
సాక్షి, అమరావతి: కరోనాపై తన సలహాలు తీసుకోవడానికి అఖిలపక్షం పెట్టడం లేదంటున్న చంద్రబాబు.. ఎక్కడ పెట్టాలో కూడా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. కరోనా వచ్చిన వెంటనే ఆయన పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ వెళ్లితలదాచుకున్నారని.. అక్కడికెళ్లి అఖిలపక్ష సమావేశం పెట్టాలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఏపీలోని మీడియాతో మాట్లాడుతూ చేసిన విమర్శలపై మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► కరోనా వ్యాప్తి కట్టడికి అధికార యంత్రాంగం కష్టపడి పనిచేస్తోంది. ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీల ప్రమేయం ఏమీ ఉండదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ, సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఇవి చేస్తే ఎవరు వద్దన్నారు?
► ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకుండా హైదరాబాద్ నుంచి ఆన్‌లైన్‌లో నీతులు చెప్పడం మానుకోవాలి.
► బాబూ.. అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని ఇప్పుడు అడుగుతున్నావు.. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదు.
► రాజధాని ఎక్కడో నిర్ణయించేటప్పుడు అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించాలని మీకు అనిపించలేదా? రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంత కీలక వ్యవహారంపై అఖిలపక్షం ఎందుకు పెట్టలేదు?
► సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా వద్దని గాలికొదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నప్పుడు అఖిలపక్షం నిర్వహించాల్సిన అవసరం లేదా?
► హుద్‌హుద్ తుపాను విశాఖను అతలాకుతలం చేసినప్పుడు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. అప్పుడు ఎందుకు అఖిలపక్షం పెట్టలేదు?
► పెద్ద నోట్లు రద్దయినప్పుడు రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అలజడి రేగింది. మీ సలహా మేరకే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని చెప్పావే తప్ప.. అప్పుడు అన్ని రాజకీయ పక్షాలను ఎందుకు సంప్రదించలేదు.
► గోదావరి పుష్కరాల సమయంలో మీ పబ్లిసిటీ కోసం పెట్టిన షూటింగ్‌లో 29మంది చనిపోయారు. అప్పుడెందుకు అఖిలపక్షాన్ని పిలవలేదు?
► ఇబ్రహీంపట్నం వద్ద నదిలో బోటు మునిగి 21 మంది చనిపోయారు. అప్పుడెందుకు అఖిలపక్షం పెట్టలేదు?
► కాపు ఉద్యమ సమయంలో తునిలో రైలు దగ్ధమై ప్రజల్లో తీవ్ర ఆందోళన వచ్చినప్పుడు ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదు?
► ఇప్పుడు కరోనా కష్టకాలంలో హైదరాబాద్‌లో కూర్చుని ప్రభుత్వంపై రాళ్లు వేయడం దుర్మార్గం.
► విపత్తు వేళ చేతనైతే ప్రభుత్వానికి సహకరించాలి. అదే పనిగా ఆరోపణలు చేస్తూ అధికార యంత్రాంగం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం మీకు తగదు.
► ఇక్కడ ప్రజల కష్టాలను పట్టించుకోని చంద్రబాబుకు అఖిలపక్షం పెట్టాలని అడిగే నైతిక హక్కులేదు.