హెల్త్ కార్డులపై ఉద్యోగులకు అరకొర వైద్యం
♦ పూర్తిస్థాయి వైద్యం అందించడానికి చర్యలు తీసుకోండి
♦ ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకు ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై వైద్యం అంతంతమాత్రంగానే అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అరకొర సేవలు మాత్రమే అందుతుంటే.. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. హెల్త్‌కార్డుల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగ సంఘాల జేఏసీ శుక్రవారం ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఈవో అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్న సంజీవని, తపాలా అధికారులతో పాటు జేఏసీ నేతలు అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
హెల్త్‌కార్డుల పథకం అమలవుతున్న తీరును సమీక్షించారు. వర్క్‌చార్జ్‌డ్ ఉద్యోగులు, పలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు.. దాదాపు 40 వేల మందికి వివిధ సాంకేతిక కారణాల వల్ల హెల్త్‌కార్డులు మంజూరు కాలేదని జేఏసీ నేతలు చెప్పారు. వారందరికీ కార్డులు మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను సరిచేయాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఈనెల 10న ప్యాకేజీ ధరల జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నాయని, ధరలు ఖరారైన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని ఆసుపత్రుల్లో నగదు ప్రమేయం లేని వైద్యం అందుబాటులోకి వస్తుందని సీఈవో చెప్పారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా దీర్ఘకాలిక రోగాలకు ఓపీ సేవలు పొందే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. హైల్త్‌కార్డుల మీద వైద్యం అందించడానికి నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్టీఆర్ వైద్యసేవకు ఫోన్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో చేసేందుకు అవకాశం ఉందన్నారు.