'నేను పదవిలో ఉన్నంతకాలం విభజన జరగదు' - ఉద్యోగులతో సీఎం కిరణ్
ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డితో బుధవారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మె విరమించడానికి ఉద్యోగ సంఘాలు నిరాకరించారు. సమైక్య రాష్ట్రంపై ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదు అని ఉద్యోగ సంఘాల నేతలు అన్నారు. పదవిలో ఉన్నంత కాలం రాష్ట్ర విభజన జరగదని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో అన్నారు.
అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన తర్వాతనే సమ్మె విరమణపై ఓ నిర్ణయం తీసుకుంటామని జేఏసీ నేతలు వెల్లడించారు. త్వరలోనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. రాష్ట్రానికి తుఫాన్ ముప్పు ఉన్నందున్న ప్రభుత్వానికి సహకరించి..సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రితో మూడు గంటలపాటు జరిగిన చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రితో చర్చలు అనంతరం జేఏసీ నేత అశోక్ బాబు మాట్లాడుతూ.. తుఫాన్ వస్తే అత్యవసర సేవల్లో పాల్గొంటాం. సమ్మె యధావిధిగా కొనసాగుతుంది. ఈ నెల 11, 12 తేదిన అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తాం అని అన్నారు.