
అమరావతి: ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో నేటినుంచి కొనసాగుతున్న పగటిపూట కర్ఫ్యూపై బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. '' కట్టడి చర్యల్లో భాగంగానే కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. కరోనాపై పోరులో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉంది. వ్యాక్సిన్ ఎవరి కంట్రోల్‌లో ఉంటుందో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు.
' రోజుకు 6 లక్షల మందికి టీకా ఇచ్చే వ్యవస్థ ఏపీకి ఉంది. టీకా డోసులు కావాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి లేఖలు రాస్తున్నాం. కేంద్రం సరిపడా డోసులు ఇస్తే 35 రోజుల్లోనే అందరికి ఇచ్చేస్తాం. ప్రజారోగ్యం కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి తెచ్చాం. అవసరమైన ఆక్సిజన్, రెమిడెసివిర్‌లను అందుబాటులో ఉంచాం. కరోనా బాధితుల కోసం 45 వేలకు బెడ్స్‌ను పెంచాం. 29వేలకు ఆక్సిజన్ బెడ్స్‌ను అందుబాటులో ఉంచాం.'' అని తెలిపారు.