కుప్పంలో బాబు కథ ముగిసింది: సజ్జల | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

కుప్పంలో బాబు కథ ముగిసింది: సజ్జల

Published Tue, Nov 16 2021 3:49 AM | Last Updated on Tue, Nov 16 2021 9:51 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కుప్పంలో చంద్రబాబు కథ ముగిసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కుప్పం నగరపంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయం ఎదురు కానుందని తెలిపారు. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సాకులు వెతుక్కుంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నిర్మించుకున్న కోటను.. ఇప్పటికే గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు బద్దలుకొట్టారని, వైఎస్సార్‌సీపీకి ఆఖండ విజయాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. అందుకే కుప్పంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి, ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను రప్పించి దొంగ ఓట్లు వేసుకుని గెలవాలనే దింపుడుకళ్లం ఆశలతో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు.

సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల నియోజకవర్గానికి తీరని అన్యాయం చేశారని చెప్పారు. కానీ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని నియోజకవర్గాల ప్రజలను కుటుంబ సభ్యుల్లా భావిస్తూ సంక్షేమాభివృద్ధి ఫలాలను అందజేస్తున్నారని చెప్పారు. ఆ ఫలాలు కుప్పం నియోజకవర్గానికి వ్యాపించాయని తెలిపారు. చంద్రబాబు చెరలో మగ్గిపోతున్న ఆ నియోజకవర్గ ప్రజలు.. తమకు తాము విముక్తి కల్పించుకుంటూ టీడీపీపై తిరుగుబాటు చేస్తున్నారని చెప్పారు. కుప్పం నగరపంచాయతీలో వైఎస్సార్‌సీపీకి విజయాన్ని కట్టబెడుతున్నారని అన్నారు. ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు గిలగిలా కొట్టుకుంటున్నారని అన్నారు. మధ్యాహ్నం 1 గంటకే 60 శాతం ఓట్లు వేయడాన్ని బట్టి చూస్తే.. టీడీపీపై ప్రజలు ఏ స్థాయిలో తిరుగుబాటు చేశారో తెలుసుకోవచ్చని అన్నారు.

దొంగ ఓట్లు వేయడానికి వచ్చింది టీడీపీ కార్యకర్తలే
రాష్ట్రంలో నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు పలు పట్టణాలు, ఇతరచోట్ల ఎన్నికలు జరుగుతుంటే.. చంద్రబాబు ఒక్క కుప్పం నగరపంచాయతీ ఎన్నికపైనే సాధారణ ఎన్నికల తరహాలో రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం ఆయన ఉనికికే ప్రమాదం తెస్తుందన్న భయంతో వైఎస్సార్‌సీపీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను కుప్పంకు రప్పించిన చంద్రబాబే.. ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై నెడుతున్నారని చెప్పారు. దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారు వైఎస్సార్‌సీపీకి చెందిన వారైతే.. సీఎం డౌన్‌ డౌన్‌ అని ఎందుకు నినాదాలు ఇస్తారని ప్రశ్నించారు.

పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి కుప్పం బస్టాండుకు వచ్చిన వారిని, మహిళలను.. దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని నెపం వేస్తూ టీడీపీ గూండాలు వేధించారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. డబ్బులు పంచుతూ పట్టుబడింది టీడీపీ కార్యకర్తలు కాదా అని ప్రశ్నించారు. కుప్పం నగరపంచాయతీ 24 వార్డుల్లో ఉన్న 48 పోలింగ్‌ బూత్‌ల్లో టీడీపీ అభ్యర్థులతోపాటు చంద్రబాబు మాఫియాలోని 48 మంది ఏజెంట్లు ఉంటారని, దొంగ ఓట్లు వేస్తుంటే ఆ ఏజెంట్లు నిద్రపోతున్నారా అని నిలదీశారు.

ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తులకు బాబు రోల్‌మోడల్‌
వెన్నుపోటు ద్వారా అధికారాన్ని, టీడీపీని దక్కించుకున్న చంద్రబాబుకు ప్రజలంటే ప్రేమ, విశ్వాసం లేదన్నారు. ఓడిపోతే ఈవీఎంలను ట్యాంపర్‌ చేశారని బ్యాలెట్లతో ఎన్నికలు జరపాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తారని.. బ్యాలెట్ల ద్వారా ఓడిపోతే ఈవీఎంలు కావాలంటారని చెప్పారు. ఆయన తానా అంటే తందాన అనే ఎల్లో మీడియా అదే అంశాన్ని ప్రచారం చేస్తాయని అన్నారు. అందుకే ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తులకు చంద్రబాబు రోల్‌మోడల్‌గా నిలుస్తారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఆఖండ విజయం సాధించి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే సీఎం వైఎస్‌ జగన్‌ 95 శాతం హామీలను అమలు చేశారన్నారు.

రెండున్నరేళ్లలో 15 నెలలు కరోనా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు అందించి.. ప్రజలకు తోడూనీడగా నిలిచారన్నారు. ప్రజలంటే విశ్వాసం, ప్రేమ ఉండటం వల్లే జగన్‌ జనరంజకమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు. అందుకే అన్ని ఎన్నికల్లో జనం వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తున్నారని తెలిపారు. కొత్త తరహా రాజకీయాలు ఎలా ఉంటాయో చూడటానికి చంద్రబాబు చాలాకాలం బతికే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇప్పటిౖకైనా వైఎస్సార్‌సీపీని జనం ఎందుకు ఆదరిస్తున్నారనే అంశాన్ని ఆయన గ్రహించాలని హితవుపలికారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement