సాక్షి, అమరావతి: కరోనా నివారణ చర్యల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీకి పేరు రావటంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కూర్చుని ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తల ద్వారా దుర్మార్గమైన, నీచమైన పనులు చేయిస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలివీ..
► చంద్రబాబు వందలాది టీడీపీ కార్యకర్తలకు డబ్బులిచ్చి మద్యం దుకాణాలకు గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. భౌతిక దూరం కరువైందంటూ ప్రభుత్వానికి అపఖ్యాతి వచ్చేలా చేయిస్తున్నారు.
► తాజాగా కడప జిల్లా బద్వేలులో రైతులు రోడ్లపై కూరగాయలు పారబోస్తున్నారంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయి. బీ.మఠం మండలానికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నేతలు కుట్ర చేసి బద్వేలులో రోడ్లపై మూడు రకాల కూరగాయలు పారబోశారు. ఇది వాస్తవం.
► లాక్‌డౌన్ ప్రకటించిన రోజే బద్వేలు నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని పోరుమాళ్ల రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్‌ను బంద్ చేశారు. ప్రజలకు కూరగాయల్ని అందించాలనే ఉద్దేశంతో నెల్లూరు బైపాస్ రోడ్డు కూడలి సమీపంలో అధికారులు తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేశారు.
► అక్కడికి నెల్లూరు జిల్లా ఉదయగిరి, ఆత్మకూరు ప్రాంతాలు, కడప జిల్లా బీ.మఠం, పోరుమామిళ్ల మండలాల నుంచి రైతులు, హోల్‌సేల్ వ్యాపారులు, ప్రజలు వస్తుంటారు.
► తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో కరోనా కేసులు వెలుగు చూడటంతో అక్కడ కంటైన్‌మెంట్ జోన్ ఏర్పాటైంది. జనం ఎక్కువ కావటంతో ఆ మార్కెట్‌నూ మూసివేయాలని కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు.
► దీంతో అక్కడికి చేరుకున్న బీ.మఠం మండల టీడీపీ కార్యకర్తలు కుట్రపూరితంగా కూరగాయలు పోరబోయించారు. ఈ ఘటన జరిగిన మరుక్షణమే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అధికారులను అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment