
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ప్రొబేషన్ ప్రకటనపై గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన, అపోహలకు గురికావద్దని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ అని, అందులో పనిచేసే ఉద్యోగులపై ఆయనకు ఎంతో అభిమానం ఉందని చెప్పారు. శనివారం విజయవాడలోని ఎన్జీఓ హోమ్‌లో పలు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఆదర్శవంతమైందని చెప్పారు. దీన్ని చూసి పలు రాష్ట్రాలు ఇలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను వేగంగా ప్రజలకు చేరవేయడంలో సచివాలయ ఉద్యోగులది కీలక పాత్ర అని చెప్పారు.
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్‌లోపు పూర్తి చేసి జులై నుంచి పే స్కేల్స్ ఇస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. కొందరు ఉద్యోగులు గత అక్టోబర్ 2 నుంచే పే స్కేల్స్ అమలు చేయాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయని, వారంతా సంయమనం పాటించాలని కోరారు. అందరికీ ఒకేసారి ప్రొబేషన్ ప్రకటించి, ఆ తర్వాత పే స్కేల్స్ అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 23 శాతం ఫిట్‌మెంట్ వల్ల జీతాలు తగ్గుతాయనే ప్రచారం సరికాదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, కరోనా వల్ల తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం గొప్ప విషయమని తెలిపారు.
ఎవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేయలేదు: జానీ బాషా
గ్రామ సచివాలయ ఉద్యోగులెవరూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానీ బాషా చెప్పారు. ప్రొబేషన్‌పై సీఎం న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. అక్టోబర్ 2 నుంచి పే స్కేల్ ఇవ్వాలని కోరుతున్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. దీని వెనుక కొన్ని శక్తులు ఉన్నట్లు అనుమానం ఉందన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులే కాదని అన్నారని, వారిని పీఆర్సీలో చేర్చడం ద్వారా ఇలాంటి అనుమానాలు పోయాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment