
వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చిత్రంలో ఏపీఎన్జీవో నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు
సాక్షి, అమరావతి: ‘స్థానిక ఎన్నికలు కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత పెడితే ఏమవుతుంది? తగ్గక ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల విధుల్లో పాల్గొనే ఉద్యోగులెవరికైనా వైరస్ సోకి మరణిస్తే అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా?’ అని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చంద్రశేఖరరెడ్డి, సంఘ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావులు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో ఏపీ ఎన్జీవో సంఘం వెబ్‌సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ‘కరోనా వల్ల రాష్ట్రంలో ఇప్పటికీ రోజూ పదుల సంఖ్యలో చనిపోతున్నారు. ఇప్పటిదాకా ఉద్యోగులతో సహా మొత్తం 7 వేల మంది చనిపోయారు.
ఇలాంటి సమయంలో ఎన్నికలు పెడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నారు. రాష్ట్రంలో రోజుకు కేవలం 20 కేసులు వచ్చినప్పుడే ఎన్నికలను వాయిదా వేసి, ఇప్పుడు వేలల్లో నమోదవుతుంటే ఎన్నికలు పెట్టి ఎంత మందిని చంపాలని చూస్తున్నారు?’ అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపాలన్న ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అవసరమైతే ఉద్యోగ సంఘాల పక్షాన కోర్టుల్లో ఇంప్లీడ్ అయ్యి వాదనలు వినిపిస్తాం. ఉద్యోగులు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఎన్నికలు మంచిది కాదన్నారు. కరోనా తగ్గిన తర్వాతే ఎన్నికలు జరపాలి.
అప్పుడు పని చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు..’ అని తెలిపారు. వచ్చే ఏప్రిల్ కల్లా ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కారిస్తానని సీఎం హామీ ఇచ్చారని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను ప్రకటించారని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని శ్రీనివాసరావు గుర్తు చేశారు. సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ అజయ్‌కుమార్, అసోసియేటెడ్ ప్రెసిడెంట్ పురుషోత్తంనాయుడు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ సెక్రటరీ జనరల్ జోసెఫ్ సుధీర్‌బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమంతో పాటే ఉద్యోగుల సంక్షేమం: సజ్జల
వీలైనంత ఎక్కువమందికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన అని వెబ్‌సైట్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొంత జాప్యం జరిగినప్పటికీ, రానున్న రోజుల్లో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశలో సీఎం జగన్ ముందడుగు వేస్తారని చెప్పారు. ప్రజలకే సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ వాటిని అమలు చేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు వెనుకాడుతారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment