kamareddy hospital
-
మావి న్యూట్రిషన్ పాలిటిక్స్.. వాళ్లవి పార్టిషన్ పాలిటిక్స్
తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని తాము న్యూట్రిషన్ అందిస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పార్టిషన్ పాలిటిక్స్ (విభజన రాజకీయాలు) చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ కిట్ హిట్ అయితే.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ సూపర్ హిట్ అవుతుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. సాక్షి, కామారెడ్డి: ‘‘అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం ఎన్నో పథకాలకు రూపకల్పన చేసి,, అమల్లోకి తెచ్చారు. ముఖ్యంగా తల్లీబిడ్డల సంరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. అలా సీఎం కేసీఆర్ ఆలోచనల్లో నుంచి పుట్టిన మరో పథకమే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం’’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల కోసం కొత్తగా తీసుకువచ్చిన ‘కేసీఆర్ న్యూట్రిషన్ కిట్’ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు బుధవారం కామారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. కామారెడ్డి జిల్లాతోపాటు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో గర్భిణులు రక్తహీనత సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని తెచ్చిందని హరీశ్‌రావు చెప్పారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలను బాగా తగ్గించగలిగామని, మరింత ప్రయోజనం కలిగించేలా న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమల్లోకి తెచ్చామని చెప్పారు. రెండు సార్లు కిట్.. ఈ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో ఖర్జూరం, మూడు ఐర¯న్ సిరప్లు, అర కిలో నెయ్యి, అల్బెండోజల్ మాత్రలు ఉంటాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రూ.2 వేల విలువైన కిట్‌ను రెండు సార్లు అందజేస్తామని చెప్పారు. ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లోని 231 ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణులకు అందించనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని, ఈ క్రమంలో వచ్చే ఏడాది కామారెడ్డిలో వైద్య కళాశాల ప్రారంభిస్తామని ప్రకటించారు. కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జెడ్పీ చైర్పర్సన్ డి.శోభ తదితరులు పాల్గొన్నారు. వర్చువల్‌గా ఎనిమిది జిల్లాల్లో ప్రారంభం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని కామారెడ్డిలో నేరుగా, మిగతా ఎనిమిది జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభించారు. వికారాబాద్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ములుగు లో మంత్రి సత్యవతి రాథోడ్, నాగర్‌కర్నూల్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గద్వాల్లో మంత్రి నిరంజన్‌రెడ్డి, కొము రంభీం ఆసిఫాబాద్‌లో విప్ బాల్క సుమన్, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాలపల్లి నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతుండగా హరీశ్‌రావు కల్పించుకుని.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ను ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మెచ్చుకున్నారా, లేదా అని అడిగారు. మెచ్చు కున్నారంటూ ఎర్రబెల్లి సమాధానమివ్వగా.. శ్రీధర్‌బాబు మైక్ అందుకుని మాట్లాడే ప్రయత్నం చేశారు. చదవండి: నాడు టీడీపీలో.. నేడు కాంగ్రెస్‌లో.. చంద్రబాబుతో మాకు సంబంధం లేదు -
విద్యార్థినికి పురుగుల మందు తాగించారు..
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మచారెడ్డి మండలం చుక్కాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ...ఇంటర్ విద్యార్థినికి బలవంతంగా పురుగుల మందు తాగించారు. దాంతో విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురికాగా, ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమ్మ వదిలేసింది.. నర్సులు అమ్మేశారు!
కామారెడ్డిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఘటన ఇందూరు: ఆడపిల్ల భారమనుకుందో ఏమో కానీ ఓ తల్లి పుట్టినబిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లింది... పాపను రక్షించాల్సిన నర్సులు ఆ బిడ్డను అమ్మేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు... సుమారు నెలన్నర క్రితం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి మహిళ ప్రసవం కోసం వచ్చింది. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వారం రోజులు ఆస్పత్రిలోనే ఉన్న ఆ తల్లి, కుటుంబ సభ్యులు ఎందుకో ఆ బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. గమనించిన నర్సులు కుటుంబసభ్యుల వివరాలు రిజస్టర్‌లో ఉన్నప్పటికీ.. ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే పాపను అమ్మాలని నిర్ణరుుంచారు. జిల్లాలోని లింగంపేట్ మండలం భావానీపేట్కు చెందిన ఓ దంపతులు పిల్లలు లేక.. దత్తత తీసుకునేందుకు చూస్తున్నారని తెలుసుకొని వారిని సంప్రదించారు. రూ.10 వేలకు బేరం కుదుర్చుకుని పాపను అమ్మేశారు. అయితే.. పాపను తీసుకెళ్లిన దంపతుల గ్రామానికి చెందిన స్థానికులు అనుమానం వచ్చి ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించగా, వారు వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బయట పడింది. దీంతో పాపను శనివారం జిల్లా కేంద్రంలోని శిశుగృహకు తరలించారు. పాపను అమ్మేసిన నర్సులు, అక్రమంగా దత్తత తీసుకున్న దంపతులతో పాటు ఆస్పత్రి యూజమాన్యం పైనా కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. -
తాంతియా హల్చల్
కామారెడ్డి, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. అధికారుల పనితీరును ఎండగట్టారు. ముందుగా ఆమె మున్సిప ల్ కార్యాలయాన్ని సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరుకు సంబంధించిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాధాలు తదితర విషయాలను తెలుసుకున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై ప్రశ్నించారు. చట్టంపై అధికారులకే అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో.. కమిషనర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వార్డులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులు తమ వెంట తెచ్చుకున్న బెడ్షీట్లే కనిపించడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు బెడ్షీట్లు ఇవ్వడం లేదా అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. గతంలో వచ్చిన బెడ్షీట్లు మాత్రమే ఉన్నాయని, వాటిని ఉతకడానికి పంపామని సూపరింటెండెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. వంద పడకల ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తున్నా.. కనీసం బెడ్షీట్లు సమకూర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద పడకల ఆస్పత్రిలో అందుకు రెట్టింపు సంఖ్యలో బెడ్షీట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత ఉద్యోగి యాదగిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 కాలమ్స్ ఉండే రిజిస్టర్లను వాడాలని సూచించారు. ఆస్పత్రిలో కనీసం సిటిజన్ చార్టర్ లేకపోవడం శోచనీయమన్నారు. వచ్చే నెలలో మళ్లీ కామారెడ్డికి వస్తానని, అప్పటి వరకు రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైద్యునిపై ఆగ్రహం ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న సమయంలో తనకు కరెంటు షాక్‌తో రెండు చేతులు పోయాయని, తనకు సర్టిఫికెట్టు కావాలని వస్తే ఇవ్వడం లేదని శాబ్దిపూర్ తండాకు చెందిన పంతులు నాయక్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న వైద్యుడు సుధీర్.. ‘నీ ప్రాణాలు నిలిపిన నాపైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ కోపానికి వచ్చారు. దీంతో కమిషనర్ తాంతియాకుమారి సదరు వైద్యునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు చేతులు కోల్పోయిన వ్యక్తి సర్టిఫికెట్ కోసం వస్తే నా ముందే దూషిస్తావా’ అంటూ పది నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారు. రోగి విషయంలో సానుభూతితో వ్యవహరించి, సేవలందించాలని సూచించారు. కమిషనర్ వెంట డీపీఆర్ఓ ఘనీ, కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సుదర్శన్, ఎంపీడీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, సీఐలు దరావత్ కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, ప్రొబెషనర్ డీఎస్పీ రమణారెడ్డి, ఎస్ఐ సాయన్నయాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ శశికళ, పంచాయతీరాజ్ ఈఈ సునీత తదితరులున్నారు. కార్యాలయాల ప్రారంభం సమాచారహక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యానగర్, అజంపురాలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను కమిషనర్ ప్రారంభించారు. పట్టణంలోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి కామారెడ్డిలో బస చేశారు. శనివారం గాంధారి మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ సభ్యులు ఎంఏ సలీం, ఎంఏ హమీద్, నారాయణ, రవీందర్, విఠల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్యాంగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేమైనా సీ గ్రేడ్ ఆస్పత్రా?
బోధన్ టౌన్, న్యున్లైన్ : రిజిష్టర్లలో రోగుల పేర్లు నమోదు చేయడం లేదు. ఏ మందులు ఇస్తున్నారో పేర్కొనడం లేదు. ఇదేమైనా సీ గ్రేడ్ ఆస్పత్రా అంటూ బోధన్ ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ స్వర్ణ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు సరిగా నిర్వహించాలని సూచించారు. జీతాలపైనే కాకుండా సేవలందించడంపైనా దృష్టి సారించాలంటూ మందలించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏ గ్రేడ్ ఆస్పత్రిని సీ గ్రేడ్‌గా మార్చేస్తామని హెచ్చరించారు. స్వర్ణ నాగార్జున శుక్రవారం బోధన్ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి పాలన, మందుల పంపిణీ సరి గాలేకపోవడం, సానిటేషన్ లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాబ్‌లో రోగులకు చేసిన పరీక్షల వివరాలు లేకపోవడంతో టెక్నీషియన్‌పై మండిపడ్డారు. అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉందని ఆమె దృష్టి కి తీసుకురాగా త్వరలో భర్తీ చేస్తామన్నారు. అనంతరం మందుల పంపి ణీ విభాగానికి వెళ్లారు. మందుల పంపిణీ వివరాలను ఐదు నెలలుగా నమోదు చేయకపోవడంతో ఫార్మాసిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటినుంచైనా రిజిష్టర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆస్పత్రిలో పారిశుధ్యలోపంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. సానిటేషన్ కాంట్రాక్టర్‌కు బడ్జెట్లో 30 శాతం కోత విధించి బిల్లు చెల్లించాలని డీసీహెచ్ఎస్ బాలకిషన్, ఇన్చార్జి సూపరింటెండెంట్ శివదాస్లను ఆదేశించారు. రోగికి అందించే చికిత్స, ఇచ్చే మందుల వివరాలను ప్రతినెల ఉన్నతాధికారులకు పంపితే దానిని బట్టి నిధులు మంజూరు చేస్తారని, రికార్డులు సరిగా నిర్వహించకపోతే నిధులు తక్కువగా వస్తాయని హెచ్చరించారు. ఆర్ఎమ్ఓ పోస్టును త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ఆరోగ్యశ్రీ వార్డులో రెండు ఏసీలు అమర్చాలని, పేషంట్‌కు ఇచ్చే చికిత్సతో పాటు రోగి వ్యాధి కేస్ షీట్‌ను మెయిన్‌టెయిన్ చేయాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. ఆమె వెంట వైద్య విధాన పరిషత్ డిప్యూటీ కమిషనర్ రామ్‌నాయక్ ఉన్నారు. సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. దేవునిపల్లి : రోగులకు సేవలందించడంలో నిర్లక్ష్యం పనికిరాదని వైద్య విధాన పరిషత్ కమిషనర్ స్వర్ణ నాగార్జున పేర్కొన్నారు. ఆమె శుక్రవారం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. ఇన్ పేషంట్స్ వార్డులో పర్యటించి రోగులకు అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ చాంబర్లో వైద్యులతో సమావేశమయ్యారు. ఇన్‌పేషంట్స్‌కు అందిస్తున్న భోజనం విషయమై ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌష్టికాహారం అందించాలని సూచించారు. జేఎస్వై, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చే యించుకున్న మహిళలకు డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంపై మండిపడ్డారు. ఆస్పత్రిలో నీటి సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి సారించాలని సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌కు సూచించారు. ట్రామా కేర్ సెంటర్‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగులు లేక చాల ఇబ్బందులు పడుతున్నామని నర్సులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. కాంట్రాక్టర్ నుంచి తమకు జీతాలు ఇప్పించాలని సానిటేషన్ సిబ్బంది వేడుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఆమె వెంట డిప్యూటీ కమిషనర్ లోకనాయక్, ఆర్ఏంవో రమణాదేవి, వైద్యులు శ్రీనివాస్, విజయలక్ష్మి, ఉషారాణి, ఫార్మసిస్టు సంతోష్, యూడీసీ యాదగిరి తదితరులున్నారు.