సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనతో పాటు మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఏసురత్నం, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఏప్రిల్ 7 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యే ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిన్న జరిగిన సమావేశంలో సీఎం వైఎస్ జగన్, మా పార్టీ శాసనసభ్యులు, సమన్వయకర్తలతో ఈ కార్యక్రమం తీరు తెన్నులను వివరించారు. పార్టీ తరఫున సచివాలయ కన్వీనర్లతో పాటు వారి తర్వాత స్థాయిలో పనిచేసే గృహ సారథుల నియామకం తర్వాత మొట్టమొదటి సారిగా ఒక భారీ పార్టీ కార్యక్రమంతో ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇందులో భాగంగా పార్టీ నియమించిన ఈ రెండు వ్యవస్థలు (కన్వీనర్లు, గృహసారథులు) ఒక మిషన్ మోడ్‌లో బాధ్యతగా ఫోకస్డ్‌గా.. సుశిక్షితులైన సైనికుల్లా పనిచేస్తే ఎలా ఉంటుందనే విషయంపై దృష్టిసారించాం. పార్టీ పరంగా పనిచేసే వారు ఒక రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే కాకుండా ప్రజల అవసరాలను గుర్తించి.. వాటిని తీర్చే బాధ్యతగల కార్యకర్తలున్న రాజకీయ పార్టీగా వైఎస్సార్‌సీపీ ముందుకెళ్తుందన్నది నిరూపించాలనేది మా ప్రయత్నం.
అలాగే, ప్రభుత్వం పనితీరుపై పార్టీ పట్ల ప్రజల అభిప్రాయాన్ని, వారి సంతృప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీ అజెండా మార్చుకోవాలనుకునే సమర్ధమంతమైన పార్టీ అధ్యక్షుడుని కలిగి ఉన్నది ‘వైఎస్సార్‌సీపీ’ అని మనందరం గర్వంగా చెప్పుకునేందుకు కసరత్తు ప్రారంభించాము. అందుకనే, ప్రజలతో మమేకమయ్యే ఈ భారీ కార్యక్రమం ఎలా ఉండాలి..? మా పార్టీ సైన్యం ప్రజలతో ఏ విధంగా మమేకమవ్వాలనే విషయంపై ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది.
7 నుంచి 20 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’
ఈనెల 7 నుంచి 20 వ తేదీ వరకు ‘జగన న్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం జరగనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది దాకా ప్రధాన కిందిస్థాయి కార్యకర్తలు మా పదాధిదళంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సచివాలయ వాలంటీర్‌లు స్థానికంగా ఎంత ఏరియా కవర్ చేస్తారో.. అంతే పరిధిలో గృహసారథుల వ్యవస్థ కూడా పనిచేస్తుంది. వాళ్లమీద సచివాలయ కన్వీనర్ల వ్యవస్థతో పాటు మండల ఇన్ ఛార్జులు, వారిని ఎప్పటికప్పుడు సమన్వయం చేసే జోనల్ కో ఆర్డినేటర్‌ల వ్యవస్థలు సైతం ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములవుతారు. ఈ యంత్రాంగం మొత్తం శాసనసభ్యులు, నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో నడుస్తోంది.
‘మా నమ్మకం నువ్వే జగన్’అనే నినాదంతో..
ప్రజల నుంచి వచ్చిన ప్రధానమైన నినాదం ‘మా నమ్మకం నువ్వే జగన్..’. అందుకే ఈ నినాదాన్ని కూడా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ఒక ప్రధాన అంశంగా పెట్టాం. ఈ నినాదమనేది మాకు మేముగా అనుకున్నది కాదు. వైఎస్ జగన్ అధికారంలోకొచ్చాక ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల ఆలోచనలకు భిన్నంగా.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే లక్షణం రాజకీయ పార్టీలకు ఉండాలని, అలాగే ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలకు, అంచనాలకు అనుగుణంగా పాలన సాగించాలని, ప్రజల జీవితాల్లో, వారి జీవనశైలిలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం.
రియల్ ఛేంజ్..
ప్రజల జీవితాల్లో అనూహ్యమైన మార్పును తెస్తూ, బాధ్యతగా సేవలందించడంలో అందరికంటే మేము ముందున్నాం. పార్టీ అజెండా రూపకల్పన దగ్గర్నుంచి, మా పార్టీ విధానాలు.. సంక్షేమ పథకాలు అమలు తీరు.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న క్రమాన్ని అందరూ గుర్తించారు. ఈ విషయాన్ని మా పార్టీ జనంలోకి వెళ్లినప్పుడు, గడపగడపకు మా ప్రభుత్వం కార్యక్రమం పేరిట ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఇంటింటికీ తిరిగినప్పుడు.. సచివాలయాల ద్వారా వాలంటీర్లు క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తున్న సర్వేల ద్వారా పరిశీలిస్తే.. దాదాపు 80 నుంచి 90 శాతం వరకు సమాజంలో ఒక రియల్ ఛేంజ్ (గుణాత్మకమైన మార్పు) కనిపిస్తుందని నిరూపితమైంది.
సీఎం జగన్‌పై ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో.. దాన్ని ఒకటికి రెండింతలు నిలబెట్టుకున్నారని .. అందుకనే సీఎంను మేమంతా నమ్ముతున్నామని ఈ రోజు ప్రజలు చెబుతున్నారు. మా భవిష్యత్తు జగన్‌లో కనిపిస్తోందని బలంగా ప్రజల మాటల్లో వినిపిస్తోంది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంగా తీసుకుని, దీన్నే కార్యక్రమం పేరుగా ఎందుకు చేయకూడదని అనుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో.. తమ నాయకుడితో మాట్లాడే అవకాశం కూడా లభిస్తోంది.
కోటి 60 లక్షల కుటుంబాలను నేరుగా కలిసి..
14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 1 కోటి 60 లక్షల కుటుంబాలను సీఎం జగన్ ప్రతినిధులుగా మేం నియమించిన గృహసారథులు, సమన్వయ కన్వీనర్లుతో పాటు మిగతా అన్ని స్థాయిల్లో నేతలు కలుస్తారు. అన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు, సమన్వయకర్తలు కీలక భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తారు.
గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటారు. అర్హులైన కుటుంబాలను నూటికి నూరుశాతం సంక్షేమ పథకాల అమలులోకి తీసుకువచ్చి.. వాళ్లందర్నీ కూడా సొంతకాళ్లమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే, సర్వే ప్రశ్నల ద్వారా వారి అభిప్రాయాల్ని సమాధానాల రూపంలో ఇస్తారు. మా నాయకుడు సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్రంలో సగటున 87శాతం ప్రజలు మా ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల పూర్తిస్థాయి విశ్వసనీయత కనబరుస్తారనే నినాదం ఈ కార్యక్రమం ద్వారా వినబోతున్నామని వైఎస్సార్‌సీపీ తరఫున బలంగా నమ్ముతున్నాం.
చదవండి: వైఎస్సార్‌సీపీకి నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే
ప్రతిపక్షాల పేరుతో వికృతచేష్టలకు ఒడిగట్టి సీఎం జగన్ సంక్షేమ రథానికి అడ్డంపడే ప్రయత్నాలు, కుట్రలు చేస్తున్న దుష్టశక్తులకు మా పార్టీ కార్యక్రమం తగిన గుణపాఠం చెబుతుందని సజ్జల అన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ సంక్షేమ కార్యక్రమాలపై ఒక వీడియోను ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment