అక్టోబర్‌ 2న ‘సెల్యూట్‌ సీఎం సర్‌’ | Johnny Pasha says Salute CM Sir Program on 2nd October | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 2న ‘సెల్యూట్‌ సీఎం సర్‌’

Published Tue, Aug 2 2022 4:08 AM | Last Updated on Tue, Aug 2 2022 3:20 PM

Johnny Pasha says Salute CM Sir Program on 2nd October - Sakshi

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న చంద్రశేఖర్‌ రెడ్డి, బండి శ్రీనివాసరావు, జానీ పాషా

సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగులు అక్టోబర్‌ 2న ప్రతి సచివాలయం పరిధిలో సెల్యూట్‌ సీఎం సర్‌ కార్యక్రమం నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎండీ జానీ పాషా పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి, ఫెడరేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్‌తో కూడిన కొత్త జీతాలు వచ్చాయని, ఈరోజు తమకు శుభ దినమని తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయమని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ 1.30 లక్షల  మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఇది చెరగని చరిత్ర అని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ఇది సువర్ణ అధ్యాయమన్నారు. తమకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తూ నూతన పేస్కేళ్ళు వర్తింపచేయడంతో విమర్శలు చేసిన వారి నోళ్లు మూగబోయాయని అన్నారు. ఇంత మందికి మంచి జరగడం సహించని వారు ఈ ఉద్యోగాలు పర్మినెంట్‌ కాదని, తాత్కాలికమేనని, రూ.15 వేలకు మించి జీతం పెరగదంటూ ఉద్యోగులను కించపరిచేలా అనేక అవాస్తవాలు ప్రచారం చేశారని చెప్పారు. పేస్కేల్స్‌తో జీతం ఇవ్వడం తమకు వరమైతే కొందరు కుట్రదారులకు చెంపపెట్టులా నిలిచిందన్నారు.  

సీఎం మాట నిలబెట్టుకున్నారు: చంద్రశేఖర్‌రెడ్డి 
మాట తప్పని, మడమ తిప్పని సీఎం మాట ఇస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపితమైందని ప్రభుత్వ సలహాదారు ఎన్‌. చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జూలై ఒకటి నుంచి సచివాలయ ఉద్యోగులకు నూతన పేస్కేల్‌ ప్రకారం జీతం అందించారని కొనియాడారు. 

నవ చరిత్రకు నాంది: బండి శ్రీనివాసరావు
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ సీఎం చేయని సాహసాన్ని ఏపీ సీఎం జగన్‌ చేశారని, నవ చరిత్రకు నాంది పలికారని తెలిపారు. ఇంత గొప్ప వ్యవస్థను సృష్టించి యువతకు శాశ్వత భరోసా కల్పించడం గొప్ప విషయమన్నారు. తమ కలలు సాకారమైన వేళ గుండెలు నిండా అభిమానంతో ఈ సమావేశంలో పలువురు సచివాలయ ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘సెల్యూట్‌ సీఎం సర్‌’ అంటూ నినాదాలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement