- దరఖాస్తుదారులకు స్వేచ్ఛ కల్పించాలి
- స్టేషన్‌కు రావాలంటే భయపడుతున్నారు
- సహ చట్టం కమిషనర్ తాంతియా కుమారి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లా పోలీసు శాఖలో ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోందని సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియా కుమారి అన్నారు. చాలా పోలీసుస్టేషన్‌లకు దరఖాస్తులు రాలేదని చెప్పడాన్ని పరిశీలిస్తే ప్రజలు పోలీసుల వద్దకు రావడానికి భయపడుతున్నట్లు స్పష్టమవుతోందన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్ హాలులో వివిధ శాఖల్లో సహ చట్టం అమలు తీరుపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల రీత్యా పోలీస్‌శాఖను తప్పు పట్టనప్పటికీ ఇతర శాఖల మాదిరిగానే సహచట్టం దరఖాస్తుదారులు నిర్భయంగా పొలీస్‌స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన వాతావరణం కల్పించాలన్నారు. జిల్లాలోని గాంధారిలో సమాచారమడిగినందుకు దాడులకు పాల్పడిన వారిపై ఇంతవరకు చర్యలెందుకు తీసుకోలేదని కమిషనర్ ప్రశ్నించారు.
సహచట్టం దరఖాస్తుదారులను రక్షించాల్సిన గురుతర బాధ్యత పోలీసు శాఖపై ఉందన్నారు. ఈ చట్టాన్ని ఉపయోగించి ప్రజలు కలెక్టర్ వద్దకు కూడ వెళ్ల గలుగుతున్నారన్నారు. దరఖాస్తులకు సంబంధించి రిజి ష్టర్ల నమోదు లేనందున నిజాంసాగర్ తహశీల్దార్‌కు మెమో జారీ చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువ భాగం రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నందున ఈ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు సహచట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజానికి వెన్నుముక లాంటి విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉందన్నారు.ఈ చట్టాన్ని కళాశాలల్లో అమలు చేయడమేకాకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.పేదలకు సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమీక్షలో ఏజెసీ శేషాద్రి,డీఆర్వో జయరామయ్య, పీఓ శ్రీనివాస్‌చారి,అదనపు ఎస్పీ సుదర్శన్‌రెడ్డి,ఆర్‌డీఓలు వెంకటేశ్వర్లు,మోహన్‌రెడ్డి,శివలింగయ్య,డీఎస్పీలు గౌసుద్దీన్, సురేందర్‌రెడ్డి,రాంరెడ్డి,అనిల్‌కుమార్,సీఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.
బందోబస్తు మధ్య ‘తాంతియా’ సమీక్ష
తాంతియా కుమారి సమీక్ష సమావేశం భారీ బందోబస్తు మధ్య జరిగింది. ఉదయం నుంచే ప్రగతి భవన్ వద్ద పో లీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సమీక్షలను కమి షనర్ ఉదయం, మధ్యాహ్నం త్వరగా ముగించారు.