కామారెడ్డి, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. అధికారుల పనితీరును ఎండగట్టారు. ముందుగా ఆమె మున్సిప ల్ కార్యాలయాన్ని సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరుకు సంబంధించిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాధాలు తదితర విషయాలను తెలుసుకున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై ప్రశ్నించారు. చట్టంపై అధికారులకే అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో..
కమిషనర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వార్డులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులు తమ వెంట తెచ్చుకున్న బెడ్‌షీట్లే కనిపించడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు బెడ్‌షీట్లు ఇవ్వడం లేదా అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. గతంలో వచ్చిన బెడ్‌షీట్లు మాత్రమే ఉన్నాయని, వాటిని ఉతకడానికి పంపామని సూపరింటెండెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. వంద పడకల ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తున్నా.. కనీసం బెడ్‌షీట్లు సమకూర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద పడకల ఆస్పత్రిలో అందుకు రెట్టింపు సంఖ్యలో బెడ్‌షీట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్‌ల నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత ఉద్యోగి యాదగిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 కాలమ్స్ ఉండే రిజిస్టర్లను వాడాలని సూచించారు. ఆస్పత్రిలో కనీసం సిటిజన్ చార్టర్ లేకపోవడం శోచనీయమన్నారు. వచ్చే నెలలో మళ్లీ కామారెడ్డికి వస్తానని, అప్పటి వరకు రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.
వైద్యునిపై ఆగ్రహం
ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న సమయంలో తనకు కరెంటు షాక్‌తో రెండు చేతులు పోయాయని, తనకు సర్టిఫికెట్టు కావాలని వస్తే ఇవ్వడం లేదని శాబ్దిపూర్ తండాకు చెందిన పంతులు నాయక్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న వైద్యుడు సుధీర్.. ‘నీ ప్రాణాలు నిలిపిన నాపైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ కోపానికి వచ్చారు. దీంతో కమిషనర్ తాంతియాకుమారి సదరు వైద్యునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు చేతులు కోల్పోయిన వ్యక్తి సర్టిఫికెట్ కోసం వస్తే నా ముందే దూషిస్తావా’ అంటూ పది నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారు. రోగి విషయంలో సానుభూతితో వ్యవహరించి, సేవలందించాలని సూచించారు.
కమిషనర్ వెంట డీపీఆర్‌ఓ ఘనీ, కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సుదర్శన్, ఎంపీడీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, సీఐలు దరావత్ కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, ప్రొబెషనర్ డీఎస్‌పీ రమణారెడ్డి, ఎస్‌ఐ సాయన్నయాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ శశికళ, పంచాయతీరాజ్ ఈఈ సునీత తదితరులున్నారు.
కార్యాలయాల ప్రారంభం
సమాచారహక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యానగర్, అజంపురాలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను కమిషనర్ ప్రారంభించారు. పట్టణంలోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి కామారెడ్డిలో బస చేశారు. శనివారం గాంధారి మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ సభ్యులు ఎంఏ సలీం, ఎంఏ హమీద్, నారాయణ, రవీందర్, విఠల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్యాంగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తాంతియా హల్‌చల్
Published Sat, Jan 18 2014 5:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement