అడిగిన సమాచారం ఇవ్వాల్సిందే
- రాష్ట్ర ఆర్‌టీఐ కమిషన్ తాంతియా కుమారి వెల్లడి
తిరుపతి కార్పొరేషన్ : సమాచార హక్కు చట్టం కింద ఆయా సంస్థలు సమాచారం ఇవ్వాల్సిందేనని అలా కాకుండా వారిని భయభ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్ లామ్ తాంతియా కుమారి అన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం, వైఎస్‌ఆ ర్ సమావేశ మందిరంలో బుధవారం ఆర్‌టీఐ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆమె విచారించారు.
పీలేరుకు చెందిన అడ్వకేట్ ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి అర్బన్, అక్కారంపల్లెలో సెటిల్‌మెంట్ అర్డర్లపై సమాచారం అడిగితే రెండేళ్లుగా ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. దీనికి డీఆర్‌వో ఒంగోలు శేషయ్య మాట్లాడుతూ తమవద్ద ఆ వివరాలు లేవని ఎండార్స్‌మెంట్ ఇచ్చామని వివరణ ఇచ్చారు. ఎండార్స్‌మెంట్ అంటే సమాచారం కాదు, అలా అని చేతులు దులుపుకుంటే సరికాదని కమిషనర్ సున్నితంగా హితవు పలికారు. ‘‘మీరు సరైన సమయంలో సమాచారం ఇస్తే మా వద్దకు రారుకదా, వారంలోగా సమాచారం ఇవ్వండి’’ అంటూ ఆదేశించారు.
ద్రవిడవర్సిటీకి సంబంధించి కేసులు ఎక్కువగా ఉన్నా అప్లైంట్‌లు హాజరు కాకపోవడంపై రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. పరీక్షలకు హాజరు కాకపోతే ఇంప్రూవ్‌మెంట్‌కు ఎలా అనుమతిస్తారు. ఒకవేళ హాజరైతే అంతకు ముందు, వచ్చిన తరువాత ఏ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారో సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. విద్యార్థులకు సంబంధించిన సమాచారం ఎవరు అడిగినా దరఖాస్తు చేసుకున్న48 గంటల్లో ఇవ్వాలని ఆదేశించారు.
అలాగే భాస్కర్ విజయసాయి పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకుంటే రూ.60వేలు కట్టించుకున్నారు. అప్లికేషన్‌లో మాత్రం నాట్ ఎలిజబుల్ అంటూ రిజెక్టు చేశారు, అసలు రిజెక్టు చేసిన వ్యక్తి నుంచి అంత డబ్బు ఎందుకు కట్టించుకున్నారు? దీనిపై సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. బాధితుని వద్ద కట్టించుకున్న రూ.60వేలకు వడ్డీతో కలిపి చెల్లించాలంటూ ఆదేశించారు. షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎలాగూ సమాచారం ఇవ్వడం మీకు చేతకాదు, సమాచారం కోసం వచ్చే వారిని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించడం సరికాదన్నారు.
గతంలో హెచ్చరించినా మీలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. సమాచారం కోసం వచ్చేవారిని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. వంశీకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన కేసులో వడమాల పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కమిషన్ ముందు హాజరు కాకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25వేల జరిమాన విధిస్తూ, షోకాజ్ నోటీసు జారీ చేస్తూ, తన ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఒకసారి షోకాజ్ ఇస్తే వారి ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఆగిపోతాయని దీనిని దృష్టిలో ఉంచుకుని పనిచేసుకోవాలని అధికారులకు సూచించారు.