NTR medical services
-
చిన్నారి ప్రాణంతో చెలగాటం
సాక్షి, గుంటూరు: ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదు..బుడిబుడి అడుగులు వేసే మూడేళ్ల వయస్సులోనే దాదాపు 45 రోజులుగా క్షణం క్షణం నరకం చవిచూస్తోంది. శరీరం వెనుక భాగంలో తీవ్రంగా కాలిన గాయాల బాధతో కొట్టుమిట్టాడుతున్న చిన్నారికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్యం చేసే వీలున్నప్పటికీ.. ఇప్పటికే బకాయిలు అధికంగా ఉండడంతో ప్రైవేటు వైద్యులు ఎవరూ ముందుకు రాని దుర్భర పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా వినుకొండ పాత క్రిస్టియన్‌పాలెంలో నివాసం ఉంటున్న యెలికపాటి ఆదయ్య, కీర్తి దంపతుల చిన్న కుమార్తె అమూల్య తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గౌనుకు నిప్పంటుకుని వీపు నుంచి కింది భాగమంతా పూర్తిగా కాలిపోయింది. నవంబరు 14వ తేదీన ఘటన జరగడంతో తల్లిదండ్రులు వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొద్దిరోజులు చికిత్స చేయించారు. అక్కడ రూ.50 వేలు ఖర్చు కావడంతో నిరుపేద కుటుంబం కావడంతో అప్పు తేలేక, ఆస్పత్రి నుంచి అమూల్యను ఇంటికి తీసుకెళ్లి మందులు వాడుతున్నారు. అయితే వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో గాయం మానకుండా పెద్దది అవుతూ వచ్చింది. దీంతో గురువారం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రి, మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రులకు అమూల్యను తీసుకెళ్లారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉందని, దాని ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవలో ఉచితంగా చేసే వీలు ఉన్నప్పటికీ అనుమతులు వచ్చే వరకు అయ్యే ఖర్చు భరించాలని, అనుమతులు రాకపోతే పూర్తిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుందని వైద్యులు తేల్చి చెప్పారు. ఆర్థిక స్థోమత లేని ఆదయ్య దంపతులు అమూల్యను తీసుకుని సాయంత్రం 5.30 గంటల సమయంలో జీజీహెచ్‌కు వెళ్లారు. జీజీహెచ్‌లో బర్న్స్ వార్డు లేదని, చిన్న పిల్లల వార్డులో ఉంచితే ఇన్ఫెక్షన్ వచ్చి ఇంకా ఎక్కువ ఇబ్బంది జరుగుతుందంటూ అక్కడి వైద్యులు చెప్పడంతో చేసేది లేక ఇంటికి బయల్దేరారు. వారి సమీప బంధువు సోషల్ మీడియాలో ఈ వ్యవహారం అంతా పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీన్ని గమనించిన జీజీహెచ్ అధికారులు ఆదయ్యకు ఫోన్ చేసి వెనక్కు రావాలని కోరారు. దీంతో గురువారం రాత్రి జీజీహెచ్‌కు తీసుకొచ్చి అమూల్యను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అమూల్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. అయితే జీజీహెచ్‌లో దీనికి సంబంధించి ఎటువంటి మందులూ లేకపోవడం గమనార్హం. బర్న్స్ వార్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు జారీ చేసిన జీవో బర్న్స్ వార్డుకు కేంద్రం నిధులిచ్చినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. గుంటూరు జీజీహెచ్‌కు కోస్తాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఆరు జిల్లాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా వైద్యులు ఇక్కడకు రిఫర్ చేస్తుంటారు. అయితే ఇంత పెద్ద ఆస్పత్రిలో బర్న్స్ వార్డు లేకపోవడంతో కాలిన గాయాలతో వచ్చిన అనేకమంది రోగులు ప్రాణాలు కోల్పోతున్న దుర్భర స్థితి నెలకొంది. రాజధాని ప్రాంతంలో ఉన్న పెద్ద ఆస్పత్రిలో సైతం బర్న్స్ వార్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయని పరిస్థితి. కాలిన గాయాల నివారణ, నియంత్రణ జాతీయ కార్యక్రమం (ఎంపీపీఎంబీఐ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు బోధనా ఆస్పత్రుల్లో బర్న్స్ వార్డుల నిర్మాణానికి ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం రూ.40 కోట్లు మంజూరు చేసింది. గుంటూరు జీజీహెచ్‌కు సైతం రూ.8 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసినప్పటికీ కనీసం టెండర్లు కూడా పిలిచిన దాఖలాలు లేవు. బర్న్స్ వార్డు నిర్మాణానికి నిధులు ఉన్నా నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు చెల్లించమని చెప్పిన మాట వాస్తవమే.. కాలిన గాయాలతో అమూల్య అనే చిన్నారిని తీసుకుని మా వద్దకు వచ్చారు. అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుకు అనుమతి కోసం పంపుతామని, అనుమతి వచ్చే వరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాం. అనుమతి వస్తే ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని తెలిపాం. అయితే వారు ఆస్పత్రిలో చేర్చకుండా వెళ్లిపోయారు. ఎన్టీఆర్ వైద్యసేవలో ఎక్కువగా కాలిన గాయాలు ఉంటే మాత్రమే అనుమతి వస్తుంది. అందుకే ముందుగా ఎన్టీఆర్ వైద్య సేవలో చేర్చుకోలేకపోయాం. – రామాంజనేయులు,ఎన్నారై ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్య మిత్ర -
లోగుట్టు ఏమిటో?!
కర్నూలు(హాస్పిటల్): జిల్లా స్థాయిలో నిర్వహించే అభివృద్ధి కమిటీ సమావేశాలకు ప్రజాప్రతినిధులతో పాటు మీడియాను కూడా అనుమతిస్తారు. కానీ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిర్వహించే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాలకు మాత్రం మీడియాను అడ్డుకుంటున్నారు. మంగళవారం సైతం ఇలాగే మీడియా ప్రతినిధులను సమావేశం నుంచి పంపించివేశారు. ఆసుపత్రి నిధుల వినియోగంపై జరిగే చర్చల్లో విషయాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతోనే మీడియాను అడ్డుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వజన వైద్యశాలలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆలస్యంగా రావడంతో రాత్రి 7.15 గంటలకు సమావేశం ప్రారంభమై.. 9 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 నుంచి అక్కడే ఉన్న విలేకరులను సమావేశం ప్రారంభమయ్యాక అధికారులు బయటకు పంపించారు. ఇదేమంటే సమావేశమయ్యాక బ్రీఫింగ్ ఇస్తామని, మీడియా అవసరం లేదని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ నిధులు రూ.15 కోట్లకు పైగా ఆసుపత్రిలో ఉన్నాయి. వీటిని ఖర్చు చేసేందుకే అధికారులు ఉన్న ఫలంగా సమావేశం ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సమావేశంలో తీర్మానించిన పనులు పూర్తి కాకుండానే మళ్లీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొని నిధుల వినియోగంపై చర్చించారు. ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం ఆసుపత్రిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదని ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పందులు విచ్ఛలవిడిగా తిరుగుతున్నాయని, ఆసుపత్రి అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నారని ఆయన మందలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, వారిపై ఎవ్వరి అజమాయిషీ లేనట్లుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. తాను ఆకస్మిక తనిఖీకి వస్తానని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.ఆసుపత్రిలో రూ.11.56 కోట్లతో డయాగ్నోస్టిక్ బ్లాక్‌కు రెండోసారి టెండర్‌కు వెళ్తున్నామన్నారు. అంతర్గత రహదారుల నిర్మాణాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న అధికారుల క్వార్టర్లను వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు, గ్యాస్ట్రో విభాగం అభివృద్ధికి రూ.8లక్షలు, పీడియాట్రిక్ బ్లాక్‌లో రూ.7లక్షలతో బ్రాంకోస్కోపి, రెండు వెంటిలేటర్లు, రూ.17లక్షలతో ఫుల్లీ ఆటోఅనలైజర్ కొనుగోలు చేస్తామన్నారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలను రూ.4.73 కోట్లతో కొనుగోలు చేస్తామని తెలిపారు. డిజిటల్ రేడియోగ్రాఫిక్ పరికరానికి రూ.1.33 కోట్లు వెచ్చిస్తున్నామని, ఈ యంత్రం ఒకేసారి 400 ఎక్స్‌రే ప్రింట్లు తీస్తుందని తెలిపారు. ఈసీటీ(మానసిక వ్యాధులలో షాక్ ట్రీట్మెంట్)కి రూ.6లక్షలు, సెల్కౌంటర్కు రూ.6లక్షలు, మూడు బోర్లు, 320 కేవీ జనరేటర్‌కు నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. 3 సులభ్ కాంప్లెక్స్‌లకు అనుమతులు ఇస్తున్నామని, ఎన్టీఆర్ వైద్యసేవ నిధులతో 41 మందిని(3 ఫార్మాసిస్టు, 5 ఈసీజీ, 1 ఈఈజీ, 1 ఈఆర్సీపీ, 5 హెల్పర్లు, 10 డేటాఎంట్రీ ఆపరేటర్లు, 15 స్టెచ్చర్ బాయ్స్, 1 బార్బర్) ఔట్సోర్సింగ్ విధానంలో నియమిస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 11 మంది ఉద్యోగుల వేతనాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, కమిటీ సభ్యులు మంజునాథరెడ్డి, అనురాధ, మహేష్‌గౌడ్, పోతురాజు రవికుమార్, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ విజయభాస్కర్, మున్సిపల్ కమిషనర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు. -
రూ. 1,200 చెల్లిస్తే ‘ఆరోగ్య రక్ష’
- కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు - నెలకు రూ. 100 చెల్లిస్తే రూ. 2 లక్షల వరకూ బీమా సాక్షి, అమరావతి: ఏటా రూ. 1,200 చెల్లించిన వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్య భద్రత, భరోసా కల్పించేందుకు ‘ఆరోగ్య రక్ష’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమా ఆవశ్యకమన్నారు. నూతన సంవత్సర కానుకగా ‘హెల్త్ ఫర్ ఆల్’ (అందరికీ ఆరోగ్యం) ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఆరోగ్య బీమా కావాలనుకునే వారు నెలకు రూ.100 అంటే ఏడాదికి రూ.1,200 చెల్లించాలని తెలిపారు. ఈ పథకంలో చేరిన ప్రతీవ్యక్తికి రూ. 2 లక్షల వరకూ ఆరోగ్యబీమా సౌకర్యం ఉంటుందన్నారు. ఫిబ్రవరి 28 లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. ప్రస్తుతం పేదలకు తెల్లరేషన్ కార్డు ద్వారా ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపిన సీఎం.. ఏ ఆరోగ్య పథకంలో లేని, ప్రభుత్వ భరోసా అందని వారికి తక్కువ ప్రీమియంతో ఆరోగ్యరక్ష అందిస్తున్నామని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.. రాష్ట్ర వ్యాప్తంగా 436 ఆస్పత్రుల్లో ఆరోగ్య రక్ష సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పాజిటివ్‌గా ఆలోచించే ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పరిసరాలే ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు రావని సీఎం ఉద్బోధించారు. వైద్య రంగంలో కీలక మార్పులు వచ్చాయని, ఎలాంటి వ్యాధికైనా నొప్పిలేకుండా వైద్యం అందించే రోజులు ఇప్పుడున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందరూ ఆర్థికరంగం, పేదరికం గురించి మాట్లాడుతున్నారని, కానీ ఆరోగ్యం గురించి మాట్లాడటం లేదని సీఎం అన్నారు. -
ఎన్టీఆర్ వైద్యసేవకు బకాయి సుస్తీ
పేద రోగులు వైద్యసేవల కోసం మునుపటిలా కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టెక్కేందుకు సంశరుుస్తున్నారు. ఆరోగ్యశ్రీ (ప్రస్తుత పేరు ఎన్టీఆర్ వైద్యసేవ) కార్డు వెంటబెట్టుకుని వెళ్లడానికి వెనుకాడుతున్నారు. తమను చేర్చుకుని వెంటనే సేవలందిస్తారా లేదా అనే సందేహం వీరిని వెంటాడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. చేర్చుకుని సేవలందిస్తే సర్కారు నిధులు విడుదల చేస్తుందా లేదా అనే మీమాంస కార్పొరేట్ ఆస్పత్రులను వెంటాడుతోంది. ఇప్పటికే బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రోగులను చేర్చుకోవడం పట్ల అంత ఆసక్తి కనబరచడం లేదని భోగట్టా. అంతేకాదు తమ బకాయిల కోసం ఉద్యమించడానికి కార్పొరేట్ ఆస్పత్రులు సిద్ధపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం దూరమయ్యేలా ఉంది. * ఎన్టీఆర్ వైద్యసేవకు నిధులు విడుదల చేయని సర్కారు * కార్పొరేట్ ఆస్పత్రులకు భారీగా బకాయిలు * వైద్యసేవలు నిలిపివేయాలనే యోచనలో ఆస్పత్రి యాజమాన్యాలు శ్రీకాకుళం సిటీ : ఎన్టీఆర్ వైద్యసేవలకు నిధుల గ్రహణం వెంటాడుతోంది. రిమ్స్‌తో పాటు పాలకొండ, టెక్కలి, పాతపట్నం, సీహెచ్‌సీల్లో ఈ పథకం కింద వైద్య సేవలందుతున్నాయి. వీటితో పాటు ఎంపిక చేసిన కార్పొరేట్ ఆస్పత్రులు బగ్గు సరోజనీదేవి, కిమ్స్ సాయిశేషాద్రి, సిందూర, జీఎంఆర్, జెమ్స్లలో కూడా వైద్య సేవలు అందుతున్నాయి. 2007లో అప్పటి ముఖమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పేదలకు కార్పొరేట్ స్ధాయి వైద్యం అందించాలన్నదే ముఖ్య ఉద్ధేశంగా ఆయన ఈ పథకాన్ని తీర్చిదిద్దారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చింది. ఎన్టీఆర్ వైద్యసేవగా తెర పైకి తీసుకువచ్చింది. పేదప్రజలకు అందిస్తున్న వైద్యానికి రకరకాలు మెలికలు పెట్టి కుదించేసింది. కార్పొరేట్ ఆస్పత్రులు ఈ పథకాన్ని అమలుచేస్తున్నా ప్రభుత్వం సరిగ్గా నిధులు చెల్లించడం లేదు. దీంతో భారీగా బకాయిలు పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆంధ్రపదేశ్ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్(ఆషా) ఆందోళన కూడా చేపట్టాల్సి వచ్చింది. కొన్ని నెలలుగా ప్రభుత్వానికి, ఆషాకు మద్య పలుపర్యాయాలు చర్యలు జరిగినా ఫలితం అంతంతమాత్రమే. ఈనెల 11వ తేదీలోపు పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వం తన హామీని అమలు చేయకపోవడంతో ఆషా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎన్టీఆర్ వైద్యసేవలను బంద్ చేసేందుకు సిద్ధపడినట్లు తెలిసింది. ఇదే జరిగితే పేద రోగులకు ఇక్కట్లు తప్పవు. శ్రీకాకుళం పట్టణంలో డేఅండ్‌నైట్ జంక్షన్ సమీపంలో ఉండే ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో నిర్వహించిన 407 (ఈఎన్టీ, జనరల్సర్జన్,గైనిక్, యూరాలజీ తదితర విబాగాలకు) శస్త్ర చికిత్సలకు మూడునెలలుగా రూ. 60 లక్షలకు పైగా బకాయిలు రాలేదని తెలిసింది. ఇది ఒక ఆస్పత్రి బకాయి మాత్రమే. మరో నాలుగు ఆస్పత్రులకు రూ. కోట్లల్లోనే బకాయిలన్నట్లు తెలియవచ్చింది. ఈ బకాయిల పరిస్థితి రోగులను ప్రభావితం చేస్తోంది. ఈ పథకం కింద సేవలదించేందుకు కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. రోగులను చేర్చుకుంటే మరింత బకారుులు పేరుకుపోవడం తప్ప ఫలితం లేదని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రోగులు ఈ ఆస్పత్రులకు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. శస్త్ర చికిత్సలు సకాలంలో జరగడంలేదు. కార్పొరేట్ ఆస్పత్రులు వైద్యసేవలు బంద్ చేపట్టనున్న సమచారం అధికారికంగా తమకు చేరలేదని ఎన్టీఆర్ వైద్యసేవల జిల్లా కో-ఆర్డినేటర్ రాజేష్ పేర్కొనడం విశేషం. -
హెల్త్ కార్డులపై ఉద్యోగులకు అరకొర వైద్యం
♦ పూర్తిస్థాయి వైద్యం అందించడానికి చర్యలు తీసుకోండి ♦ ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓకు ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డులపై వైద్యం అంతంతమాత్రంగానే అందుబాటులో ఉంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అరకొర సేవలు మాత్రమే అందుతుంటే.. హైదరాబాద్‌లోని పలు ప్రముఖ ఆస్పత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. హెల్త్‌కార్డుల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగ సంఘాల జేఏసీ శుక్రవారం ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవో రవిశంకర్ దృష్టికి తీసుకెళ్లింది. సీఈవో అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్న సంజీవని, తపాలా అధికారులతో పాటు జేఏసీ నేతలు అశోక్‌బాబు, ఐ.వెంకటేశ్వరరావు, చంద్రశేఖరరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, రఘురామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వీరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. హెల్త్‌కార్డుల పథకం అమలవుతున్న తీరును సమీక్షించారు. వర్క్చార్జ్డ్ ఉద్యోగులు, పలు మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు.. దాదాపు 40 వేల మందికి వివిధ సాంకేతిక కారణాల వల్ల హెల్త్‌కార్డులు మంజూరు కాలేదని జేఏసీ నేతలు చెప్పారు. వారందరికీ కార్డులు మంజూరు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలను సరిచేయాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులు ఈనెల 10న ప్యాకేజీ ధరల జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నాయని, ధరలు ఖరారైన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని ఆసుపత్రుల్లో నగదు ప్రమేయం లేని వైద్యం అందుబాటులోకి వస్తుందని సీఈవో చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా దీర్ఘకాలిక రోగాలకు ఓపీ సేవలు పొందే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. హైల్త్కార్డుల మీద వైద్యం అందించడానికి నిరాకరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు మరోసారి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులను ఎన్టీఆర్ వైద్యసేవకు ఫోన్ ద్వారా లేదా ఆన్లైన్లో చేసేందుకు అవకాశం ఉందన్నారు. -
సంజీవనికి సుస్తీ..
♦ అక్కరకు రాని ఎన్టీఆర్ వైద్యసేవ ఊ సేవల పరిధి విస్తరించినా.. అనుమతుల్లో తీవ్ర జాప్యం ♦ నిలిచిన అత్యవసర శస్త్ర చికిత్సలు ♦ ఏడాదిగా ఊసేలేని వైద్య శిబిరాలు ♦ పేదలకు అందని కార్పొరేట్ వైద్యం ఆరోగ్య శ్రీ... నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం. వైఎస్ హయాంలో అపర సంజీవనిలా పేదల ప్రాణాలు నిలిపిన ఈ పథకం.. ఆయన మరణానంతరం క్రమంగా పేదలకు దూరమైంది. టీడీపీ ప్రభుత్వం మరిన్ని రోగాలకు సేవలందిస్తామంటూ పథకం పరిధి విస్తరించి..ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చినా అనుమతుల్లో తీవ్ర జాప్యంతో పథకం లక్ష్యం నెరవేరడం లేదు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు సెంట్రల్ : ఒకనాడు పేదవాడు ఏ జబ్బు వచ్చినా ఆరోగ్యశ్రీ కార్డు ఉందన్న భరోసాతో బతికేశాడు. ఇప్పుడు పథకానికి పేరు మార్చినా అనేక కారణాల వల్ల వైద్య సేవ అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పథకానికి పేరు మారినా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే జనానికి వాడుకలో నిలిచిపోయింది. అంతగా పేదలను ప్రభావితం చేసిన ఈ పథకం నేడు పేదలకు అందకుండా పోతోంది. కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్యసేవ పథకం అమలు తీరు వివరాలు కూడా ఆరోగ్యమిత్రల వద్ద సమాచారం లేనంతగా ఈ పథకం నీరుగారిపోయింది. పేద ప్రజల సంజీవనిగా పేరొందిన ఆరోగ్యశ్రీ పథకానికి, నేటి ఎన్టీఆర్ వెద్య సేవ పథకానికి పొంతన లేదని ప్రజలంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తెల్ల రేషన్‌కార్డులు మంజూరు కాక, ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన ఎన్టీఆర్ ఆరోగ్యసేవా కార్యక్రమాలు అందక పేద ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నిధులు తగ్గించటంతో ప్రైవేటు వైద్యశాలలు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయటానికి రోగులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. కొద్దిపాటి ఆపరేషన్లను రిమ్స్‌కు, ప్రభుత్వ వైద్యశాలలకు కేటాయించటంతో రోగులకు అక్కడ సక్రమంగా వైద్యసేవలు అందక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. పక్షవాతం వంటి జబ్బులు వస్తే మంచి వైద్యం కోసం కార్పొరేటు ఆస్పత్రులకు వెళ్లే అవకాశం ఉండటం లేదు. కేవలం ప్రభుత్వ వైద్యశాలలోనే రోగాన్ని నయం చేసుకోవాలని సూచించారు. అయితే ప్రభుత్వాసుపత్రుల్లో న్యూరాలజిస్టులు అందుబాటులో ఉండటం లేదు. ప్రధానంగా 24 గంటల కడుపునొప్పి వస్తే సొంత ఖర్చులతో ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తోంది. అలాగే, కాన్పు సమయంలో ఆపరేషన్లకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు. ఈ పథకాన్ని ఇటీవలే ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు చేసినప్పటికీ కొన్ని కార్పొరేట్ వైద్యశాలలు జబ్బులకు వైద్యం చేసేందుకు ఆసక్తి చూపటం లేదు. వైద్య శిబిరాలు ఎక్కడ... గతంలో ఈ పథకం కింద ప్రతి నెలా మండల కేంద్రం లేదా గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ఈ పథకం కింద ఏవిధంగా వైద్యం చేయించుకోవాలి, ఎవరిని సంప్రదించాలనే విషయాలను ప్రజలకు వివరించేవారు. ఈ శిబిరాలకు ప్రముఖ హాస్పటల్స్‌కి చెందిన వైద్యులు హాజరై ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అవసరమైన వారిని హాస్పిటల్‌కు తరలించే వారు. కానీ ఏడాది కాలంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు లేవు. నాడు... రాజీవ్ ఆరోగ్యశ్రీని దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 జూలై 7న ప్రారంభించారు. తెల్లకార్డు కలిగిన ప్రతి కుటుంబం ఆరోగ్యశ్రీ సేవలకు అర్హులుగా నిర్ణయించారు. ఈ సేవలకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ పథకం కింద గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం, పిత్త కోశం, మూత్ర పిండాలు, పుట్టుకతో వచ్చే అవయవ లోపాలకు శస్త్ర చికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, అన్ని రకాల ప్రమాద గాయాలకు శస్త్ర చికిత్సలు, కనీసం 7 రోజులు వైద్యశాలలో ఉండాల్సిన గాయాలకు చికిత్సలకు, పూర్తిగా చెవుడు ఉన్న ఆరేళ్లలోపు పిల్లలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఆపరేషన్ చేసిన అనంతరం 125 రకాల శస్త్రచికిత్సలకు ఏడాదిపాటూ మందులు వాడితేనే తగ్గుతుంది అని, వీటికి నగదు చెల్లించేవారు. ఆరోగ్య శ్రీ కింద రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలను పేదవారు కార్పొరేట్ వైద్యశాలల్లో పొందే అవకాశం ఉండేది. నేడు.. తెలుగుదేశం ప్రభుత్వం రాకతో ఆరోగ్య శ్రీ అనారోగ్యం బారిన పడింది. గతంలో ఆరోగ్య శ్రీ ఆపరేషన్లు చేయించుకునే రోగులకు ఒక్క రోజులోపు అనుమతి వచ్చేది. ప్రస్తుతం వారం నుండి పది రోజులు కూడా అనుమతులకు సమయం పడుతుంది. దీంతో పేద వారు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనుమతి ఇవ్వకపోతుండటంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ వైద్యశాలలో అత్యవసర శస్త్ర చికిత్సలను దాదాపుగా నిలిపేశారు. గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తున్న 133 రకాల ఆపరేషన్లను ప్రైవేటు వైద్యశాలల నుండి తొలగించి ప్రభుత్వ ఆస్పత్రులలోనే చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ 27న టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చింది. అదే విధంగా పథకంలో మరో వంద జబ్బులకు ఆరోగ్య శ్రీ పరిధిని విస్తరించింది. ఇకపై 1038 జబ్బులకు ఉచిత ఆరోగ్య సేవలు అందుతున్నా, అనుమతులు ఇవ్వడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తున్నారు. -
చేవ తగ్గిన ఎన్టీఆర్ వైద్య సేవ!
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో బతికి బట్టకట్టారు. కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండే నిరుపేదలకు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించారు. ప్రాణాంతక జబ్బులతో మరణమే శరణ్యమనేబెంగ నుంచి ఆరోగ్యశ్రీ ఉందన్న భరోసా కల్పించారు. తెలుగుదేశం పాలన వచ్చాక ఆరోగ్యశ్రీ పేరును ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారు.అయితే కొన్ని కార్పొరేట్ కళాశాలలు ప్రాణాంతక క్యాన్సర్ వంటి జబ్బులకు వైద్యమందించడానికి ముందుకు రావడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభమైన ఎనిమిదేళ్ల క్రితం నాటి సొమ్మునే ప్రభుత్వం ఇప్పటికీ చెల్లిస్తుండడం వల్ల కార్పొరేట్ ఆస్పత్రులు ఏదో వంకతో ససేమిరా అంటున్నాయి. దీంతో బాధిత రోగులు అన్యాయమైపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో అంతగా సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రుల్లోనే రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో పెద్ద ఎముకలు విరిగితేనే తప్ప చిన్న ఎముకలకు శస్త్రచికిత్సకు అర్హత లేదని చెప్పి తిప్పి పంపుతున్నారు. మోకాలి చిప్ప మార్పిడికిఇందులో చేర్చకపోవడం వల్ల చాలామంది నడి వయస్కులు, వయసు మళ్లిన వారు లబ్ది పొందలేకపోతున్నారు. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ తీరుతెన్నులపై ఈ ప్రత్యేక కథనం..! - సాక్షి, విశాఖపట్నం నాటి కుయ్‌కుయ్ సేవలేవీ! తొలుత ఆరోగ్యశ్రీలో 938 జబ్బులను చేర్చారు. వీటిలో 133 జబ్బులు ప్రభుత్వాస్పత్రుల్లోనే విధిగా చేయించుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చాక వ్యాధుల అర్హత సంఖ్య 1040కు పెంచారు. 2008లో ఇచ్చిన వైద్య చార్జీలనే నేటికీ కొనసాగిస్తున్నందున పెంచాలని కార్పొరేట్ ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన సమావేశంలో మంత్రి కామినేని పెంపుదలకు హామీ ఇచ్చారు. ప్రతినెలా ఒకటి నుంచి ఐదో తేదీ వరకు ఒక్కో నెట్వర్క్ ఆస్పత్రికి ఇద్దరు చొప్పున ఐదు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి పదిమంది వైద్యులు రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఓపీ, రక్త పరీక్షలు, ఈసీజీలు చూస్తారు. ఐదు రోజులకు సరిపడిన మందులిస్తారు. వైద్యం అవసరమైన వారికి ఆయా ఆస్పత్రులకు రిఫర్ చేసి చికిత్స చేస్తారు. ఏజెన్సీలో ఐటీడీఏ సూచించిన ప్రాంతాల్లో ప్రతి నెలా ఐదు క్యాంపులు పెడతారు. గిరిజన ప్రాంతంలో సీజనల్ వ్యాధులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులందకపోవడంతో ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో గిరి గ్రామాలకు 104 వెళ్లి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ జరిగేది. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో గిరిజనులు వైద్యం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 104 సిబ్బందికి జీతాలందక, వాహనాలు కండీషన్లో లేకపోవడం, మందులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో వైద్య సేవలు అంతంత మాత్రంగా ఉన్నాయి. దీర్ఘకాలిక రోగులు ప్రయివేటు మెడికల్ స్టోర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కొంత మంది గిరిజనులు మందులు కొనుక్కోలేక వ్యాధి తీవ్రత పెరిగి మృత్యువాత పడుతున్నారు. సకాలంలో సేవలందడం లేదు ఆరోగ్యశ్రీ ఉన్నప్పుడు సకాలంలో వైద్య పరీక్షలు జరిగేది. ఎన్టీఆర్ ఆరోగ్య పథకంలో సకాలంలో వైద్య పరీక్షలు జరగడం లేదు. పది రోజుల క్రితం నా భార్య పాంగి సరస్వతికి తలకు దెబ్బ తగలడంతో స్కేనింగ్ నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య పథకం ద్వారా చికిత్సకు తరలించాను. అయితే సకాలంలో స్కేనింగ్ కాక పోవడంతో ప్రైవేటు ఆసుపత్రికి రూ.2600 ఇచ్చి స్కేనింగ్ చేయించడంతో పాటు మందులు కొనుక్కోవాల్సి వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే రోజు మొత్తం నిరీక్షించాల్సివస్తోంది. దూర ప్రాంతల నుంచి వచ్చే రోగులకు త్వరితగతిన తనిఖీలు నిర్వహిస్తే బాగుంటుంది. - పాంగి భాగ్య, ముంచంగిపుట్టు వసతుల్లేని ప్రభుత్వాస్పత్రులే దిక్కు వైఎస్ హయాంలో రోగులకు జనరల్ సర్జరీ కేసులు నచ్చిన కార్పొరేట్ ఆస్పత్రిలో నిర్భయంగా ఆపరేషన్లు చేయించుకునేవారు. నేడు ప్రభుత్వ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో అరుదుగా వచ్చే జబ్బులకు మాత్రమే ఆపరేషన్లు నిర్వహించే విధంగా కట్టడి చేస్తున్నారు. ఫలితంగా పేద ప్రజలు తప్పనిసరిగా సదుపాయాల్లేని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఉదాహరణకు ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఒక ఒక్క ఆపరేషన్ థియేటర్ ఉంది. ఒక్కొక్క విభాగానికి చెందిన డాక్టర్లకు ఒక్కొక్క రోజు ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆపరేషన్ కోసం వచ్చే రోగులు ఆయా డాక్టర్లకు అవకాశం వచ్చే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కనీసం నాలుగు ఆపరేషన్ థియేటర్లు అవసరం ఉన్నప్పటికీ కేవలం ఒక్క ఆపరేషన థియేటర్తోనే కాలం వెల్లబుచ్చుతున్నారు. దీంతో రోగులు ప్రాధాన్యం ప్రకారం వారాల కొద్దీ ఆపరేషన్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్ చేయించుకునే గ్రామీణ నిరుపేదల కోసం ఆయా గ్రామాలలో ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాలు రెండు నెలలకోసారి నిర్వహించి ఆపరేషన్ అవసరమైన వారికి వ్యాదిని బట్టి ఆస్పత్రులను ఎంపిక చేసి ఆయా ఆస్పత్రులకు ఎటువంటి పత్రాలు లేకుండా పంపించేవారు. నేడు కనీసం తూతూ మంత్రంగానైనా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించకపోవడం కొసమెరుపు. సేవలు అంతంతమాత్రమే ఎన్టీఆర్ వైద్యసేవ వార్డులో 20 రోజుల క్రితం కుడి కాలుకు ఆపరేషన్ చేయించుకున్నాను. డ్యూటీ డాక్టర్ రోజుకోసారి వస్తారు. సంబంధిత డాక్టర్ రెండుమూడు రోజులకోసారి వస్తారు. భోజనాలు, ఇతర సదుపాయాలు అంతంత మాత్రమే. సిబ్బంది పర్యవేక్షణ అంతంతమాత్రమే. - దొమ్మేసి ఈశ్వరరావు (45), ప్రతి నెలా మందులకు రూ.వెయ్యి ఖర్చు 2007లో నాకు ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ జరిగింది. నిరుపేద కుటుంబం కావడంతో ఉచితంగా ఆపరేషన్ చేసినా రోజూ మందులు వాడాలి. ప్రస్తుతం మందులు కొనుగోలు చేసుకొనే స్థోమత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాను. ప్రతి నెలా రూ. 700 నుంచి 1000 వరకు ఖర్చవుతుందని తల్లిదండ్రులు చెపుతున్నారు. - అయ్యంకుల లోవ ఆరోగ్యశ్రీతోనే లబ్ధి దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఆరోగ్య శ్రీ ద్వారా ప్రజలు లబ్ది పొందారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ వైద్య సేవలు మచ్చుకైనా కానరావడం లేదు. - మన్యాల మాధవి కార్పొరేట్ హాస్పటల్ వైద్యం కలే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేది. ఆరోగ్యశ్రీతో పేదలకు చక్కటి వైద్యం అందేది. ఇప్పుడు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. -వియ్యపు దేవకి, కుమ్మరవీధి కొన్ని సేవలను తొలగించారు ఆరోగ్య శ్రీ పథకంలో చాలా సేవలు అందుబాటులో ఉండేవి. ఎన్టీఆర్ వైద్య సేవలో చాలా సేవలు తొలగించారు. దీంతో పేదలకు వైద్య సేవలు అందుబాటులో లేక పోవడంతో పేదలు అవస్థలు పడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఒరిగిందేమీ లేదు. - తిరపతి తాయార మ్మ, అమ్మవారివీధి ఖర్చెక్కువైతే సేవలు కష్టమే నర్సీపట్నం : రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్పు చేసిన ప్రభుత్వం సేవలను కుదించింది. ఆరోగ్యశ్రీ ద్వారా 932 వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం ఆందించేవారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 1040 వ్యాధులకు వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా...వీటిలో 133 వ్యాధులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. వైద్యుల కొరత, అపరేషన్‌కు అవసరమయ్యే పరికరాలు లేక 133 రకాల వ్యాధులకు ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు సక్రమంగా అంద డం లేదు. రూ.50 వేల లోపు ఖర్చయ్యే వ్యాధులను ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, రూ, లక్ష నుంచి రూ.2 లక్షలు ఖర్చయ్యే వ్యాధులకు మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని అందిస్తున్నారు. 125 రకాల వ్యాధులకు మాత్రమే ఫాలోఅప్ ఉంటోంది. ప్రజలను నిత్యం వేధించే వ్యాధులను ప్రత్యేకం చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యం చేయించుకున్నాక వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
ఏవీ నాటి కుయ్ కుయ్‌లు...
ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫోన్ చేయగానే క్షణాల్లో ప్రత్యక్షమయ్యే 108 కుయ్ కుయ్‌లు ఇపుడెక్కడా వినిపించడం లేదు...గ్రామాల్లో వైద్యపరీక్షలు నిర్వహిస్తూ గర్భిణుల బాగోగులు చూసే 104 సేవలూ ఇపుడు మూలకు చేరాయి. కొన్ని వాహనాలు రిపేరుతో మూలకు చేరగా ఉన్న వాహనాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇక సిబ్బంది కూడా అవసరాలకు తగిన సంఖ్యలో లేకపోవడంతో మారు మూల గ్రామాలకు సేవలందడం లేదు. మాతా శిశు మరణాలు పెరిగాయి. ఇక సౌకర్యాల లేమి, పథకంలో స్పష్టత కొరవడడంతో ఎన్టీఆర్ వైద్యసేవ పేదలకు ఉపయోగపడడం లేదు. దీంతో మొత్తంగా ప్రజారోగ్యంపై చీకటి కమ్ముకుంది. - చతికిల పడ్డ 108, 104 - అక్కరకు రాని ఎన్టీఆర్ వైద్యసేవ - ఆరోగ్యశ్రీ వార్డుల్లో కనీస వసతులు కరువు - అందుబాటులో ఉండని వైద్యులు - ఆందోళనకరంగా మాతా శిశు మరణాలు ఒకప్పుడు ఫోన్ చేసిన 20 నిమిషాలకే కుయ్..కుయ్ అంటూ వచ్చే 108 వాహనాలు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ వారికి అవసరమైన మందులను అందజేస్తూ, ముఖ్యంగా గర్భిణుల బాగోగులు చూసుకునే 104 వాహనాలు ఎక్కడున్నాయో తెలియడం లేదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలును ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా పేరు మార్చినా నిరుపేదలకు అక్కరకు రావడం లేదు. మరోవైపు జిల్లాలో మాతా శిశుమరణాల సంఖ్య ఊహించని రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలకులు, అధికారులు సమీక్షలు..సమావేశాలకే పరిమితమవుతున్నారు. ఫలితంగా ప్రజారోగ్యం పడకేసింది. సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో 85 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 584 సబ్‌సెంటర్లు, 15 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రీషియన్ క్లష్టర్స్, 13 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 35 రౌండ్ ది క్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 7 టీచింగ్ హాస్పటల్స్ ఉన్నాయి. కానీ 108 వాహనాలు మాత్రం కేవలం 41 మాత్రమే ఉన్నాయి. వీటిలో కొన్ని ఎప్పుడూ రిపేరులోనే ఉంటాయి. 390 మంది సిబ్బంది ఏ మూలకూ సరిపోవడం లేదు. అనకాపల్లి, నర్శీపట్నం, పాడేరు, చోడవరం ప్రాంతాల్లో రిఫరల్ కేసులు ఎక్కువగా ఉంటాయి. వాటికి సరిపడా 108 వాహనాలు ఉండడం లేదు. నిర్ణీత సమయానికి ఎక్కడా వాహనాలు రావడం లేదు. ఫలితంగా సకాలంలో వైద్యం అందక రోగులు మృత్యువాత పడుతున్నారు. వాహనాలు పెంచాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిజానికి 108లో ఉండాల్సిన అత్యవసర వైద్య పరికరాలు కూడా లేవు. రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించే యంత్రం, విషాన్ని కక్కించే యంత్రాలు అందుబాటులో లేవని 108 జిల్లా కో ఆర్డినేటర్ కె.ఉమామహేశ్వరరెడ్డి ధ్రువీకరించారు. ఆరోగ్య ప్రదాయనికి ఎంత కష్టం వైద్య సదుపాయాలకు ఆమడ దూరంలో ఉండే ఏజెన్సీ, గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యవర వైద్య సేవలు అందించేందుకు ప్రారంభించిన 104 సేవలు జిల్లాలో నామమాత్రంగా నడుస్తున్నాయి. మొత్తం 95 మంది సిబ్బందితో 20 వాహనాలు ఉంటే వాటిలో కోటవురట్ల, పాడేరు, ముంచింగ్‌పుట్టులో మరమ్మతులకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం 17 వాహనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా 2008 నుంచి సేవలు ఉండటంతో శిధిలావస్థకు చేరుకున్నాయని 104 జిల్లా కో ఆర్డినేటర్, డిప్యూటీ డిఎంహెచ్ఓ సూర్యనారాయణ చెబుతున్నారు. ఆందోళనకరంగా మాతా శిశుమరణాలు జిల్లాలో 108, 104 సేవలు పడకేయడంతో మాతా, శిశు మరణాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 692 మంది శిశువులు, 60మంది తల్లులు ప్రాణాలు కోల్పోయారు. 2014-15లో ఇప్పటి వరకూ దాదాపు 1100 మంది శిశువులు, 130 మంది మాతృమూర్తులు చనిపోయారు. ప్రసవానికి వారం ముందే వైద్యుల సంరక్షణలో ఉండేలా పాడేరు డివిజన్లో 4 బర్త్ వెయిటింగ్ హోమ్‌లు నెలకొల్పారు. కానీ అక్కడకు ఎవరూ వెళ్లడం లేదు. సెకండ్ ఏఎన్ఎంలు కూడా 409 మంది మాత్రమే ఉన్నారు. 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మారిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు జిల్లాలో పేదలకు అందని ద్రాక్షలా మారాయి. 1034 రకాల పెద్ద పెద్ద జబ్బులు సైతం పైసా ఖర్చు లేకుండా తగ్గించుకునే అవకాశం ఉన్నప్పటికీ పథకంలో స్పష్టత లేకపోవడంలో వైద్యం అందడం లేదు. జిల్లాలో 8 ప్రభుత్వ, 24 ప్రైవేట్ కలిపి మొత్తం 32 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులున్నాయి. ప్రతి హాస్పటల్లోనూ ఓ ఆరోగ్యమిత్రతో పాటు జిల్లాలో ఐదుగురు డివిజన్ టీంలీడర్లు, ఐదుగురు నెట్వర్క్ టీంలీడర్లు, ఓ మేనేజర్ ఆపైన కో ఆర్డినేటర్ ఉన్నారు. కానీ చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేవు. ఇటీవల తనిఖీలు చేసిన ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ పాత్రుని మనోజ్ ఈ విషయాన్ని గుర్తించారు. 21 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. తాను వెళ్లినపుడు ఆరోగ్యశ్రీ వైద్యులు కనిపించలేదని ఆయనే అంటున్నారు. అలాంటిది సామాన్యులకు అందుబాటులో ఎక్కడుంటారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వార్డులు కూడా ఉండడం లేదు. సకాలంలో సర్జరీ చేయట్లేదు. అసలు ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లండని కార్పొరేట్ ఆస్పత్రులు కొన్ని రోగులను గెంటేస్తున్నాయి. -
కోమాలో ఆరోగ్య పథకాలు
ప్రమాదం జరిగితే.. మూడక్షరాల పదం డయల్ చేస్తే చాలు అంబులెన్సు ప్రత్యక్షమయ్యేది. ప్రాణదీపాలు ఆరిపోకుండా ఆదుకునేది. అదే 108 వాహనం. ఇప్పుడు ఫోన్ చేస్తే రాదు.. వచ్చినా గంటన్నర పడుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో 104 వాహనం సంచరించేది. వ్యాధిగ్రస్తులకు చక్కని మందులు అందించేది. ఇప్పుడీ వాహనం గ్రామాల్లో కనిపించడం అరుదైపోయింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేది. అదే ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవగా రూపాంతరం చెందింది. ప్రభుత్వాస్పత్రుల్లో అసౌకర్యాల వల్ల పేదలకు వైద్యం అందడం గగనమైంది. పేదల పాలిట ఆపద్బాంధవుడిలాంటి 104, 108 అంబులెన్సులు, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమిది. విజయనగరం ఆరోగ్యం: ఒకప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడితే చాలు.. ఫోన్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లో 108 వాహనం వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేసిన గంటన్నర వరకు రావడం లేదు. పైగా సవాలక్ష ప్రశ్నలు వేస్తూ 108 అధికారులు రోగులను విసిగిస్తున్నారు. జిల్లాలోని 24 వాహనాల్లో సగానికి పైగా శిథిలమయ్యాయి. వాహనాల్లో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవు. పురుగు మందు, గుళికలు వంటి విష పదార్థాలు తీసుకున్న రోగుల కడుపు శుభ్రపరిచే సెక్షన్ ఆపరేటర్స్ ఒకటి రెండు వాహనాల్లోనే ఉన్నాయి. పల్స్‌రేటు చూసే సదుపాయం ఏ వాహనంలోనూ లేదు. రోగులను బెడ్‌పైకి తరలించే స్టెచ్చర్స్ అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఇవి పాడవడం వల్ల నడవలేని రోగులను ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఎత్తుకుని వాహనంలోకి ఎక్కించాల్సి వస్తోంది. నిలువ నీడ లేని వాహనాలు 108, 104 వాహనాలకు షెడ్లు నిర్మిస్తామని అధికారులు చెప్పడం తప్ప నిర్మించిన దాఖలాల్లేవు. జిల్లాలో 104 వాహనాలు 17 ఉన్నాయి. గతంలో ఇవి గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇద్దరు ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఏఎన్ఎం మాత్రమే హాజరవుతుంది. ఈ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. గ్రామాలకు ఉదయం 7 గంటల్లోగా వెళ్లాల్సిన 104 వాహనాలు ఉదయం 11 గంటల వరకు వెళ్లడం లేదు. పూర్తిస్థాయిలో అందని వైద్యసేవలు ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కొరత వల్ల రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. జిల్లాలో కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషాస్పత్రి, ఎస్.కోట ఆస్పత్రి, తిరుమల ఆస్పత్రి, సాయి ఆస్పత్రి, ఆంధ్ర చిల్డ్రన్ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమల్లో ఉంది. ప్రయివేటు ఆస్పత్రులను మినహాయిస్తే, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు గగనమయ్యాయి. వైద్య రంగంలో ఆధునాతన పరికరాలు వచ్చినా, ఇంకా పాత పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. జనరల్ సర్జరీ విభాగంలో లాప్రోస్కోప్, ఎంఆర్ స్కాన్ పరికరాల్లేవు. గైనిక్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు బయాప్సీ, థైరాయిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించే వెసులుబాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేదు. దీంతో ప్రయివేటు ల్యాబ్రేటరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుల తరబడి రోగులకు శస్త్రచికిత్సలు చేయకుండా ఉంచేస్తున్నారు. ఏడాదిన్నరగా అందని మందులు గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన వృద్ధురాలు దేవుడమ్మకు రక్తపోటు ఉంది. ఆరు నెలల పాటు 104 సిబ్బంది మందులిచ్చారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉండటంతో ప్రస్తుతం ఇవ్వడం మానేశారు. దీంతో ప్రతి నెల ఆమె మందులు కొనుగోలు చేస్తోంది. వాహన సదుపాయం కల్పించాలి తెర్లాం మండలానికి 108 వాహనం లేకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవ సమయంలో 108 వాహనం లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు, పాలకులు స్పందించాలి. బి.సుధాకర్, తెర్లాం