Tantia Kumari
-
అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే
రాష్ట్ర ఆర్టీఐ కమిషన్ తాంతియా కుమారి వెల్లడి తిరుపతి కార్పొరేషన్ : సమాచార హక్కు చట్టం కింద ఆయా సంస్థలు సమాచారం ఇవ్వాల్సిందేనని అలా కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ లామ్ తాంతియా కుమారి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్ఆ ర్ సమావేశ మందిరంలో బుధవారం ఆర్టీఐ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆమె విచారించారు. పీలేరుకు చెందిన అడ్వకేట్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అర్బన్, అక్కారంపల్లెలో సెటిల్మెంట్ అర్డర్లపై సమాచారం అడిగితే రెండేళ్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి డీఆర్వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ తమవద్ద ఆ వివరాలు లేవని ఎండార్స్మెంట్ ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఎండార్స్మెంట్ అంటే సమాచారం కాదు, అలా అని చేతులు దులుపుకుంటే సరికాదని కమిషనర్ సున్నితంగా హితవు పలికారు. ‘‘మీరు సరైన సమయంలో సమాచారం ఇస్తే మా వద్దకు రారుకదా, వారంలోగా సమాచారం ఇవ్వండి’’ అంటూ ఆదేశించారు. ద్రవిడవర్సిటీకి సంబంధించి కేసులు ఎక్కువగా ఉన్నా అప్లైంట్లు హాజరు కాకపోవడంపై రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పరీక్షలకు హాజరు కాకపోతే ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా అనుమతిస్తారు. ఒకవేళ హాజరైతే అంతకు ముందు, వచ్చిన తరువాత ఏ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఎవరు అడిగినా దరఖాస్తు చేసుకున్న48 గంటల్లో ఇవ్వాలని ఆదేశించారు. అలాగే భాస్కర్ విజయసాయి పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుంటే రూ.60వేలు కట్టించుకున్నారు. అప్లికేషన్లో మాత్రం నాట్ ఎలిజబుల్ అంటూ రిజెక్టు చేశారు, అసలు రిజెక్టు చేసిన వ్యక్తి నుంచి అంత డబ్బు ఎందుకు కట్టించుకున్నారు? దీనిపై సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. బాధితుని వద్ద కట్టించుకున్న రూ.60వేలకు వడ్డీతో కలిపి చెల్లించాలంటూ ఆదేశించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎలాగూ సమాచారం ఇవ్వడం మీకు చేతకాదు, సమాచారం కోసం వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో హెచ్చరించినా మీలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. సమాచారం కోసం వచ్చేవారిని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. వంశీకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన కేసులో వడమాల పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కమిషన్ ముందు హాజరు కాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25వేల జరిమాన విధిస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేస్తూ, తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఒకసారి షోకాజ్ ఇస్తే వారి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఆగిపోతాయని దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేసుకోవాలని అధికారులకు సూచించారు. -
విశాఖ డీఆర్ఓపై కమిషనర్ తాంతియా పోలీసులకు ఫిర్యాదు
విశాఖ: డీఆర్ఓ, సమాచార కమిషనర్ల మధ్య ప్రోటోకాల్ రగడ అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చిన టవేరా వాహనం వద్దంటూ ఇన్నోవా కావాలని సమాచార కమిషనర్ తాంతియా పట్టుపట్టారు. అయితే ఆ స్థాయి తమకు లేదని తెలిపిన డీఆర్ఓ వెంకటేశ్వరరావు, సిబ్బంది పనితీరుపై తాంతియా మండిపడ్డారు. అంతేకాకుండా తనకు వాహనం కేటాయించలేదనే కారణంగా సమాచార సిబ్బంది సహాయంతో డీఆర్వోకు షోకాజ్ జారీ చేశారు. తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించాడని డీఆర్ఓపై విశాఖ టూటౌన్ పోలీసులకు తాంతియా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడమేకాకుండా 15 రోజుల్లో పూర్తి వివరాలతో తనముందు హాజరు కావాలని డీఆర్ఓ, కలెక్టర్లకు తాంతియా ఆదేశాలు జారీ చేశారు. -
తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ : సమాచార కమిషనర్ తాంతియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులు సిండికేట్లుగా ఏర్పడి సమాచార చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆమె శనివారమిక్కడ అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి రాకుండా కొన్ని ఆర్థిక బిల్లులను అడ్డదారిలో ఆమోదింపచేయించుకుంటున్నారని తాంతియా కుమారి పేర్కొన్నారు. ఈ అడ్డగోలు వ్యవహారాన్ని న్యాయపరంగా అడ్డుకుంటామని ఆమె తెలిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని తాంతియా కుమారి వెల్లడించారు. -
తాంతియా హల్చల్
కామారెడ్డి, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి శుక్రవారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. అధికారుల పనితీరును ఎండగట్టారు. ముందుగా ఆమె మున్సిప ల్ కార్యాలయాన్ని సందర్శించారు. సమాచార హక్కు చట్టం అమలు తీరుకు సంబంధించిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాధాలు తదితర విషయాలను తెలుసుకున్నారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడంపై ప్రశ్నించారు. చట్టంపై అధికారులకే అవగాహన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో.. కమిషనర్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి వార్డులను పరిశీలించారు. ఆయా వార్డుల్లో రోగులు తమ వెంట తెచ్చుకున్న బెడ్షీట్లే కనిపించడంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు బెడ్షీట్లు ఇవ్వడం లేదా అంటూ ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. గతంలో వచ్చిన బెడ్షీట్లు మాత్రమే ఉన్నాయని, వాటిని ఉతకడానికి పంపామని సూపరింటెండెంట్ చెప్పే ప్రయత్నం చేశారు. వంద పడకల ఆస్పత్రికి ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయిస్తున్నా.. కనీసం బెడ్షీట్లు సమకూర్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద పడకల ఆస్పత్రిలో అందుకు రెట్టింపు సంఖ్యలో బెడ్షీట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమాచార హక్కు చట్టానికి సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత ఉద్యోగి యాదగిరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 కాలమ్స్ ఉండే రిజిస్టర్లను వాడాలని సూచించారు. ఆస్పత్రిలో కనీసం సిటిజన్ చార్టర్ లేకపోవడం శోచనీయమన్నారు. వచ్చే నెలలో మళ్లీ కామారెడ్డికి వస్తానని, అప్పటి వరకు రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. వైద్యునిపై ఆగ్రహం ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న సమయంలో తనకు కరెంటు షాక్‌తో రెండు చేతులు పోయాయని, తనకు సర్టిఫికెట్టు కావాలని వస్తే ఇవ్వడం లేదని శాబ్దిపూర్ తండాకు చెందిన పంతులు నాయక్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడే ఉన్న వైద్యుడు సుధీర్.. ‘నీ ప్రాణాలు నిలిపిన నాపైనే ఫిర్యాదు చేస్తావా’ అంటూ కోపానికి వచ్చారు. దీంతో కమిషనర్ తాంతియాకుమారి సదరు వైద్యునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు చేతులు కోల్పోయిన వ్యక్తి సర్టిఫికెట్ కోసం వస్తే నా ముందే దూషిస్తావా’ అంటూ పది నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారు. రోగి విషయంలో సానుభూతితో వ్యవహరించి, సేవలందించాలని సూచించారు. కమిషనర్ వెంట డీపీఆర్ఓ ఘనీ, కామారెడ్డి ఆర్డీఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సుదర్శన్, ఎంపీడీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ బాలోజీనాయక్, సీఐలు దరావత్ కృష్ణ, సుభాష్‌చంద్రబోస్, ప్రొబెషనర్ డీఎస్పీ రమణారెడ్డి, ఎస్ఐ సాయన్నయాదవ్, ఐసీడీఎస్ సీడీపీఓ శశికళ, పంచాయతీరాజ్ ఈఈ సునీత తదితరులున్నారు. కార్యాలయాల ప్రారంభం సమాచారహక్కు చట్టం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యానగర్, అజంపురాలో ఏర్పాటు చేసిన కార్యాలయాలను కమిషనర్ ప్రారంభించారు. పట్టణంలోని పలు కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆమె శుక్రవారం రాత్రి కామారెడ్డిలో బస చేశారు. శనివారం గాంధారి మండలంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ సభ్యులు ఎంఏ సలీం, ఎంఏ హమీద్, నారాయణ, రవీందర్, విఠల్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్యాంగోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులూ మారండి..
దరఖాస్తుదారులకు స్వేచ్ఛ కల్పించాలి స్టేషన్‌కు రావాలంటే భయపడుతున్నారు సహ చట్టం కమిషనర్ తాంతియా కుమారి కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పోలీసు శాఖలో ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోందని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి అన్నారు. చాలా పోలీసుస్టేషన్లకు దరఖాస్తులు రాలేదని చెప్పడాన్ని పరిశీలిస్తే ప్రజలు పోలీసుల వద్దకు రావడానికి భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. శనివారం కలెక్టరేట్లోని ప్రగతిభవన్ హాలులో వివిధ శాఖల్లో సహ చట్టం అమలు తీరుపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల రీత్యా పోలీస్‌శాఖను తప్పు పట్టనప్పటికీ ఇతర శాఖల మాదిరిగానే సహచట్టం దరఖాస్తుదారులు నిర్భయంగా పొలీస్‌స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లాలోని గాంధారిలో సమాచారమడిగినందుకు దాడులకు పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలెందుకు తీసుకోలేదని కమిషనర్ ప్రశ్నించారు. సహచట్టం దరఖాస్తుదారులను రక్షించాల్సిన గురుతర బాధ్యత పోలీసు శాఖపై ఉందన్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రజలు కలెక్టర్ వద్దకు కూడ వెళ్ల గలుగుతున్నారన్నారు. దరఖాస్తులకు సంబంధించి రిజి ష్టర్ల నమోదు లేనందున నిజాంసాగర్ తహశీల్దార్‌కు మెమో జారీ చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువ భాగం రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నందున ఈ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు సహచట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజానికి వెన్నుముక లాంటి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందన్నారు.ఈ చట్టాన్ని కళాశాలల్లో అమలు చేయడమేకాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.పేదలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమీక్షలో ఏజెసీ శేషాద్రి,డీఆర్వో జయరామయ్య, పీఓ శ్రీనివాస్‌చారి,అదనపు ఎస్పీ సుదర్శన్‌రెడ్డి,ఆర్డీఓలు వెంకటేశ్వర్లు,మోహన్‌రెడ్డి,శివలింగయ్య,డీఎస్పీలు గౌసుద్దీన్, సురేందర్‌రెడ్డి,రాంరెడ్డి,అనిల్‌కుమార్,సీఐలు,ఎస్సైలు పాల్గొన్నారు. బందోబస్తు మధ్య ‘తాంతియా’ సమీక్ష తాంతియా కుమారి సమీక్ష సమావేశం భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద పో లీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సమీక్షలను కమి షనర్ ఉదయం, మధ్యాహ్నం త్వరగా ముగించారు.