ప్రమాదం జరిగితే.. మూడక్షరాల పదం డయల్ చేస్తే చాలు అంబులెన్సు ప్రత్యక్షమయ్యేది. ప్రాణదీపాలు ఆరిపోకుండా ఆదుకునేది. అదే 108 వాహనం. ఇప్పుడు ఫోన్ చేస్తే రాదు.. వచ్చినా గంటన్నర పడుతుంది. ఒకప్పుడు గ్రామాల్లో 104 వాహనం సంచరించేది. వ్యాధిగ్రస్తులకు చక్కని మందులు అందించేది. ఇప్పుడీ వాహనం గ్రామాల్లో కనిపించడం అరుదైపోయింది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించేది. అదే ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవగా రూపాంతరం చెందింది. ప్రభుత్వాస్పత్రుల్లో అసౌకర్యాల వల్ల పేదలకు వైద్యం అందడం గగనమైంది. పేదల పాలిట ఆపద్బాంధవుడిలాంటి 104, 108 అంబులెన్సులు, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమిది.
విజయనగరం ఆరోగ్యం: ఒకప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడితే చాలు.. ఫోన్ చేసిన 15 నుంచి 20 నిమిషాల్లో 108 వాహనం వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేసిన గంటన్నర వరకు రావడం లేదు. పైగా సవాలక్ష ప్రశ్నలు వేస్తూ 108 అధికారులు రోగులను విసిగిస్తున్నారు. జిల్లాలోని 24 వాహనాల్లో సగానికి పైగా శిథిలమయ్యాయి. వాహనాల్లో రోగులకు చికిత్స అందించే పరికరాలు లేవు. పురుగు మందు, గుళికలు వంటి విష పదార్థాలు తీసుకున్న రోగుల కడుపు శుభ్రపరిచే సెక్షన్ ఆపరేటర్స్ ఒకటి రెండు వాహనాల్లోనే ఉన్నాయి. పల్స్‌రేటు చూసే సదుపాయం ఏ వాహనంలోనూ లేదు. రోగులను బెడ్‌పైకి తరలించే స్టెచ్చర్స్ అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఇవి పాడవడం వల్ల నడవలేని రోగులను ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఎత్తుకుని వాహనంలోకి ఎక్కించాల్సి వస్తోంది.
నిలువ నీడ లేని వాహనాలు
108, 104 వాహనాలకు షెడ్లు నిర్మిస్తామని అధికారులు చెప్పడం తప్ప నిర్మించిన దాఖలాల్లేవు. జిల్లాలో 104 వాహనాలు 17 ఉన్నాయి. గతంలో ఇవి గ్రామాలకు వెళ్లేటప్పుడు ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఫార్మసిస్టులు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఏఎన్‌ఎం మాత్రమే హాజరవుతుంది. ఈ సిబ్బందికి జీతాలు సకాలంలో ఇవ్వడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. గ్రామాలకు ఉదయం 7 గంటల్లోగా వెళ్లాల్సిన 104 వాహనాలు ఉదయం 11 గంటల వరకు వెళ్లడం లేదు.
పూర్తిస్థాయిలో అందని వైద్యసేవలు
ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కొరత వల్ల రోగులకు ఎన్టీఆర్ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. జిల్లాలో కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషాస్పత్రి, ఎస్.కోట ఆస్పత్రి, తిరుమల ఆస్పత్రి, సాయి ఆస్పత్రి, ఆంధ్ర చిల్డ్రన్ ఆస్పత్రి, వెంకటపద్మ ఆస్పత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం అమల్లో ఉంది. ప్రయివేటు ఆస్పత్రులను మినహాయిస్తే, ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు గగనమయ్యాయి. వైద్య రంగంలో ఆధునాతన పరికరాలు వచ్చినా, ఇంకా పాత పద్ధతిలోనే శస్త్రచికిత్సలు చేస్తున్నారు. జనరల్ సర్జరీ విభాగంలో లాప్రోస్కోప్, ఎంఆర్ స్కాన్ పరికరాల్లేవు. గైనిక్ సంబంధిత వ్యాధిగ్రస్తులకు బయాప్సీ, థైరాయిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించే వెసులుబాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లేదు. దీంతో ప్రయివేటు ల్యాబ్‌రేటరీలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోజుల తరబడి రోగులకు శస్త్రచికిత్సలు చేయకుండా ఉంచేస్తున్నారు.
ఏడాదిన్నరగా అందని మందులు
గంట్యాడ మండలం పెదవేమలికి చెందిన వృద్ధురాలు దేవుడమ్మకు రక్తపోటు ఉంది. ఆరు నెలల పాటు 104 సిబ్బంది మందులిచ్చారు. ఆమె నడవలేని పరిస్థితిలో ఉండటంతో ప్రస్తుతం ఇవ్వడం మానేశారు. దీంతో ప్రతి నెల ఆమె మందులు కొనుగోలు చేస్తోంది.
వాహన సదుపాయం కల్పించాలి
తెర్లాం మండలానికి 108 వాహనం లేకపోవడంతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు ప్రసవ సమయంలో 108 వాహనం లేకపోవడంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. అధికారులు, పాలకులు స్పందించాలి. బి.సుధాకర్, తెర్లాం
కోమాలో ఆరోగ్య పథకాలు
Published Fri, Jun 5 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement
Advertisement