్తం 5.29 లక్షల మందికి పీఆర్‌సీ ప్రయోజనాలు అందనున్నాయి. వీరికి ప్రతినెలా రూ.750 కోట్లు అదనంగా చెల్లించాల్సి రానుంది. దీనికితోడు గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు, సుమారు 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ప్రతి నెలా మరో రూ.250 కోట్ల వరకు భారం పడనుందని అంచనా. అంటే మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అదనంగా రూ.1,000 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉండనుంది.
బకాయిలు, నగదు చెల్లింపులు ఎలా?
►రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాస్తవంగా పెంచిన వేతనాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అందనున్నాయి. అప్పటి నుంచి 2021 మార్చి 31 వరకు ఇవ్వాల్సిన వేతన పెంపు బకాయిలను వివిధ రూపాల్లో చెల్లించే అవకాశం ఉంది.
►పాత పెన్షన్ విధానంలోని ఉద్యోగులకు బకాయిల మొత్తంలో కొంత జీపీఎఫ్ (జనరల్ ప్రావిడెంట్ ఫండ్)లో కలిపి, మరికొంత నగదుగా ఇస్తారు.
►సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టం) ఉద్యోగులకు మొత్తం బకాయిలను నగదు రూపంలోనే ఇవ్వాల్సి
ఉంటుంది. అయితే దీనిని వాయిదాల్లో చెల్లించే అవకాశం ఉంది. ఎన్ని వాయిదాల్లో చెల్లిస్తారన్నది జీవోలో వెల్లడిస్తారు.
►ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి క్యాష్ బెనిఫిట్స్ వర్తింపజేయాలని నిర్ణయించడంతో.. జూన్‌లో పెంచిన జీతం, ఏప్రిల్, మే నెలల పెంపు బకాయిలు కలిపి జూలైలో
ఉద్యోగుల చేతికి అందే అవకాశం ఉంది.
►పెన్షనర్లకు బాకీలను 36 వాయిదాల్లో అందజేయనున్నారు.
►పీఆర్సీకి సంబంధించిన జీవో, పూర్తి మార్గదర్శకాలు వెలువడితే.. జీతాలు, బకాయిల చెల్లింపులపై పూర్తి స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment