తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని తాము న్యూట్రిషన్ అందిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పార్టిషన్ పాలిటిక్స్ (విభజన రాజకీయాలు) చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ హిట్ అయితే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు.
సాక్షి, కామారెడ్డి: ‘‘అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి,, అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా తల్లీబిడ్డల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలా సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన మరో పథకమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం’’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం కొత్తగా తీసుకువచ్చిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు బుధవారం కామారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాతోపాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో గర్భిణులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను బాగా తగ్గించగలిగామని, మరింత ప్రయోజనం కలిగించేలా న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు.
రెండు సార్లు కిట్..
ఈ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, మూడు ఐర¯న్ సిరప్‌లు, అర కిలో నెయ్యి, అల్బెండోజల్ మాత్రలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.2 వేల విలువైన కిట్‌ను రెండు సార్లు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులకు అందించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో
ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ క్రమంలో వచ్చే ఏడాది కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభిస్తామని ప్రకటించారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జెడ్పీ చైర్‌పర్సన్ డి.శోభ తదితరులు పాల్గొన్నారు.
వర్చువల్‌గా ఎనిమిది జిల్లాల్లో ప్రారంభం
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కామారెడ్డిలో నేరుగా, మిగతా ఎనిమిది జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభించారు. వికారాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు లో మంత్రి సత్యవతి రాథోడ్, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి, కొము రంభీం ఆసిఫాబాద్‌లో విప్ బాల్క సుమన్, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతుండగా హరీశ్‌రావు కల్పించుకుని.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మెచ్చుకున్నారా, లేదా అని అడిగారు. మెచ్చు కున్నారంటూ ఎర్రబెల్లి సమాధానమివ్వగా.. శ్రీధర్‌బాబు మైక్ అందుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు.
చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు
Comments
Please login to add a commentAdd a comment