శివశంకర్ , రామయ్య
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/మూల పెన్షన్‌పై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్‌ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు.
‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు/ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి..’ అని సూచించారు.
5% ఐఆర్‌తో రూ.2 వేల కోట్లకు పైగా భారం!
ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్ 30తో ముగిసింది. జూలై 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. తాజాగా ఏర్పాటైన రాష్ట్ర రెండో పీఆర్సీ.. వేతన సవరణ ఫిట్‌మెంట్ శాతాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది.
వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటివరకు చెల్లించిన ఐఆర్‌ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా 5 శాతం ఐఆర్ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది.
ఐఆర్ వీరికి వర్తిస్తుంది..
► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఐఆర్‌ను వర్తింపజేయనున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు..
► తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీసు అధికారులు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్/ కేంద్ర ప్రభుత్వ వేతనాలు/పెన్షన్లు అందుకుంటున్న ఉద్యోగులు/పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment